AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 ఏళ్లకే అంతర్జాతీయ వేదికపై గంటా జిష్ణు ఆర్యన్.. గిన్నిస్ రికార్డు తర్వాత మరో ఘనత

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన తొమ్మిదేళ్ల గంటా జిష్ణు ఆర్యన్‌ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన TEDxOsney అంతర్జాతీయ వేదికపై తొలిసారి ప్రసంగించి తన ఆలోచనలను పంచుకున్నాడు. “Quo Vadis – Where Are You Going?” అంశంపై ఆత్మవిశ్వాసం, పట్టుదల, లక్ష్యసాధన గురించి జిష్ణు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.

9 ఏళ్లకే అంతర్జాతీయ వేదికపై గంటా జిష్ణు ఆర్యన్.. గిన్నిస్ రికార్డు తర్వాత మరో ఘనత
Ganta Jishnu Aryan
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 22, 2026 | 11:52 AM

Share

చిన్న వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సాధించాడు.. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై తన ఆలోచనలను పంచుకున్నాడు. భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మనవడు, మంత్రి పొంగూరు నారాయణ మనవడు గంటా జిష్ణు ఆర్యన్ మరో అరుదైన ఘనత సాధించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన TEDxOsney వేదికపై తొలిసారి ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

గిన్నిస్ రికార్డుతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు

జిష్ణు ఆర్యన్‌కు చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. 2025లో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గోల్డెన్ రేషియోలోని 216 దశాంశ స్థానాలను కేవలం 60 సెకన్లలో చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. గోల్డెన్ రేషియోలోని దశాంశాలను అంత వేగంగా, కచ్చితంగా గుర్తు చెప్పడం ద్వారా జిష్ణు తన అసాధారణ జ్ఞాపకశక్తిని చాటుకున్నాడు. అప్పట్లోనే అతడి ప్రతిభపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పుడు TEDx వేదికపై ప్రసంగించడం ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు.

‘నేను ఎటు వెళ్తున్నాను?’.. జిష్ణు ప్రసంగం

ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన TEDxOsney కార్యక్రమంలో “Quo Vadis – Where Are You Going?” అనే అంశంపై జిష్ణు మాట్లాడాడు. జీవితంలో మనం ఎటు వెళ్లాలి? మన భవిష్యత్‌ను ఎవరు నిర్ణయించాలి? అనే ఆలోచనలను తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుంచాడు. తనకు ఇష్టమైన ఫుట్‌బాల్‌ను ఉదాహరణగా తీసుకున్న జిష్ణు.. భవిష్యత్‌లో ఏం కావాలన్నది తానే నిర్ణయించుకోవాలని చెప్పాడు. ఇతరులు చూపించే మార్గాన్ని అనుసరించడం కంటే.. మనకు నచ్చిన లక్ష్యాన్ని ఎంచుకుని, దాని కోసం పట్టుదలతో ముందుకు సాగాలని వివరించాడు.

‘పడిపోయినా.. మళ్లీ లేవాలి’

జీవితంలో గెలుపుతో పాటు ఓటములు కూడా సహజమేనని జిష్ణు తన ప్రసంగంలో చెప్పాడు. వైఫల్యాలు, భయాలు మన ప్రయాణాన్ని ఆపకూడదని సూచించాడు. పడిపోయినప్పుడు నిరాశ చెందకుండా తిరిగి లేచి ముందుకు సాగాలనే సందేశాన్ని తన మాటల్లో బలంగా వ్యక్తం చేశాడు. “నేను పడతాను, నేను ఏడుస్తాను, నేను తిరిగి నిల్చుంటాను” అనే మాటలతో తన ఆలోచనను చెప్పిన జిష్ణు.. చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం, పట్టుదల, లక్ష్యసాధన వంటి అంశాలపై మాట్లాడటం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

తల్లితో కలిసి ఒకే వేదికపై..

ఈ TEDx కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. జిష్ణు తన తల్లి శరణి పొంగూరుతో కలిసి అదే అంతర్జాతీయ వేదికను పంచుకున్నాడు. దీంతో తల్లీకొడుకులిద్దరూ ఒకే TEDx వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిన్నిస్ రికార్డు ద్వారా తన జ్ఞాపకశక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన జిష్ణు.. ఇప్పుడు TEDx వేదికపై తన ఆలోచనలు, భావాలను వ్యక్తం చేయడం ద్వారా ప్రసంగ నైపుణ్యాన్ని కూడా చాటుకున్నాడు.

ప్రముఖ కుటుంబ నేపథ్యం.. సొంత ప్రతిభతో గుర్తింపు

జిష్ణు ఆర్యన్ తల్లిదండ్రులు గంటా రవితేజ, శరణి పొంగూరు. వీరిద్దరూ నారాయణ గ్రూప్ డైరెక్టర్లుగా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు అతడి తాత కాగా.. పొంగూరు నారాయణ మరో తాత. ప్రముఖ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ జిష్ణు తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గణితానికి సంబంధించిన క్లిష్టమైన అంశాన్ని గుర్తుపెట్టుకుని గిన్నిస్ రికార్డు సాధించిన అతడు.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఆత్మవిశ్వాసంతో ప్రసంగిస్తూ తనలోని మరో ప్రతిభను చూపించాడు.

చిన్న వయసులోనే పెద్ద వేదిక..

కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే ఆక్స్‌ఫర్డ్‌లోని అంతర్జాతీయ TEDx వేదికపై నిలబడి తన ఆలోచనలను పంచుకోవడం జిష్ణు ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. గిన్నిస్ రికార్డు తర్వాత ప్రసంగ వేదికపై కూడా తనదైన ముద్ర వేసిన జిష్ణు.. భవిష్యత్‌లో మరిన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. చిన్న వయసులోనే లక్ష్యాన్ని ఎంచుకోవడం, వైఫల్యాలకు భయపడకుండా ముందుకు సాగడం, తన నిర్ణయాలపై నమ్మకం ఉంచడం వంటి సందేశాలను జిష్ణు TEDx ప్రసంగం ద్వారా చెప్పాడు. దీంతో అతడి ప్రసంగం, ప్రతిభ, ఆత్మవిశ్వాసంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియో దిగువన చూడండి… 

Follow Us