
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ కొండచిలువ ప్రత్యక్షం అయ్యింది. యనమదుర్రు డ్రైన్ నుంచి పంటచేలకు నీరు తోడుతుండగా బయటకు వచ్చింది ఈ భారీ కొండచిలువ. పన్నెండు అడుగులపైనే ఉన్న కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీసారు. యనమదుర్రు కాలువ నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన ట్యాంక్ లోపలికి వెళ్లిపోయింది కొండచిలువ. బయటకు వేస్తే ఏం చేస్తుందో అని అక్కడున్నవారంతా హైరానా పడ్డారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటి వద్ద పనిచేస్తున్న కొందరు అక్కడికి చేరుకున్నారు. స్థానికులకు దైర్యం చెప్పి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న భీమవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్, సెషన్ ఆఫీసర్ సురేష్ కుమార్, బీట్ ఆఫీసర్ రాంప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ లోపలికి బోర్ ద్వారా నీటిని వదిలారు. నీటి వేగానికి బయటకు వచ్చిన కొండచిలువను ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా బంధించారు. పన్నెండు అడుగుల పైనే పొడవు, ఎనభై కిలోల బరువు ఉంది భారీ కొండచిలువ. యనమదుర్రు డ్రైన్ ఎగువున ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొండచిలువ వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. యనమదుర్రు డ్రైన్‌లో నీటి పిల్లులు తిరుగుతూ ఉంటాయి. వాటిని వేటాడుతూ వచ్చి ఉంటుందని తెలిపారు ఫారెస్ట్ అధికారులు. వన్యప్రాణి సంరక్షణ సంస్థ నిర్వాహకులు మనీష్ సహకారంతో కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.