AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: ‘హిందూ పోలీస్ అధికారిని సజీవ దహనం చేశాం..’ పోలీసు స్టేషన్‌లోనే ఒప్పుకున్నాడు.. వీడియో

పోలీస్ స్టేషన్‌లో పోలీసులను బెదిరించడం, గతంలో ఓ హిందూ అధికారిని చంపినట్లు ఒప్పుకోవడం… బంగ్లాదేశ్‌లో చట్టవ్యవస్థ కుప్పకూలిన దృశ్యాలకు వైరల్ వీడియో నిదర్శనంగా మారింది. నిషేధిత ఛాత్రలీగ్ నేతను విడుదల చేయాలంటూ SAD నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి చివరకు అతడిని విడిపించుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

Bangladesh: 'హిందూ పోలీస్ అధికారిని సజీవ దహనం చేశాం..' పోలీసు స్టేషన్‌లోనే ఒప్పుకున్నాడు.. వీడియో
Bangladesh Law And Order
Ram Naramaneni
|

Updated on: Jan 03, 2026 | 7:14 PM

Share

బంగ్లాదేశ్‌లో పోలీస్, రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్లుగా చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పు బంగ్లాదేశ్‌లోని హబిగంజ్ జిల్లా శయేస్టాగంజ్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. శుక్రవారం మధ్యాహ్నం.. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ (SAD) నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి అధికారులను బెదిరించారు. నిషేధిత ఛాత్రలీగ్‌కు చెందిన మాజీ నాయకుడు ఎనాముల్ హసన్ అలియాస్ నయన్‌ను విడుదల చేయాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఈ సందర్భంగా SAD హబిగంజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహదీ హసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఆందోళనల సమయంలో బానియాచాంగ్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టామని, హిందూ పోలీస్ అధికారి సంతోష్ చౌదరీని సజీవదహనం చేశామని పోలీస్ స్టేషన్‌లోనే గర్వంగా చెప్పడం కలకలం రేపింది.

Disclaimer: ఈ వీడియోలోని అంశాల నిజానిజాలు, అందులో మాట్లాడుతున్న వ్యక్తి గుర్తింపు, చేసిన వ్యాఖ్యల ప్రామాణికతను టీవీ9 స్వతంత్రంగా నిర్ధారించలేదు.

వైరల్ వీడియోలో.. శయేస్టాగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అబుల్ కలాం సహా ఇతర పోలీసు సిబ్బంది ఎదుట SAD నాయకులు కూర్చుని బెదిరింపులకు దిగడం కనిపిస్తుంది. “ఈ ప్రభుత్వాన్ని మేమే తీసుకొచ్చాం. అయినా మా వాళ్లను అరెస్టు చేస్తారా?” అంటూ మహదీ హసన్ వ్యాఖ్యానించాడు. ఎనాముల్ హసన్‌ను అరెస్టు చేసిన ధైర్యం పోలీసులకు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు.

2024 ఆగస్టు 5న జరిగిన హింసాత్మక ఘటనల్లో బానియాచాంగ్ పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగి, సబ్‌ఇన్‌స్పెక్టర్ సంతోష్ చౌదరీ హత్యకు గురయ్యారు. అనంతరం ఆయన మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే రోజు షేక్ హసీనా దేశం విడిచి భారత్‌కు పారిపోయారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు, దహనాలు, లూటీలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు, ఆలయాల ధ్వంసం జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “పోలీస్ స్టేషన్‌లో కూర్చొని పోలీసులనే బెదిరించే స్థాయికి నేరస్తులు చేరితే… అది కొత్త బంగ్లాదేశ్‌నా?” అంటూ జర్నలిస్ట్ రచయిత సహిదుల్ హసన్ ఖోకోన్ ప్రశ్నించారు. భారత సైన్య మాజీ అధికారి కల్నల్ మయాంక్ చౌబే (రిటైర్డ్) కూడా చట్టం భయానికి లోబడి పనిచేయకపోతే రాష్ట్రం కూలిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. మొత్తంగా.. పోలీస్ స్టేషన్‌లోనే నేరాలకు బహిరంగంగా ఒప్పుకొని బెదిరింపులకు దిగిన ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చట్టవ్యవస్థ పరిస్థితిపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

నిషేధిత ఛాత్రలీగ్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాడన్న ఆరోపణలపై ఎనాముల్ హసన్‌ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అతడి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ (SAD) నేతలు శయేస్టాగంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడి అతడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పోలీస్ వర్గాల ప్రకారం.. ఎనాముల్ హసన్ 2023లో శయేస్టాగంజ్ సదర్ యూనియన్ ఛాత్రలీగ్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే SAD నేతలు మాత్రం 2024 జూలైలో జరిగిన ఉద్యమంలో హసన్ చురుకుగా పాల్గొన్నాడని, గతంలో ఛాత్రలీగ్‌తో అనుబంధం ఉండటం నేరంగా పరిగణించరాదని వాదించారు. ఈ విషయాన్ని ఢాకాకు చెందిన ‘ప్రోథమ్ ఆలో’ పత్రిక వెల్లడించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హబిగంజ్ సదర్ సర్కిల్ అదనపు ఎస్పీ షహీదుల్ ఇస్లాం జోక్యం చేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు ఎనాముల్ హసన్‌ను పోలీసులు విడుదల చేశారు. విచారణలో అతడిపై నేరపూరిత ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చట్టం, న్యాయం వ్యవస్థ పనితీరుపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫిబ్రవరిలో కీలక ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న వేళ.. హింస, దహనాలు, దోపిడీలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలి నెలల్లో ఇస్లామిస్ట్‌ల చేతుల్లో పలువురు హిందూ మైనారిటీలు హతమయ్యారు. అయితే యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇవన్నీ అతిశయోక్తులేనని కొట్టిపారేస్తోంది.