Guntur: స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం
బడికి వెళ్లిన పిల్లవాడు బావిలో శవమై తేలాడు. గుంటూరు జిల్లా పొన్నెకల్లులో సమీర్ అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. పోలీసులు, కొందరు పెద్దల వైఖరి వివాదాస్పదంగా మారింది.
గుంటూరు జిల్లా పొన్నెకల్లులో సమీర్ అనే 9వ తరగతి విద్యార్ధి అనుమానాస్పద మరణం సంచలనంగా మారింది.. గత నెల 24న పొన్నెకల్లు శివారులోని ఓ పొలం బావిలో సమీర్ మృతదేహం కన్పించింది. బావిలో నీటిని మొత్తాన్ని తోడి అతికష్టం మీద డెడ్‌బాడీని బయటకు తీశారు స్థానికులు,ఫైర్ సిబ్బంది. స్నేహతులతో కలిసి ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడా? లేదంటే పథకం ప్రకారమే ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమీర్‌ను తోటి స్నేహితులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు అతని నాన్నమ్మ మస్తాన్ బీ . గతంలో సమీర్‌తో కొందరు విద్యార్థులు గొడవపడ్డారన్నారు. అనుమానాలున్నాయని ఇంత స్పష్టంగా చెప్పినా పోలీసులు స్పందించలేదని, డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్‌కు కూడా పంపలేదన్నారు. మరోవైపు కొందరు పెద్దలు కేసు రాజీ చేసుకోవాలని తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ కర్లపూడి సర్పంచ్ సాయంతో స్పందన కార్యక్రమంలో ఉన్నతాధికారులను ఆశ్రయించారు. సమీర్ అనుమానాస్పద మరణంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని కోరారు. రాజీబేరం చేసిన సదరు పెద్దలు సహా సమీర్ మరణానికి కారకులైన వారిని చట్టపరంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు.
అధికారుల ఆదేశాలతో తాడికొండ సీఐ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. కర్లపూడిలో సమీర్ మృతదేహాన్ని వెలికి తీసి అమరావతి ఎమ్మార్వో, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. సమీర్ ప్రమాదవశాత్తు చనిపోయాడా? బంధువులు ఆరోపిస్తున్నట్టు హత్యా? ఒంటిపై గాయాలున్నా సరే పోలీసులు ఎందుకని పోస్ట్‌మార్టమ్ నిర్వహించలేదు. 50వేలు ఇచ్చి కేసు రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేసిన పెద్దలు ఎవరు? సమీర్ నాన్నమ్మ ఆరోపిస్తున్నట్టుగా అతనిది హత్యేనా? నిజానిజాలేంటో ఇక దర్యాప్తులో తేలాల్సి వుంది. సమీర్ అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనం రేపింది. నిజానిజాలు తేల్చి నిందితులను కఠినంగా శిక్షించడం సహా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..