కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో మరోసారి రక్తం చిందింది. బన్ని ఉత్సవంలో భాగంగా కర్రలు గాల్లోకి లేచాయి. పోలీసులు వద్దని చెప్పినా వినలేదు.. యథావిధిగా కర్రల సమరం కొనసాగింది. మనుషుల రక్తంతో మాలమల్లేశ్వరస్వామికి రక్తతర్పణ జరిగిపోయింది. ఈ కర్రల సమరంలో 50 మందికిపైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
విజయదశమి రోజు అర్ధరాత్రి మాళ మల్లేశ్వరుడి కల్యాణం జరిగింది. అనంతరం కాగడాల వెలుతురులో విగ్రహాలను ఊరేగించారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. మాళమల్లన్న విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడ్డారు. ఈ సమరంలో హింస చోటు చేసుకుంటుంది. చాలా మంది తలలు పగిలాయి. రక్తం కారుతున్నా వెనక్కి తగ్గలేదు. దేవుణ్ని దక్కించుకునేందుకు భీకరంగా పోరాటం చేశారు. ఒకరిపై ఒకరు అగ్గి దివిటీలను విసురుకుని దేవరగట్టు నేలను రక్తంతో తడిపారు. ఈ రక్తపాతానికి అందమైన పేరు పెట్టారు. అదే ఆచారం! ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు అంటారు.
సాధారణంగా కొట్లాట జరిగితే ఎవరికైనా ఆందోళన ఉంటుంది. కానీ అక్కడ ఆనందం తాండవిస్తుంది. కొట్టుకుంటే ఎవరైనా ఆపాలని ప్రయత్నిస్తారు.. కానీ అక్కడ ఎంత కొట్టుకుంటే అంత ఉత్సాహం. ఈ సమరాన్ని చూసేందుకు ఏపీ నుంచే కాకుండా, కర్ణాటక నుంచీ భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. దేవరగట్టు పరిసరాల్లో విద్యుత్ దీపాలు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ దేవరగట్టు కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేసిన ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. కర్రల సమరం వద్దని కొన్ని రోజులుగా అవగాహన సదస్సులు నిర్వహించినా.. భక్తులు మాత్రం తమ వెంట పెద్దఎత్తున కర్రలు పట్టుకొని వచ్చారు. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు ఆగర్భ శత్రువుల్లా కర్రలతో తలపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..