ఒమాన్ లో ఏజెంట్ చేతిలో మోసపోయిన 8 మంది వలస కార్మికులను APNRTS సహకారంతో స్వస్థలానికి తీసుకువచ్చారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎనిమిది మంది వలసదారులు అక్రమ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒమన్ కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని రాష్ట్రానికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఒమన్ లోని భారత రాయబార కార్యాలయంతో ఇమెయిల్ ద్వారా పలుమార్లు సంప్రదించింది. వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని స్వదేశానికి పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు అధికారులు స్పందించారు. APNRTS సహకారంతో ఎనిమిది మంది వలస కార్మికులు ఈరోజు (మంగళవారం) విజయవాడ చేరుకున్నారు. 5 నెలల క్రితం ఉద్యోగాల కోసం ఓ ఏజెంట్ ద్వారా ఈ 8 మంది వలస కార్మికులు ఒమన్ వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో, ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన అధికారులు వారి దీన పరిస్థితి చూసి చలించిపోయారు. స్వగ్రామాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసి చివరకు విజయం సాధించారు.
ఏజెంట్ గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి.. ఒమన్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 8 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వీసాలు ఏర్పాటు చేశాడు. అనంతరం వీరిని ఒమన్ తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగాలు కల్పించకపోగా, సరైన వసతి, భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై వారు సదరు ఏజెంట్ ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉద్యోగాలు లేవు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించి, మమ్మల్ని రోడ్డున పడేశారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావడానికి సహాయం కొరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీని, APNRTS అధికారులను సంప్రదించారు.
జిల్లా ఎస్పీ రాధిక.. వలస కార్మికుల వివరాలను APNRTS కు పంపించారు. పశుసంవర్ధక, మత్య్సశాఖాభివృద్ది మంత్రి సీదిరి అప్పలరాజు వలస కార్మికుల క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని, త్వరితగతిన వారిని స్వదేశానికి రప్పించాలని APNRTS ను కోరారు. తక్షణమే స్పందించిన APNRTS బాధితుల నుంచి మరిన్ని వివరాలను సేకరించారు. ఒమన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వారి పరిస్థితిని వివరిస్తూ, సదరు ఏజెంట్ పై చర్య తీసుకోవాలని మరియు వారిని ఒమన్ నుంచి భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరింది. అంతేకాకుండా తక్షణ సహాయంగా ఏపిఎన్ఆర్టి సొసైటీ కో-ఆర్డినేటర్ వేమన కుమార్, సామాజిక కార్యకర్తలు సలాలాహ్ ప్రాంతంలో తాత్కాలిక వసతి కల్పించారు. బాధితులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పించారు. ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ ద్వారా సదరు ఏజెంట్ పై ఒత్తిడి తెచ్చి 8 మందిని భారతదేశానికి తిరిగి రావటానికి అయ్యే ఖర్చును ఎంబసీ అధికారుల ద్వారా అక్కడి కోర్టులో జమ చేసి, ఎంబసీ సహకారంతో వలస కార్మికులు ఇవాళ క్షేమంగా స్వరాష్ట్రం తీసుకువచ్చారు.
ముఖ్యంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల అభివృద్ధి, భద్రత, సంక్షేమమే ధ్యేయంగా APNRTS నిరంతరం పనిచేస్తోందని అధికారులు పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే వారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికోసం APNRTS సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. అక్రమ ఏజెంట్ల చేతిలో ఎవరూ మోసపోవద్దని, విదేశాంగ వ్యవహారాల శాఖ ద్వారా ఆమోదించిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలని సూచించారు. తామందరూ క్షేమంగా భారతదేశానికి రావటానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వారికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..