
Andhra Pradesh: విశాఖ బంగళాఖాత తీరంలో అత్యంత అరుదైన సీ హార్స్ అనే మత్స్య రకాన్ని గుర్తించారు మత్స్యకారులు. తాము పట్టిన రొయ్యల్లో విచిత్రమైన ఆకారం గల ఓ చేప రకాన్ని చూసి ఆశ్చర్య పోయారు రత్నం అనే మత్స్యకారుడు. ఇంతకీ దాన్ని అతను గుర్తించలేదు కానీ తమ దగ్గర రొయ్యలు కొన్న విజయ్ కుమార్ అనే ఓ ఔట్సాహిక వినియోగ దారుడు దాన్ని గుర్తించాడు. అది కూడా ఇంటికి వెళ్ళాక. ఇంట్లో రొయ్యల్ని బయటకు తీసి చూస్తే వింత ఆకారంలో ఒక చేపలాంటి ఆకారం కనిపించింది. ఆశ్చర్యం తో దానిని చూస్తే చాలా విచిత్ర ఆకారం లో ఉంది. దానిని తన వాట్సప్ స్టేటస్‌గా పెట్టడంతో ఆంధ్రా యూనివర్సిటీ కి చెందిన ఒక ప్రొఫెసర్ దానిని చూసి సీ హార్స్ – సముద్రపు గుర్రంగా గుర్తించి విజయ్ కు ఫోన్ చేసి దాని వివరాలు కనుక్కున్నారు. ఈ విధంగా విశాఖ తీరం లో సీ హార్స్ ఆనవాళ్లు బయట పడ్డాయి.
మత్స్యకారులు గతంలో ఎన్నడూ విశాఖ సముద్ర తీరంలో ఎన్నడూ చూడలేదట. సముద్ర గుర్రం అనేది గుర్రపు తలతో అసాధారణమైన చేప . సముద్ర గుర్రంలో 20 కంటే ఎక్కువ జాతులు లేదా రకాలు ఉన్నాయి. అవి వెచ్చని మరియు తేలికపాటి సముద్రాలలో మనుగడ సాగిస్తూ ఉంటాయి. తూర్పు తీరంలో ఈ అరుదైన సీ హార్స్ చేప రకం ఆనవాళ్లు పరిశోధకులకు ఆసక్తిని కలిగించాయి. వీటి గురించి విచారిస్తే ఇటీవల కాలంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు తరచూ చిక్కుతున్నాయట. తాజాగా విశాఖ మత్స్యకారుల వలకు ఈ సీ హార్స్ దొరకడం, నగరానికి చెందిన విజయ్‌కుమార్ సాయంత్రం హార్బర్‌లో రొయ్యలను కొనుగోలు చేయడం, ఇంటికి తెచ్చి చూడగా రొయ్యలతో పాటు ఈ సీ హార్స్ కూడా అందులో ఉండడం, దానిని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడంతో ఈ అరుదైన జీవి వ్యవహారం వెలుగు చూసింది.
ఈ సీ హార్స్ చేప రకం చూడటానికి చిన్నగా.. రెండు మూడు అంగుళాల సైజులో ఉంటుంది. చూడటానికి రొయ్యల్ని చూసినట్లే అనిపిస్తుంది. అందుకే ఈ సీ హార్స్ రొయ్యల్లో కలిసిపోతుండడం వల్ల మత్స్యకారులు పెద్దగా గుర్తించరు. ఈసారి కూడా అలానే రొయ్యల్లో కలిసి విజయ్‌కుమార్‌కు చిక్కాయి. ఈ సీహార్స్ సాధారణంగా ఉష్ణమండల, సమశీతోష్ణ జలాల్లో ఎక్కువ కనిపిస్తాయట. ఈ సీ హార్స్ లు ప్రధానంగా పగడపు దిబ్బలు, మడ అడవులు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయని పరిశోధకులు చెబుతుంటారు.
సీహార్స్ చేప రకం ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇవి నిట్టనిలువుగా నిలిచి ఈదుతాయట. వంకర మెడ, పొడవైన గొంతు, తల, శరీరం నిటారుగా ఉండి తోక వంకరగా ఉంటుంది. అంతేకాదు వీటికి పళ్లు ఉండవు, సముద్ర గుర్రాలు అవి పునరుత్పత్తి చేసే విధానంలో అసాధారణమైనవి. ఆడది మగ సీ హార్స్ తోక క్రింద ఒక పర్సులో గుడ్లు పెడుతుంది. మగ గుడ్లు పొదిగే వరకు వాటిని తీసుకువెళుతుంది. మగ సీహార్స్ తమ శరీరం ముందు భాగంలో సంతానాన్ని పొదగడానికి అనువైన ఒక సంచి వంటి అర ఉంటుంది. గర్భం దాల్చే సమయంలో ఆడ చేప గుడ్లను ఈ మగ చేప సంచిలోకి విడుదల చేస్తుందట, అప్పుడు మగ చేప వాటిని అంతర్గతంగా ఫలదీకరణ చేస్తాయట. ఫలితంగా పిల్లలు గుడ్లలో నుంచి బయటకు వచ్చాక వాటిని నీటిలోకి విడుదల చేస్తుందట. ఒకచోట సంతానాన్ని ప్రారంభిస్తే ఇక ఆ ప్రాంతాల్లో వాటి ఉనికిని గట్టిగా చాటుతాయట.
చాలా మంది ప్రజలు సముద్ర గుర్రాలను తెగ ఇష్టపడతారట. ఎందుకంటే వాటి ఆసక్తికరమైన రూపం తో వీటిల్ని అక్వేరియంలో ఉంచుకుంటారు. కొన్ని చోట్ల ఈ సముద్ర గుర్రాలను ఔషధాలలో ఉపయోగిస్తారట. ఇంత స్టోరీ ఉంది వీటి వెనుక.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..