ప్రమీల, శరత్‌చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే..
అయినవాళ్లు లాగా అక్కున చేరారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. బిడ్డల్లాంటి వారిని ఆ వృద్ధురాలు కూడా అంతే అనుకుని చేరదీసింది. అయితే, దురాశ ఆ వృద్ధురాలి ప్రాణం తీసే అంత పని చేసింది. 50 గ్రాముల బంగారం కోసం ఏకంగా ఆ వృద్ధురాలి ప్రాణాలను తీసేందుకు వెనుకాడని పరిస్థితి ఏర్పడింది. శుభకార్యానికి వెళదామంటూ మాయమాటలు చెప్పి కారులో వెంట తీసుకెళ్లి.. ఆ వృద్ధురాలిని హత్య చేసి పూడ్చి పెట్టడం కలకలం రేపింది..

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది. వృద్ధాప్యంలోనూ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీవో కార్యాలయం ముందు టీ దుకాణం నిర్వహిస్తోంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీదేవి శేష జీవితాన్ని సంతోషంగానే నెట్టుకొస్తుంది. అదే సమయంలో అయినవారు కాకపోయినా ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే ఇద్దరిని బాగా నమ్మింది. ఆ ఇద్దరే ఆమె పాలిట యమకింకరులై ప్రాణాలను బలి తీసుకోవడం మదనపల్లిలో కలకలం రేపింది.
మదనపల్లిలో వృద్ధురాలి మిస్సింగ్ కేసు మిస్టరీని చేదించిన పోలీసులు ఈ మేరకు నిందితులను అరెస్టు చేయడంతో చేదు నిజాలు వెలుగు చూసాయి. గత నెల 30న వృద్ధురాలు లక్ష్మీదేవి(83) అదృశ్యంపై మదనపల్లి తాలూకా పీఎస్ లో కేసు నమోదైంది. ఆమెను బంగారు నగల కోసం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్టీవో కార్యాలయం ఎదురుగా టీ దుకాణం నిర్వహిస్తున్న లక్ష్మీదేవిని.. ఆర్టీవో కార్యాలయంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న శరత్ చంద్ర ప్రసాద్, స్వీపర్ ప్రమీల కలిసి హత్య చేసినట్లు తేల్చారు. ఆర్టీవో కార్యాలయం ఎదురుగా నివాసం ఉన్న వృద్ధురాలు లక్ష్మీదేవితో పరిచయం పెంచుకుని మాయమాటలతో హత్యకు కుట్రచేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇద్దరి మధ్య వివాహేతర బంధం..
ప్రమీల శరత్ చంద్ర ప్రసాద్ మధ్య వివాహేతర సంబంధం ఉండగా ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసినట్లు విచారణలో తేల్చారు. వృద్ధురాలు లక్ష్మీదేవికి మాయ మాటలు చెప్పి గత నెల 19న తిరుపతిలో శుభకార్యం ఉందని చెప్పి కారులో తీసుకొచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీదేవి వద్ద ఉన్న 50 గ్రాముల బంగారును దోచుకుని రేణిగుంట మండలం ములగమూడి చెరువు వద్ద డెడ్ బాడీని పూడ్చి పెట్టినట్లు ప్రమీల, శరత్ చంద్ర ప్రసాద్ చేత నేరాన్ని అంగీకరించారు.
పద్మనాభం.. పాత్రపై ఆరా..
అయితే ముందుగా.. ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే క్లర్క్ పద్మనాభం కారులో లక్ష్మీదేవిని తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. ఈ మేరకు మదనపల్లి తిరుపతి హైవే లోని గండబోయినపల్లి టోల్గేట్ వద్ద కారు రాకపోకల పుటేజ్ ను సేకరించారు. ఈ క్రమంలోనే ప్రమీల, శరత్ చంద్ర వాలకం పై వచ్చిన అనుమానమే కేసు మిస్టరీని ఛేదించేలా చేసింది. వృద్ధురాలు లక్ష్మీదేవితో చనువుగా ఉండే ప్రమీల శరత్ చంద్రల మధ్య కొనసాగుతున్న యవ్వారం కూడా కేసు మిస్టరీని చేధించేందుకు ఈజీ అయ్యింది.
వీఆర్వో ఎదుట లొంగిపోయి హత్య చేసినట్లు అంగీకరించిన ప్రమీల, శరత్‌చంద్ర ప్రసాద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆర్టీవో కార్యాలయం క్లర్క్ పద్మనాభం పాత్ర పైన విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలు లక్ష్మీదేవిని తీసుకెళ్ళేందుకు కారు సమకూర్చిన పద్మనాభం పాత్రపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
