Andhra Pradesh: ఒకే ఒక్క విద్యార్థి కోసం అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం.. ఎక్కడో తెలుసా..?

| Edited By: Balaraju Goud

Oct 27, 2024 | 8:10 PM

అలా వందకు మందిపైగా స్ట్రెంత్ ఉన్న కాసేపల్లి మండల పరిషత్ పాఠశాలలో ఇప్పుడు కుళ్లాయమ్మ ఒక్కతే విద్యార్థిని..

Andhra Pradesh: ఒకే ఒక్క విద్యార్థి కోసం అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం.. ఎక్కడో తెలుసా..?
One Student One Teacher
Follow us on

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా.. ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచుతూ… విద్యనందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఎందుకో ఇంకా చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపే చూస్తున్నారు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఓ పాఠశాల.. ప్రస్తుతం వెలవెలబోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి అని విద్యాశాఖ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి ఇష్టపడడం లేదు. ఒకప్పుడు వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలలో రానురాను విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి.. ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే మిగిలారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆ ఒక్క విద్యార్థి స్టోరీ ఏంటో తెలుసుకుందాం..!

బుడిబుడి అడుగులు వేసుకుంటూ… స్కూల్ బ్యాగ్ తగిలించుకుని నడుస్తున్న చిన్నారి పేరు కుళ్లాయమ్మ. ఒకటో తరగతి చదువుతున్న కుళ్లాయమ్మ కోసమే ఆ గ్రామంలో ఇంకా ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా ఉంది. అంటే… అవునా?నిజమా? అంటారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థికి.. ఒక టీచర్ ఉన్నారు. ఒకప్పుడు వందకు పైగా విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం కుళ్లాయమ్మ ఒక్కటే విద్యార్థిని. ఒకటో తరగతి చదువుతున్న కుళ్లాయమ్ముకు.. అన్ని తానే అయి టీచర్ నికిత చూసుకుంటున్నారు.

టీచరైన, ఫ్రెండ్ అయినా, తోటి విద్యార్థి అయిన ఉపాధ్యాయురాలు నికిత విద్యార్థిని కుళ్లాయమ్మకు విద్యా బోధన చేస్తున్నారు. విద్యార్థిని కుళ్లాయమ్మకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేక స్కూలుకు రాకపోయినా.. పాఠశాలలో ఒక్కటే విద్యార్థి అవడంతో టీచర్ నికిత కుళాయమ్మ ఇంటికి వెళ్లి మరి క్షేమ సమాచారం కనుక్కుంటోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అయినా గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఇష్టపడలేదు.

గత కొన్ని సంవత్సరాలుగా కాశేపల్లి గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు దగ్గర్లోనే ఉన్న గుత్తి పట్టణంలోని ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. అదేవిధంగా కాశేపల్లి మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కేవలం 5వ తరగతి వరకు మాత్రమే విద్యాబోధన ఉండడంతో.. ఆరవ తరగతి నుంచి మళ్లీ వేరే స్కూల్లో ఎలా అయినా చేర్పించాలి. కాబట్టి.. అప్పుడైనా దగ్గర్లోనే ఉన్న గుత్తి పట్టణానికి గాని.. పామిడి కి గాని పిల్లలను ప్రైవేటు స్కూల్లో చేర్పించడానికి వెళ్లాల్సిందే. దీంతో కాశేపల్లి గ్రామంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించకుండా ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు.

అలా వందకు మందిపైగా స్ట్రెంత్ ఉన్న కాసేపల్లి మండల పరిషత్ పాఠశాలలో ఇప్పుడు కుళ్లాయమ్మ ఒక్కతే విద్యార్థిని.. ఈ సంవత్సరం కుళ్లాయమ్మ ఒక్కతే విద్యార్థిని.. గత ఏడాది కనీసం ఇద్దరైనా కాసేపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఆ ఇద్దరు విద్యార్థులను కూడా ఈ ఏడాది వేరే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వడంతో.. కాశేపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు.. విద్యాశాఖ అధికారులు గ్రామంలో తిరిగి చివరకు కుళ్లాయమ్మ తల్లిదండ్రుల ఒప్పించి పాఠశాలలో జాయిన్ చేశారు. లేదంటే కుళ్లాయమ్మ కూడా కాశేపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కాకపోతే.. ఈపాటికే పాఠశాల మూతపడి ఉండేది.

అన్నింటికంటే విచిత్రం ఏంటంటే ఒక స్కూలు… ఒక టీచర్.. ఒక విద్యార్థి ఉన్న కాసేపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కూడా అమలవుతోంది. మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ దక్కించుకున్న కాంట్రాక్టర్.. ఇంటి వద్ద కుళ్లాయమ్మ కోసం భోజనం సిద్ధం చేసి పాఠశాల తీసుకొచ్చి ఆయమ్మ వడ్డిస్తున్నారు. ఫ్రెండ్స్, తోటి విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ఒకటో తరగతి విద్యార్థిని కుళ్లాయమ్మ చదువుకున్నంతసేపు చదువుకుని.. ఒక్కతే ఆడుకుంటుంది. కాశేపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినా.. పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులను ఎందుకు చేర్పించడం లేదో అర్థం కావడం లేదు అంటున్నారు టీచర్ నికిత.

ఇంకా విచిత్రకరమైన విషయం ఏంటంటే ఈపాటి స్కూల్ ను ఎంఈఓ తనిఖీ చేయడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఒక టీచర్.. ఒక విద్యార్థిని ఉన్న కాశేపల్లి ప్రభుత్వ పాఠశాలను ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పెదవుడుగూరు ఎంఈఓ తనిఖీ చేస్తున్నారు. కాసేపల్లి గ్రామంలో 500 కుటుంబాలు ఉన్నప్పటికీ… ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి మాత్రమే జాయిన్ అవ్వడంతో.. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ఒక్క విద్యార్థిని అయినా చేరుతుందా? లేదా? అన్న అనుమానాలు విద్యాశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి గత ఏడాది ఇద్దరు విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వడంతో… స్కూల్ ను వేరే పాఠశాలలో విలీనం చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ వాయిదా పడింది. మరి వచ్చే సంవత్సరం కూడా స్ట్రెంత్ పెరగకపోతే ఇక కాశేపల్లి ప్రభుత్వ పాఠశాల మూతపడడం ఖాయం అన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కాశేపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పై జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు.. ఇక కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..!

వీడియో చూడండి..

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..