Andhra: పొలం పనులు చేస్తుంటే అదృష్టం చేతికి తగిలింది – కాసుల పంట పండింది
వర్షం మొదలైతే వజ్రాల వేట మొదలవుతుంది! కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో రెండు రోజుల్లో రెండు వజ్రాలు లభ్యం కావడంతో స్థానికులు సంబరాల్లో మునిగిపోయారు. ఒకరోజులోనే ఇద్దరు రైతులకు వజ్రాలు దొరకడం ఆసక్తికరం. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. ప్రత్యేకంగా జొన్నగిరి, తుగ్గలి తదితర గ్రామాల్లోని ప్రజలు వజ్రాల కోసం పరుగులు తీస్తుంటారు. ఒక వజ్రం దొరికితే చాలు జీవితమే మారిపోతుందని భావిస్తారు. అందుకే అక్కడ ప్రజలు తొలకరి జల్లులు పడగానే పొలాలను జల్లెడ పడతారు. వజ్రాలు దొరికితే కొనుగోలు చేయడానికి వ్యాపారులు సైతం అక్కడ క్యూ కడుతుంటారు. తాజాగా రాష్ట్రంలో రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు కర్నూలు జిల్లాలో వజ్రాల అన్వేషణ ఊపందుకుంది. ఒకే రోజు ఇద్దరు రైతులకు వజ్రాలు దొరకడంతో వారి ఆనదానికి అవధుల్లేవు.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి మండలం జొన్నగిరి కి చెందిన దేవమ్మ అనే మహిళ పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. దొరికిన వజ్రాన్ని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. మరి కొన్ని గంటల వ్యవధిలోనే గిరిగట్ల గ్రామానికి చెందిన రామాంజనేయులు కు మరో వజ్రం లభించింది. ఆ వజ్రం ఒక లక్ష 50 వేల రూపాయలకు అనంతపురం జిల్లాకు చెందిన వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశాడు. రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో వజ్రాలు లభ్యమవుతున్న సమాచారంతో వజ్రాల అన్వేషకులు భారీగా తరలివచ్చి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ప్రస్తుతం దొరికిన వజ్రాలు రెండూ ఆ పొలం రైతులకే లభ్యం కావడం విశేషం. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఒకేరోజు రెండు వజ్రాలు దొరకడం విశేషం. ఈ దొరికిన రెండు వజ్రాలు అత్యంత విలువైనవిగా చెబుతున్నారు స్థానికులు. అయితే దొరికిన వజ్రాల విలువ రైతులకు అవగాహన లేక వాటిని తక్కువ ధరలకు వజ్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒకేరోజు రెండు గజాలు దొరకడంతో జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట ముమ్మరంగా సాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
