
సత్యసాయి జిల్లా కదిరికి చెందిన వేణుగోపాల్, అశ్విని దంపతులు.. తమ 4 ఏళ్ల కూమార్తె హరిప్రియ, మరొకరితో కలిసి కారులో ప్రయాణం చేస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం కారులో తిరుమల వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆర్ సి పురం జంక్షన్‌లోని మలుపు వద్ద కారు టర్న్ చేస్తుండగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొనింది. రోడ్డు క్రాస్ చేస్తున్న కారును…. వేగం అదుపు చేయలేక నేరుగా వచ్చి ట్రావెల్స్ బస్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదంలో 4 ఏళ్ల హరిప్రియ అక్కడికక్కడే మృతి చెందగా.. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వేణుగోపాల్ అశ్విని దంపతులతో పాటు మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారు. ఆలయాల సందర్శనకు నాలుగేళ్ల కూతురు హరిప్రియను తీసుకుని ఆనందంగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన వేణుగోపాల్ అశ్విని దంపతులు కళ్లెదుటే కూతురు మృత్యువాత పడటంతో కన్నీరు మున్నీరయ్యారు. అప్పటివరకు ఆడిపాడిన బిడ్డ విగతజీవిగా మారడంతో.. రక్త గాయాలతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.