AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్.. ఇక వారికి నో ఎంట్రీ..

అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. మరిన్ని కఠిన చర్యలతో అన్యమత ప్రచారంపై చెక్ పెట్టింది. అన్యమత ఉద్యోగులను సాగనంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్యమత ప్రచారంపై కేసులు, హిందూయేతర ఉద్యోగులను గుర్తించి నోటీసులు ఇచ్చిన టీటీడీ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది.

Tirumala: తిరుమలలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్.. ఇక వారికి నో ఎంట్రీ..
TTD
Raju M P R
| Edited By: |

Updated on: Nov 20, 2024 | 12:08 PM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం.. హిందూయేతరులు కొలువుల్లో కొనసాగేందుకు వీళ్లేని స్వయం ప్రతిపత్తి గల ఆధ్యాత్మిక సంస్థ. అయితే మరోసారి అన్యమత ప్రచారం, హిందూయేతర ఉద్యోగుల అంశం టీటీడీలో తెర మీదకు వచ్చింది. గత కొన్నేళ్లుగా తిరుమలలో అన్యమత ప్రచారం వ్యవహారం చర్చగా నడుస్తోంది. తరచూ అన్యమత ప్రచారం వివాదంగా మారుతోంది. హిందూ ధార్మిక క్షేత్రంలో ఇతర మతాల ప్రచారం నిషిద్ధమన్న నిబంధన ఉన్న ఉల్లంఘన జరుగుతోంది. ఇలాంటి ఘటనే మూడ్రోజుల క్రితం తిరుమలలోని పాపనాశనం వద్ద వెలుగు చూసింది. అటవీ శాఖ పరిధిలో ఉన్న పాపనాశనం ప్రాంతంలో కొందరు మహిళలు క్రైస్తవ గీతాలు పాడుతూ రీల్స్ చేయడం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ స్పందించింది. ఈ మేరకు తిరుమల టూ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా పాపనాశనం ప్రాంతంలో జరిగిన అన్యమత ప్రచారం వ్యవహారంపై దృష్టి పెట్టింది. రీల్స్ చేసిన మహిళల ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో పాపనాశనంలో జల్లెడ పట్టింది. టీటీడీ విజిలెన్స్, పోలీసులు, అటవీశాఖ యాత్రంగం సంయుక్తంగా దాడులు నిర్వహించి దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. దాదాపు 25 మందికి పైగానే అన్యమతస్తులు దుకాణాల్లో పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రతి దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇతర మతాలకు చెందిన వారి ఆధారాలు కనిపెట్టేందుకు తిరుమల టూ టౌన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తిరుమలలో అన్యమత ప్రచారంపై ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకుంటున్న టిటిడి డ్రైవ్ కంటిన్యూ చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తిరుమలలో పలు చోట్ల పని చేసే వారి వివరాలను సేకరించడంతోపాటు హిందూయేతరులను గుర్తించే పని చేపట్టింది. మరోవైపు అన్యమత ప్రచారంపై ఫోకస్ చేసిన టీటీడీ పాపనాశనం దగ్గర మహిళలు కొందరు క్రిస్టియన్ సాంగ్స్ రీల్స్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకవైపు అన్యమతస్తుల షాపులను పోలీసులు ఖాళీ చేయిస్తుండగా మరోవైపు టీటీడీలో పనిచేసే అన్యమతస్తులపై దృష్టి పెట్టింది. తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి తావు లేదని కొత్త పాలకమండలి అంటోంది. 1987 ఎండోమెంట్ యాక్ట్ ను సవరిస్తూ 1989లో జారీ చేసిన జీవో నెంబర్ 1060 ప్రకారం హిందూయేతరులకు టీటీడీలో నో ఎంట్రీ అంటోంది. జీవో రాక ముందు టీటీడీలో ఉద్యోగం పొందిన వారితో పాటు ఆ తరువాత ఇతర మతాలను స్వీకరించిన వారిని సాగనంపాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీలో 6100 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు, మరో పదివేల మంది వరకు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా ఇందులో అన్యమతస్తులు ఎవరన్న దానిపై దృష్టి సారించింది. టీటీడీలో అన్యమత ప్రచారం, హిందువులుకాని వారు ఉద్యోగులుగా కొనసాగడం పై పలు నిరసనలు, ఆందోళనలు, ఆరోపణలు చేసిన స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు టీటీడీ పై ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగానే టీటీడీలో పనిచేసే ఉద్యోగుల మతం, వారి అభిమతంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు విచారణ జరిపించింది. దాదాపు 70 మంది వరకు అన్యమతస్థులు ఉద్యోగులుగా టీటీడీలో కొనసాగుతున్నట్లు అప్పట్లో నిర్ధారించింది. ఈ మేరకు అప్పట్లో హిందువులు కాని ఇతర మతస్తులైన ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. టీటీడీ విధుల నుంచి తప్పించే ప్రయత్నం చేసింది. అయితే అన్య మతస్తులైన ఉద్యోగులు టీటీడీ ఇచ్చిన నోటీసులపై కోర్టులో ఛాలెంజ్ చేశారు.

ఈ మేరకు కోర్టులో కేసులు నడుస్తుండగా ప్రస్తుతం టీటీడీలో దాదాపు 45 మందికి పైగానే అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉన్నట్లు గుర్తించారు. టీటీడీలో అన్యమత ప్రచారం వీల్లేదంటున్న టీటీడీ అన్యమతస్థులను ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టింది. హిందువులు కాని ఉద్యోగులను తిరిగి గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే పని ప్రారంభించింది. అన్యమతస్తులైన ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖలకు కేటాయించడం, లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించి సాగనంపాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ తొలి పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.

ఇక టీటీడీలో అన్యమత ప్రచారం, ఇతర మతస్తుల ఉద్యోగులను తప్పించేందుకు టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలను బీజేపీ స్వాగతిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు హిందూ సంఘాలు సమర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు టీటీడీలో మొత్తం ఉద్యోగుల్లో అన్యమతస్థులు ఎంతమంది అన్న దానిపై ఇప్పుడు మళ్ళీ కసరత్తు జరుగుతోంది. అన్యమతస్తులైన ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు కేటాయించడం సాధ్యమవుతుందా లేక వీఆర్ఎస్ కు హిందుయేతర ఉద్యోగులు సహకరిస్తారా అన్నది టీటీడీకి చాలెంజ్ గా మారింది. అయితే ఇప్పటివరకు టీటీడీకి ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఉన్నతాధికారులు డిప్యూటేషన్ పై వచ్చారే తప్ప టీటీడీ నుంచి ఉద్యోగులెవరు ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీపై వెళ్లిన దాఖలాలు లేకపోవడంతో ఇప్పుడు టీటీడీ ఏం చేయబోతుంది.. పాలకమండలి ఆలోచనేంటన్నదే చర్చగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి