ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు స్తున్నాయని, ఉత్తర కోస్తాలో ఈరోజు,రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని.. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తాలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురుస్తాయని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందిని పేర్కొన్నారు. రాయలసీమలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు.
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతోందని అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అనేకచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఒడిశా, తీర ప్రాంతాలు-ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..