పాపం.. వారంతా వేడుకల్లో డేకరేషన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు.. వారి పనిలో భాగంగా డెకరేషన్ పనులు చేయడానికి అనంతపురం వెళ్లారు. వారి పని ముగించుకుని.. (విజయవాడ) ఇంటికి బయలు దేరారు.. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు వారి పాలిట యమపాశంగా మారింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరగగా.. విజయవాడకు చెందిన నలుగురు డెకరేషన్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. త్రిపురాంతకంలోని సివిల్ సప్లయ్ గొడౌన్ దగ్గర హైవేపై ఆర్టీసీ బస్సు.. కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు ఆస్పత్రికి తరలించిన తరువాత ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి వినుకొండ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యిందని.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.
మృతులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వాంబే కాలనీకి చెందిన పిల్లి శ్రీను (28) ,చంద్రశేఖర్ (21), కె శ్రీనివాసు (22),సాయి (31),లుగా గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..