ఆ జిల్లాలో క్షణక్షణం, భయం భయం.. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి.. అసలు అక్కడ ఏం జరుగుతుంది?

ఆ జిల్లాలోని ప్రజలు గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఏం జరుగుతుందా అని క్షణక్షణం భయం భయంతో గడుపుతున్నారు. రాత్రింబవళ్లు కంటిమీట కునుకు లేకుండా జీవనం సాగిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది. ఆ గ్రామంలోని ప్రజలు ఎందుకు అంత భయంతో గడుపుతున్నారు. వాళ్లు అంతలా భయపడేది దేనికో తెలుసా.. ఏనుగుల గురించి. అవును ఏనుగులే గత కొన్ని రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు హల్చల్‌ చేస్తోంది. రోడ్లపైకి వచ్చి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తూ భీభత్సం సృష్టస్తుంది.

ఆ జిల్లాలో క్షణక్షణం, భయం భయం.. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి.. అసలు అక్కడ ఏం జరుగుతుంది?
Manyam District

Edited By:

Updated on: Apr 27, 2025 | 11:09 AM

వివరాల్లోకి వెళితే..

పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఓ ఏనుగుల గుంపు హల్చల్‌ చేస్తోంది. రోడ్లపైకి వచ్చి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తూ భీభత్సం సృష్టస్తుంది. పలు మండలాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లో ఏనుగులు యధేచ్చగా స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా హల్ చల్ చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఏనుగులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. గరుగుబిల్లి మండలం నందివానివలసలో అర్ధరాత్రి పెద్ద ఎత్తున గీంకారాలు చేస్తూ గ్రామంలో సంచరించాయి. తెల్లవారుజామున గ్రామంలో ఉన్న మోడరన్ రైస్ మిల్లు లోకి చొరబడ్డాయి. అక్కడ నిల్వ ఉన్న ధాన్యంను చెల్లాచెదురు చేశాయి. అంతటితో ఆగకుండా మిల్లు ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి ఏనుగులు చేసిన వీరంగంతో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రాత్రి మొత్తం ఏం జరుగుతుందో.. ఆ ఏనుగుల గుంపు తమ ఇంటిపైకి ఎక్కడోస్తుందోనని స్థానికులు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.

అయితే గత కొన్నేళ్లుగా మన్యం జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో స్థానికులను కలవరపాటుకు గురవుతున్నారు. పదేళ్ల క్రితం ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఏనుగుల గుంపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ రైతుల పంటలు నాశనం చేస్తున్నాయి. ఏనుగులు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయో తెలియక స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటివరకు ఏనుగుల దాడిలో దాదాపు తొమ్మిది మంది మృతి చెందారు. సుమారు నలభై మంది వరకు గాయాల పాలయ్యారు. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఏనుగుల దాడిలో జరుగుతున్న పంట నష్టానికి అధికారులు అంచనా వేసి నష్ట పరిహారం ఇస్తున్నప్పటికీ అది కొద్దిపాటి ఉపశమనం తప్పా పూర్తిస్థాయి నష్టపరిహారం మాత్రం కాదని రైతులు అంటున్నారు.

ఏనుగులు తమ జీవనోపాధిని నాశనం చేస్తుంటే అధికారులు మాత్రం పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ఏనుగులను ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానికంగా ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఏనుగులు ఇప్పటికే అనేక మందిని పొట్టన పెట్టుకున్నాయని, ఇంకా ఎంత మందిని బలి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణాలకు విలువే లేదా? మేము బ్రతికేది ఎలా? అంటూ అధికారులను నిలదీస్తున్నారు. తక్షణమే తమకు ఏనుగుల నుండి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….