తగిలింది లాంచీయేనా.. తేలేదెప్పుడు..?

గోదావరిలో మునిగిన బోటు జాడ తెలిసిందా..? రెపో మాపో బోటును ఒడ్డుకు చేర్చనున్నారా..? ప్రమాదంలో మిస్సైన మరికొంతమంది ఆచూకీ తెలియనుందా..? ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకనున్నాయి. దాదాపు రెండు వారాల నుంచి కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును వెలికి తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకున్న వశిష్ట బోటు కోసం చేపట్టిన.. ఆపరేషన్ మొదటి రోజు ఉత్కంఠగా సాగింది. కాకినాడకు చెందిన బోటు ధర్మాడి సత్యం […]

  • Publish Date - 9:11 pm, Mon, 30 September 19 Edited By:
తగిలింది లాంచీయేనా.. తేలేదెప్పుడు..?

గోదావరిలో మునిగిన బోటు జాడ తెలిసిందా..? రెపో మాపో బోటును ఒడ్డుకు చేర్చనున్నారా..? ప్రమాదంలో మిస్సైన మరికొంతమంది ఆచూకీ తెలియనుందా..? ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకనున్నాయి.

దాదాపు రెండు వారాల నుంచి కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును వెలికి తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకున్న వశిష్ట బోటు కోసం చేపట్టిన.. ఆపరేషన్ మొదటి రోజు ఉత్కంఠగా సాగింది. కాకినాడకు చెందిన బోటు ధర్మాడి సత్యం బృందం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు జరిపిన ఆపరేషన్‌లో కచ్చులూరు దగ్గర లంగర్లకు వశిష్ట బోటు తగిలిందని అందరూ భావిస్తున్నారు. అయితే వరద ఉధృతి పెరగడం, చీకటి పడటంతో మొదటి రోజు వెలికితీత పనులను నిలిపివేశారు. రేపు మరలా బోటు బయటికొచ్చేంత వరకు ప్రయత్నాలు కొనసాగుతాయి.

మరోవైపు ఇప్పటివరకూ 36 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 15 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోంది. బోటు దాదాపు 210 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. బోటు ఇప్పటికే ఇసుకలో కూరుకుపోవడంతో వెలికితీత అత్యంత కష్టంగా మారింది. అయితే, బోటును వెలికితీయడం కోసం కావాల్సిన.. ఇనుపరోప్‌‌లు, పెద్ద పెద్ద తాళ్లు, రివర్స్ పంట్లు, పొక్లెయినర్లను గోదావరి ఒడ్డుకు తరలించారు.

ధర్మాన సత్యం టీంలో మొత్తం 22 మంది ఎక్స్‌పర్ట్స్.. 25 మంది మత్స్యకారులు ఉన్నారు. బోటు మునిగిన ప్రాంతం నుంచి దాదాపు 8 వందల అడుగుల దూరంలో క్రెయిన్, పొక్లెయినర్లను ఉంచారు. నదిలోకి దిగకుండానే బోటు, పంటు సహాయంతో నీటిలోకి లంగర్లను జార విడిచారు. లంగర్లను నీటిలో జారవిడిచినప్పుడు.. బలమైన వస్తువు తగిలినట్లు ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. అది మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే నీటి అడుగున ఉన్న వస్తువులను బయటకు తీసే ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, ఆ వస్తువు బోటా? కాదా? అన్నది తెలియాలంటే మరికాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. బోటు వెలికితీత పనులు ముమ్మరంగా సాగుతుండడంతో సమీపంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పనులకు ఆటంకం కలగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.