Andhra Pradesh: ఏపీ ముఖచిత్రాన్నే మార్చే ప్రాజెక్టుకు సర్వం సిద్దం

ఏపీ ముఖచిత్రాన్నే మార్చే ప్రాజెక్టు అది. కేంద్రం ఎప్పుడో అనుమతినిచ్చిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు నిధుల కేటాయింపులు జరగనున్నాయి. భూసేకరణతో సహా మొత్తం ఖర్చును భరించటానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏమిటా ప్రాజెక్ట్‌? దానితో ఏపీ ముఖ చిత్రం ఎలా మారుతుంది?

Andhra Pradesh: ఏపీ ముఖచిత్రాన్నే మార్చే ప్రాజెక్టుకు సర్వం సిద్దం
Outer Ring Road (Representative image)
Follow us

|

Updated on: Jul 10, 2024 | 7:06 PM

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనటానికి ఎన్నో ఉదంతాలున్నాయి. తాజాగా ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్నే తీసుకుంటే.. ఉమ్మడి ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భంలో విభజిత రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. స్వయంగా విజనరీ అయిన చంద్రబాబు ఏపీని కొత్తగా డిజైన్‌ చేయటానికి ఎన్నో ప్రణాళికలు రచించారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థికంగా వెనుకబడిన ఏపీని గాడిన పెట్టటానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రాజెక్టులకు రూప కల్పన చేశారు. అందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది అమరావతి చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించి పనులు మొదలు పెట్టాలనుకునేలోగా రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. వైసీపీ పాలనలో అమరావతి అంశమే మూలన పెట్టారు. దీంతో అనివార్యంగా ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు మసకబారింది.

మోదీ ప్రభుత్వానికి బాబు సహకారం ఎంతో కీలకం

అనూహ్యంగా 2024 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో ఏర్పాటయ్యింది. దీనికితోడు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు సహకారం ఎంతో కీలకంగా మారింది. ఇంకేముంది అధికారంలోకి వచ్చీ రావటంతోనే సీఎం చంద్రబాబు అమరావతికి ఆక్సిజన్‌ అందించారు. రాజధాని పునర్నిర్మాణ దిశగా చకచకా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు మూలన పడిన ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించే పని పెట్టుకున్నారు. బాబు కోరిందే తక్షణం కేంద్రం కూడా ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌కు నిధులివ్వటానికి ముందుకొచ్చింది.

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.25వేల కోట్లు

అమరావతి చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లాల గుండా నిర్మించే 189కి.మీటర్ల అవుటర్‌ రింగ్‌ రోడ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి సిద్ధమైంది., మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 25వేల కోట్లుగా లెక్కగట్టారు. భూసేకరణతో సహా మొత్తం ఖర్చును కేంద్రప్రభుత్వమే భరిస్తుందని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయనున్నారు. దీంతో ఓఆర్‌ఆర్‌కు మహర్దశ వచ్చినట్టేనని ఏపీ ప్రజలు మరీ ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌ పరిసర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్పాట్‌.. బైట్స్‌

ఏపీ ఆర్థిక స్థితిని గడ్కరీకి తెలిపిన బాబు

ఈ ఏడాది బడ్జెట్‌లోనే 5వేల నుంచి 10 వేల కోట్ల నిధులు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భూ సేకరణ ఖర్చు కూడా కేంద్రమే భరించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. చంద్రబాబు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం విశేషం. 2018లో ఈ ప్రాజెక్టును మొదటిసారి ప్రతిపాదించినప్పుడు అంచనా వ్యయం 17వేల కోట్లు. ఐదేళ్లుగా దీన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇప్పుడు అంచనా వ్యయం పెరిగి అది కాస్త 25వేల కోట్లకు చేరుకున్నది. అంటే జగన్‌ ప్రభుత్వ వైఖరి వల్ల 8వేల కోట్లు భారం అదనంగా పడింది.

6 లేన్ల యాక్సెస్‌ కంట్రోల్‌తో ఎక్స్‌ప్రెస్‌ వే

చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన ప్లాన్‌ ప్రకారం ఓఆర్‌ఆర్‌ మొత్తం 189 కిలోమీటర్లు. తూర్పు భాగంలో 78 కిలోమీర్లు కాగా.. పశ్చిమంలో 111 కిలోమీటర్లు. మొత్తం 3 దశల్లో 11 ప్యాకేజీలుగా ఓఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించారు. 6 లేన్ల యాక్సెస్‌ కంట్రోల్‌తో ఎక్స్‌ప్రెస్‌ వేగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఓఆర్‌ఆర్‌ విస్తరించనున్నది. 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా ఓఆర్‌ఆర్‌ నిర్మితమవుతుంది. ఇందులో మొత్తం 9 ఇంటర్‌ఛేంజ్‌లుంటాయి. కొండ ప్రాంతాల్లో మూడు టన్నెల్స్‌ నిర్మిస్తారు. వీటితో పాటు 14 ఓవర్‌ బ్రిడ్జీలు కూడా నిర్మిస్తారు. ఇక 78 అండర్‌పాస్‌లు కూడా నిర్మాణమవుతాయి. స్పాట్‌ః

అమరావతి చుట్టూ ఉన్న పట్టణాలు కలిసి మెగా సిటీ

ఓఆర్‌ఆర్‌ పూర్తయితే అటు ఏపీతోపాటు ఇటు అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఏపీ ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మాణ వ్యయం భరిస్తున్నది. దీని వల్ల రాష్ట్ర అభివృద్ధితోపాటు తమ కలల రాజధాని అమరావతితో పలు నగరాలకు దూరం తగ్గి, కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇది అంతిమంగా ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుంది. ఓఆర్‌ఆర్‌తో లోపలి భూములే కాక ఓఆర్‌ఆర్‌ బయట ఉన్న భూములకు మంచి డిమాండ్‌ వస్తుంది. ఈ ప్రాంత భూములు బంగారం అవుతాయి. ఎన్నో ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రంగా మారిపోతుంది. ఓఆర్‌ఆర్‌ బయట కొన్ని కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉండబోతున్నది. అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాలు కలిసిపోయి ఓ మహానగరంగా మారిపోయే అవకాశమున్నది.

చాలా నగరాల్లో ఓఆర్‌ఆర్‌లు చూస్తుంటాం.. వీటిని ప్రధానంగా ఆయా నగరాల్లో జనాభా పెరగటం వల్ల భరించలేని స్థాయికి చేరుకున్న ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు నిర్మించారు. దీంతో పాటు కొత్త ప్రాంతాలకు కూడా అభివృద్ధిని విస్తరించేందుకు ఔటర్‌ రింగ్‌ రోడ్లు ఉపయోగపడ్డాయి. అయితే అమరావతి చుట్టూ నిర్మించే ఓఆర్‌ఆర్‌ వీటికి భిన్నంగా రూపొందుతున్నది. అమరావతి చుట్టూ ఉన్న ప్రాంతాలను ఓ ప్రణాళిక ప్రకారం డెవలప్‌ చేయాలన్న లక్ష్యంతో రాజధానికి లింక్‌ గా ఉండేలా ఓఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు.

రెండువైపులా 150 మీటర్ల సర్వీస్‌ రోడ్లు

ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల గుండా సీఆర్‌డీఏ పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నారు. రెండు వైపులా 150 మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్లు, ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు 3వేల 404 హెక్టార్ల భూమి సేకరించాలి. దీనికి 4వేల 198 కోట్ల ఖర్చు అవుతుందని 2018లో అంచనా వేశారు. ఐదేళ్లు గడిచిపోవడంతో భూసేకరణ వ్యయం భారీగా పెరిగే అవకాశమున్నది. ఈ ప్రాజెక్టుకు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం అవుటర్‌ రింగ్‌ రోడ్ ఫర్‌ న్యూ క్యాపిటల్‌ సిటీ అని పేరు పెట్టింది.

కృష్ణానదిపై రెండు ఐకానిక్‌ బ్రిడ్జ్‌లు

కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే నేషనల్‌ హైవేస్‌, స్టేట్‌ హైవేస్‌ తో పాటు జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్‌ఆర్‌ క్రాస్‌ చేస్తుంది. ఓఆర్‌ఆర్‌లో భాగంగా కృష్ణా నదిపై రెండు ఐకానిక్ బ్రిడ్జిలను నిర్మిస్తారు. అమరావతి ఆలయానికి సమీపంలో ఒక బ్రిడ్జి, తొట్లవల్లూరు దగ్గర మరో బ్రిడ్జిని నిర్మిస్తారు. ఇవేగాకుండా ఓఆర్‌ఆర్‌ రూట్‌లో 12 మెయిన్‌ బ్రిడ్జీలు, 51 స్మాల్‌ బ్రిడ్జిలు నిర్మిస్తారు. ఓఆర్‌ఆర్‌ లోపం మొత్తం 40 మండలాలున్నాయి.

ప్రస్తుతం అమరావతికి వెళ్లాలంటే విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి మీదుగా వెళ్లాల్సిందే. ఈ మార్గాల్లో నిత్యం విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది. పైగా చుట్టూ తిరిగి వెళ్లాలి. అదే ఓఆర్‌ఆర్‌ పూర్తయితే ఏపీలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో నేరుగా అమరావతిని చేరుకోవచ్చు. అమరావతికి ప్రతిపాదనలో ఉన్న మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు చెరోవైపు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఈ రెండు పోర్టులు ఓఆర్‌ఆర్‌ వల్ల దగ్గరవుతాయి. అలాగే అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లకు చాలా సులభంగా చేరుకోవచ్చు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ట్రాఫిక్‌ విజయవాడను టచ్‌ చేయాల్సిన అవసరమే రాదు. అన్నింటికీ ఓఆర్‌ఆర్‌ చక్కటి పరిష్కారం. ఓఆర్‌ఆర్‌ బయట ఉన్న చాలా ప్రాంతాలను అర్బన్‌ నోడ్స్‌గా, మరికొన్నింటిని గ్రోత్‌ సెంటర్లుగా డెవలప్‌ చేయాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. దీనికి తోడు 17 టౌన్‌షిప్‌లు డెవలప్‌ చేయాలన్న ప్రతిపాదన కూడా బాబు దగ్గర ఉన్నది.

ప్రజలిచ్చిన అధికారాన్ని ఈ ఐదేళ్ల పాటు అభివృద్ధి పనులకు కేటాయించి అప్పుల ఊబినుంచి ఏపీని గట్టెక్కించినట్లయితే చంద్రబాబు ప్రభుత్వానికి తిరుగుండదు. అన్నీ సవ్యంగా జరగాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..