శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రలో యూరిన్ పోసిందని ఓ సవతి తండ్రి ఆమెకు వాతలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఓ మహిళ తన భర్తను వదిలేసింది. ఆ తర్వాత హిందూపురం బసవేశ్వర కాలనీలోని మరోవ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమెకు అమృత అనే ఆరేళ్ల కూతురు కూడా ఉంది. తన కూతురుతో కలిసి ఆ తల్లి మరో వ్యక్తితో కొన్నాళ్లుగా సహజీవం చేస్తోంది. రెండో తరగతి చదువుతున్న అమృత ఓ రోజు నిద్రలో మూత్రం పోసింది. దీంతో ఆగ్రహానికి గురైన సవతి తండ్రి ఆమెకు వాతలు పెట్టి.. చిత్రహింసలకు గురిచేశాడు. కానీ ఆమె కన్న తల్లి మాత్రం చూస్తూ ఊరుకుంది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమృత ఒంటిమీద వాతలు చూసి తల్లకి దేహశుద్ది చేశారు. ఆ చిన్నారి తన బాధను ఎవరికి చెప్పుకోలేక.. పాఠశాలకు వెళ్లాక కింద కూర్చునే స్థితిలో లేకపోవడంతో టీచర్లు ఆమెను అడిగారు. దీంతో అమృత తన సవతి తండ్రి చేసిన దారుణాన్ని వాళ్లకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఆ బాలికను వారు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అలాగే చిన్నారిపై క్రూరంగా ప్రవర్తించి…చిత్రహింసలు పెట్టిన తల్లి, సవతి తండ్రిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.