కూరగాయల ధరలు, ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా టమాటా ధర సెంచరీ దాటింది. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటా ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో టమాటా 124 రూపాయలు పలికింది. టమాట పంటకు కేరాఫ్‌గా ఉండే ఇదే మార్కెట్‌లో గతంలో కిలో 25 పైసలు పలికిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి చోట.. ఇప్పుడు ఏకంగా 124 రూపాయల రికార్డ్ స్థాయి రేటు రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక.. ఇప్పటివరకూ అత్యధికంగా కిలో టమోటా ధర 104 రూపాయలు పలికినట్లు రైతులు చెప్తున్నారు. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆ రికార్డ్‌ను క్రాస్ చేయడంతోపాటు సరికొత్త ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది మదనపల్లి మార్కెట్. వాస్తవానికి.. మదనపల్లి మార్కెట్‌కు సాధారణంగా 1500 టన్నుల టమాట వస్తుంది.
కానీ.. ప్రస్తుతం 750 టన్నులు మాత్రమే రావడంతో వ్యాపారులు ఆ టమాటాను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. ఫలితంగా.. టమాట ధర ఒక్కసారిగా అమాంతం పెరిగింది. ఏ గ్రేడ్ టమాటా కిలో 106 నుండి 124 మధ్య పలికింది. బీ గ్రేడ్ టమాటా 86 నుండి 105 మధ్య పలికింది. మొత్తంగా.. సగటున 100 నుండి 110 పలికినట్లు చెబుతున్నారు మదనపల్లి మార్కెట్ రైతులు. ఇక ఇక్కడినుండి ఉత్తరాది రాష్ట్రాలకు టమాటాను ఎగుమతి చేస్తుంటారు వ్యాపారులు. దాంతో.. అవసరానికి తగ్గ సరఫరా లేక ఎగుమతి డిమాండ్ పెరిగినట్లు అయింది. వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత భారీ వర్షాలు, పంట దిగుబడి తగ్గడం వంటి వివిధ కారణాలతో టమాటా ధర రోజురోజుకు పెరుగుతోంది. దాంతోపాటు.. వివిధ ప్రాంతాల్లో వేడి గాలులు, భారీ వర్షాలు టమాటా సరఫరాకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ధర పెరగడానికి ఈ పరిస్థితులే కారణమంటున్నారు టమాటా రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..