ఆంధ్రప్రదేశ్‌లో కలుషిత జలాలు ప్రజల ఉసురు తీస్తున్నాయి. మురికి కాల్వల్లో వేసిన పైప్‌లైన్లు.. తప్పుపట్టి.. పగిలిపోయి..కలుషితమవుతున్నాయి. ఈ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మొన్న గుంటూరు, నేడు విజయవాడలో నిండు ప్రాణాలు బలయ్యాయి. ఫిబ్రవరిలో కలుషిత నీరు తాగి గుంటూరులో ముగ్గురు చనిపోగా 200 మందికిపైగా ఆసుపత్రిపాలయ్యారు. అధికారులు అలసత్వం వీడకపోవడంతో ఇప్పుడు విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత జలాలు తాగి నలుగురు బలయ్యారు. వందలాదిమంది వాంతులు, విరేచనాలతో హాస్పిటల్‌లో చేరారు.
బెజవాడలో కొన్నాళ్లుగా రంగు మారిన నీరు వస్తోందని ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. మొగల్రాజపురంలో నల్లని నీరు వస్తుందని చెప్పినా తుప్పుపట్టిన పైపులైన్లు మార్చలేదు. కలుషిత నీరు తాగడం వల్లే తన తండ్రి చనిపోయాడని మృతుడి కుమారుడు వాపోయాడు. సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్తే పెద్దాస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారని…కనీసం అంబులెన్స్‌కి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని కన్నీళ్లపర్యంతమయ్యాడు.
బాధితుల సంఖ్య పెరగడంతో అధికారులు అలర్టయ్యారు. ఇంటింటికి వెళ్లి నీటిని సేకరించారు. తుప్పుపట్టిన పైప్‌లైన్ వాటర్‌ను ల్యాబ్‌కు పంపించారు. ఇవాళ సాయంత్రానికి పూర్తిస్థాయి నివేదికను అందిస్తామని చెబుతున్నారు. నలుగురు మృతికి కలుషిత నీరే కారణమా.. ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తన్నామంటున్నారు…
ఆస్వస్థతకు గురైన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామంటున్నారు DHMO. 30 పడకలతో తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం చెప్పారు.
దశాబ్దాల క్రితం వేసిన తాగునీటి పైపులైన్లు పూర్తిగా తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కచోట మార్చలేదు. నీటి శుద్ధికేంద్రాల నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తుంటారు. వీటిలో నాచు, బురద చేరకుండా ఆరు నెలలకోసారైనా శుభ్రం చేయాలి. కానీ అలాంటిదేమి జరగడం లేదు. నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపడం లేదు. ఇప్పటికైనా పారిశుద్ధ్యపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తమ ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..