Endowment officials: నిన్నటి విశాఖ ఎండోమెంట్ అధికారుల వివాదం ఇవాళ అమరావతికి చేరింది. ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో, దేవాదాయ అధికారుల పంచాయితీపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. అసలు, వివాదానికి కారణమేంటనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిజంగానే లైంగిక వేధింపులా? లేక ఆధిప్యత పోరా? ఇంకేదైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
అయితే, తనపై దాడి వెనుక అసిస్టెంట్ కమిషనర్ శాంతి అవినీతే కారణమంటున్నారు డిప్యూటీ కమిషనర్. జ్ఞానాపురం ఎర్నిమాంబ దేవాలయ ఈవో శ్రీనివాసరాజు.. హుండీ లెక్కింపులో అవకతవకలకు పాల్పడటంతో సస్పెండ్ చేశామన్నారు. అంతేకాదు, సదరు శ్రీనివాసరాజు.. అసిస్టెంట్ కమిషనర్ శాంతికి అత్యంత సన్నిహితుడని డీసీ అంటున్నారు. అందుకే, అనకాపల్లి దేవాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తోన్న శ్రీనివాసరాజుకు అదనంగా అనేక బాధ్యతలు అప్పగిస్తూ అతనిచేత అవినీతి చేస్తూ వాటాలు పంచుకుంటున్నారనేది డిప్యూటీ కమిషనర్ ఆరోపిస్తున్నారు. వీళ్ల అవినీతిని అడ్డుకున్నందుకే అసిస్టెంట్ కమిషనర్ శాంతి తనపై దాడి చేసిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు డీసీ. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా అందజేశారు.
డీసీ ఆరోపణలు ఇలాగుంటే, అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాదన మరోలా ఉంది. శ్రీనివాసరాజు సమర్ధవంతంగా పని చేయడం వల్లే తాను ప్రోత్సహించానని.. ఇది తప్పెలా అవుతుందని అంటున్నారు. శ్రీనివాసరాజుతో తనకు లేనిపోని సంబంధాలు అంటగట్టి డిప్యూటీ కమిషనర్ ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని.. కానీ, ఇలా సంబంధాలు అంటగడితే ఎలాగంటూ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రోదిస్తోంది. డీసీ తప్పుడు ప్రచారంతో.. పెళ్లైన తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కన్నీళ్లు పెట్టుకుంటోంది.
అవినీతిని అడ్డుకున్నాననే కోపం, ఈవో శ్రీనివాసరాజు సస్పెన్షన్ ను జీర్జించుకోలేకే ఏసీ శాంతి తనపై దాడి చేసిందనే డిప్యూటీ కమిషనర్ వాదన. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే ఇసుక పోశాననేది అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆవేదన. మరి, వీళ్లద్దరి ఫిర్యాదులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది చూడాలి. అయితే, ఏసీ, డీసీ చర్యలతో దేవాదాయ ప్రతిష్ట రోడ్డున పడిందని భక్తులు అంటున్నారు. పవిత్రమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇలా బజారున పడటం సరికాదంటున్నారు.