AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Religious Freedom: భారత్‌ను అంతర్జాతీయంగా బ్లాక్‌ లిస్టులో పెట్టేందుకు USCIRF ప్రయత్నాలు.. భారీ కుట్ర భగ్నం!

భారత్‌ను అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలుజేసేందుకు జరుగుతున్న భారీ కుట్ర ఇప్పుడు బట్టబయలైంది.

Religious Freedom: భారత్‌ను అంతర్జాతీయంగా బ్లాక్‌ లిస్టులో పెట్టేందుకు USCIRF ప్రయత్నాలు.. భారీ కుట్ర భగ్నం!
Uscirf Iamc
Balaraju Goud
|

Updated on: Apr 25, 2022 | 2:55 PM

Share

Religious Freedom in India: దాదాపు రెండు నెలలుగా రష్యా ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాన్ని నివారించడంలో అగ్రదేశాలమని, సూపర్‌ పవర్స్‌ అని చెప్పుకునే దేశాలు చేతులెత్తిసిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రపంచమంతా 130 కోట్ల జనాభాతో కూడిన భారత్‌ వైపు చూస్తోంది. ఏదైనా ముప్పును తప్పించగల సత్తా భారత్‌కు ఉందనే నమ్మకం ప్రపంచానికి ఉంది. ఇదే క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులు తమ కుట్రలకు మరోసారి తెర లేపుతున్నాయి. పాకిస్థాన్ అండదండలతో అనేక శక్తులను భారత్‌ను అపఖ్యాతి పాలు జేసేందుకు ఒక్కటవుతున్నాయి.

భారత్‌ను అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలుజేసేందుకు జరుగుతున్న భారీ కుట్ర ఇప్పుడు బట్టబయలైంది. భారత్‌కు దోషిగా నిలబెట్టేందుకు అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడం(USCIRF), ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌ (IAMC), పాకిస్థాన్‌ ఈ కుట్రలో ప్రధాన పాత్రధారులను తేలింది. USCIRF అన్నది అమెరికా ప్రభుత్వానికి చెందిన ఒక స్వతంత్ర సంస్థ.

అమెరికా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే USCIRF సంస్థ పాకిస్థాన్‌ కనుసన్నల్లో పనిచేస్తోందన్నది జగమెరిగిన సత్యం. ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి పాకిస్థాన్‌లోని పలు సంస్థలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అంతేకాదు దీనికి పాకిస్థాన్ ప్రభుత్వం, ISI నిధులు సమకూర్చుతుంది. ఇండియాను అపఖ్యాతి పాలు జేసేందుకు గతంలో రెండుసార్లు USCIRF ప్రయత్నించి విఫలమైంది. మతపరమైన స్వేఛ్చ విషయంలో భారత్‌ను “అత్యంత సమస్యాత్మక కేటగిరీ” అంటే కంట్రీస్‌ ఆఫ్‌ పర్టిక్యురల్‌ కన్సర్న్‌ CPC జాబితాలో లో చేర్చాలని USCIRF నివేదిక రూపొందించినట్టు సమాచారం. దీని ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత్‌నూ బ్ల్యాక్‌లిస్టులో చేర్చేందుకు పాక్‌ కనుసన్నల్లో నడిచే USCIRF కుట్ర పన్నుతోంది. 2003, 2004 సంవత్సరాల్లో కూడా భారత్‌ను అత్యంత సమస్యాత్మక దేశాల జాబితాలో ఈ సంస్థ చేర్చింది. 2005 తర్వాత ఆ జాబితా నుంచి భారత్‌ పేరు తొలగించింది.

2020లో జారీ చేసిన నివేదికలో భారతదేశంలో మత స్వేచ్ఛ బాగా దెబ్బతిందని నివేదించింది. మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయని ఆరోపించింది. ఈ సంస్థ వెల్లడించిన నివేదికలను భారత్‌ తీవ్రస్థాయిలో ఖండించింది. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న నడిన్ మెయింజా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడతారనే పేరుంది.

IAMC అనే సంస్థ ఈ కుట్ర వెనుక ప్రధాన శక్తిగా నిలుస్తోంది. ఈ సంస్థ పేరులోనే ఇండియన్‌ అని ఉందని కాని దీని మనుగడంతా పాకిస్థాన్‌తోనే ముడి పడి ఉంది. పాక్‌కు చెందిన మత సంస్థలు, బంగ్లాదేశ్‌కు చెందిన కరుడుగట్టిన సంస్థలకు IAMC తొత్తుగా వ్యవహరిస్తోంది. హిజ్బుల్‌ ముజాహిదిన్ వంటి తీవ్రవాద సంస్థలతోనూ IAMCకి లింకులున్నాయి. 1997లో ఈ సంస్థ హిజ్బుల్‌ తీవ్రవాది సయ్యద్‌ సలావుద్దీన్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సంస్థ 2013 14 సంవత్సరంలో USCIRF సంస్థకు 55 వేల డాలర్లు విరాళంగా ఇచ్చింది. భారత్‌ను అపఖ్యాతి పాలుజేసేందుకే ఈ మొత్తాన్ని ఇచ్చిందన్నది వాస్తవం. ఈమెను USCIRF ఛైర్‌పర్సన్‌గా నియమించినప్పుడు IAMC సంస్థ ఛైర్మన్‌ షేక్‌ ఉబైద్‌ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ కూడా చేశారు.

IAMC సంస్థ గత కొన్నేళ్లుగా భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర దుష్ప్రచారం చేస్తోంది. తప్పుదోవ పట్టించేందుకు గాజియాబాద్‌కు చెందిన చెందిన వీడియోలను సర్క్యూలేట్‌ చేస్తోంది. తప్పుడు ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నందుకు ఈ సంస్థపై ఇప్పటికే కఠినమైన UAPA చట్టం కింద కేసు కూడా నమోదైంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు షేక్ ఉబేద్‌ భారత్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. భారత్‌పై ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేస్తూ ఇతను 2013 నుంచి తీవ్ర కుట్రలు పన్నుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసేందుకు ఒక లాబీయింగ్‌ సంస్థను కూడా ఇతను నియమించినట్టు సమాచారం.

భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే అనేక సంస్థలు ఒత్తిడి తెచ్చేందుకు USCIRFకు లేఖలు రాస్తున్నాయి. అమెరికా మినహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మతపరమైన స్వేచ్ఛను పర్యవేక్షించే సంస్థ తమదని USCIRF చెప్పుకుంటుంది. కాని. వాస్తవంగా చూస్తే ఇది దాని ముసుగు మాత్రమే. భారత వ్యతిరేక లాబీకి, భారత వ్యతిరేక సంస్థలకు ఇది ఒక పెద్ద వేదికగా నిలుస్తోంది. భారత్‌ను అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలుజేసేందుకు భారత వ్యతిరేక సంస్థలు, లాబీయింగ్‌ సంస్థలు చేసే తప్పుడు ఫిర్యాదులు, నివేదికల ఆధారంగా USCIRF సంస్థ ఏటా నివేదికలు విడుదల చేస్తుంది. భారత్‌కు చెందిన అనేక సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలని, కొంత మంది రాకపోకలపై నిషేధం విధించాలని USCIRF సంస్థ సిఫార్సు చేసింది.

పాకిస్థాన్ నేవీకి చెందిన మాజీ అధికారి జాహిద్‌ మహముద్‌ తన సంస్థ ఇస్లామిక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్ అమెరికా పేరుతో భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలకు అండదండలందిస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా చేపట్టిన కుట్రలో ఇతని పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం అసోసియేషన్‌కు రషీద్‌ అహ్మద్‌కు కూడా భారత వ్యతిరేక లాబీయింగ్‌ సంస్థలకు సంబంధాలున్నట్టు తెలుస్తోంది. కొవిడ్‌ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు రషీద్‌ అహ్మద్‌పై ఉన్నాయి.

ఇస్లామిక్‌ సర్కిల్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ICNA సంస్థ భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలకు ఊతంగా నిలుస్తోంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో ఆయనను అపఖ్యాతి పాలు చేసేందుకు ఈ సంస్థ విపరీతమై ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆయనపై నిషేధం విధించాలనే డిమాండ్‌ను అతి గట్టిగా చేసిన సంస్థల్లో ICNA ముందు వరుసలో నిలిచింది. బంగ్లాదేశ్‌లో నరమేధానికి పాల్పడ్డ వ్యక్తులను సన్మానించిన హీనచరిత్ర ఉంది ఈ సంస్థకు.

ఈ సంస్థ ఒత్తిడి ఫలిస్తే భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించవచ్చు. దాని వలన అనేక సమస్యలు తలెత్తడం తథ్యం. పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. అదే సమయంలో ఈ విషయాలను చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరముందని భారత అనుకూల వర్గాలు అంటున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలకు పాకిస్థాన్‌, ISIS నుంచి భారీ మొత్తంలో నిధులు అందుతాయనే విషయాన్ని మరువ కూడదని గుర్తు చేస్తున్నారు. ఇస్లామిక్‌ అమెరికన్‌ లాబీ అన్నది చాలా బలమైన వ్యవస్థ అని అంటున్నారు.

Read Also…  Anand Mahindra: ఫ్యూచర్ కార్లు ఇవేనంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఎలాన్ మస్క్ ను ట్విట్టర్‌లో ట్యాగ్