TDP-Janasena: టీడీపీ ఆందోళ‌న‌ల్లో క‌న‌బ‌డని జనసైనికులు.. అన్నీ ఆ తర్వాతే అంటున్న ఇరు పార్టీలు..

| Edited By: Sanjay Kasula

Oct 17, 2023 | 12:26 PM

రెండు పార్టీల నుంచి క‌మిటీల ఏర్పాటు కాస్త ఆల‌స్యం అయింది. జ‌న‌సేన త‌రపున స‌మ‌న్వయ క‌మిటీ నియామ‌కం జ‌రిగిన చాలా రోజుల త‌ర్వాత తెలుగుదేశం పార్టీ స‌మ‌న్వయ క‌మిటీని నియ‌మించింది. జేఏసీ ఏర్పాటు కంటే ముందుగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జ‌రిగింది. పొత్తుల ప్రక‌ట‌న త‌ర్వాత జ‌రిగిన ఈ వారాహి విజ‌య‌యాత్రకు టీడీపీ కూడా క‌లిసొచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీటింగ్‌లలో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో..

TDP-Janasena: టీడీపీ ఆందోళ‌న‌ల్లో క‌న‌బ‌డని జనసైనికులు.. అన్నీ ఆ తర్వాతే అంటున్న ఇరు పార్టీలు..
Tdp Janasena
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన పొత్తు త‌ర్వాత రాజకీయ ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీతో క‌లిసి పోటీ చేస్తాన‌న్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రక‌ట‌న రెండు పార్టీల నేత‌లు, కార్యక‌ర్తల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అయితే ప‌వ‌న్ ప్రక‌ట‌న త‌ర్వాత వారం ప‌ది రోజులు రెండు పార్టీలు క‌లిసి ప‌లు కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. భ‌విష్యత్తులో రెండు పార్టీలు క‌లిసి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించేందుకు ఉమ్మడి కార్యాచ‌ర‌ణ క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రకటించారు.

అయితే రెండు పార్టీల నుంచి క‌మిటీల ఏర్పాటు కాస్త ఆల‌స్యం అయింది. జ‌న‌సేన త‌రపున స‌మ‌న్వయ క‌మిటీ నియామ‌కం జ‌రిగిన చాలా రోజుల త‌ర్వాత తెలుగుదేశం పార్టీ స‌మ‌న్వయ క‌మిటీని నియ‌మించింది. జేఏసీ ఏర్పాటు కంటే ముందుగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జ‌రిగింది. పొత్తుల ప్రక‌ట‌న త‌ర్వాత జ‌రిగిన ఈ వారాహి విజ‌య‌యాత్రకు టీడీపీ కూడా క‌లిసొచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీటింగ్‌లలో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ సైతం ప‌వ‌న్ స‌భ‌ల‌కు పార్టీ కార్యక‌ర్తలంతా హాజ‌రు కావాల‌ని సూచించారు.

దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవ‌నిగ‌డ్డ, పెడ‌న‌, కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన వారాహి విజ‌య‌యాత్రలో మాత్రమే టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక పొత్తు ప్రక‌ట‌న త‌ర్వాత చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా జ‌రుగుతున్న నిర‌స‌న‌ల్లో.. కేవలం ప‌లుచోట్ల మాత్రమే జ‌న‌సేన కేడ‌ర్ పాల్గొంది. కానీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన ప‌లు కార్యక్రమాల‌కు జ‌న‌సేన గైర్హాజ‌రు కావ‌డం చ‌ర్చగా మారింది.

టీడీపీ నిర‌స‌న కార్యక్రమాల్లో క‌న‌బ‌డ‌ని జ‌న‌సేన శ్రేణులు..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి విజ‌య‌యాత్రలో తెలుగుదేశం పార్టీ నేత‌లు, కార్యక‌ర్తలు హాజ‌ర‌య్యారు. ఇక‌పై అన్ని కార్యక్రమాల‌కు రెండు పార్టీలు క‌లిసే ముందుకు వెళ్తాయ‌ని ఆయా పార్టీల ముఖ్యనేత‌లు తెలిపారు. కానీ కొంత‌కాలంగా తెలుగుదేశం పార్టీ నిర‌స‌న‌ల్లో, ఆ పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో జ‌న‌సేన నేత‌లు క‌న‌బ‌డ‌టం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు నిర‌స‌న‌గా తెలుగుదేశం పార్టీ ఇప్పటివ‌ర‌కూ మూడు కీల‌క కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు పేర్లతో వ‌రుస‌గా మూడు ఆదివారాలు మూడు వినూత్న కార్యక్రమాల‌తో తెలుగుదేశం పార్టీ నిరస‌న తెలిపింది.

అయితే ఈ కార్య‌క్ర‌మంలో ఎక్క‌డా జ‌న‌సేన నాయ‌కులు గానీ కార్య‌క‌ర్త‌లు గానీ పాల్గొన‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చకు దారి తీసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యం అంటూ పార్టీల‌క‌తీతంగా పోరాడ‌తామ‌ని చెబుతున్న టీడీపీ-జ‌న‌సేన పార్టీలు.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఇంకా అనుకున్న విధంగా ముందుకెళ్ల‌లేక‌పోతున్నాయ‌ని రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది. ఓవైపు చంద్ర‌బాబు జైలులో ఉండ‌టం, మ‌రోవైపు వైర‌ల్ ఫీవ‌ర్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికే ప‌రిమితం కావ‌డంతో పార్టీ కార్య‌క్ర‌మాలు అనుకున్న స్థాయిలో జ‌ర‌గ‌డం లేదంటున్నారు.

అయిన‌ప్ప‌టికీ కీల‌క‌మైన కార్య‌క్ర‌మాల‌కు మిత్ర‌ప‌క్షం దూరంగా ఉండ‌టం ఏంటనే వాద‌న వినిపిస్తోంది. రెండు పార్టీలు రాజ‌కీయంగా ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. రెండు పార్టీల త‌ర‌పున నియ‌మించిన క‌మిటీ స‌మావేశం కూడా ఇంకా జ‌ర‌గ‌లేదు. దీంతో ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తే గానీ రెండు పార్టీలు క‌లిసి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేవంటున్నారు ఆయా పార్టీల నేత‌లు.

ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ త‌ర్వాతే క‌లిసి ఆందోళ‌న‌లు అంటున్న ఇరుపార్టీలు..

రెండు పార్టీలు పొత్తు కుదుర్చ‌కున్న త‌ర్వాత ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణపై ఇంకా స్ప‌ష్టత రాలేదు. జ‌న‌సేన పార్టీ ఆరుగురు స‌భ్యుల‌తో స‌మ‌న్వ‌య క‌మిటీ నియ‌మించింది. ఇక టీడీపీ కూడా ఐదుగురు స‌భ్యుల‌తో క‌మిటీ నియామకం పూర్తి చేసింది. ఈ రెండు క‌మిటీలు క‌లిసి ఉమ్మ‌డి స‌మావేశం ఏర్పాటు చేసుకుని భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ నిర్ణయించాల్సి ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కూ రెండు పార్టీలు ఎవ‌రికి వారే అన్న‌ట్లు ముందుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం