China Twin Sisters: ముఖ కవలికలు ఒకేలా ఉన్నా సరే.. ఏ ఇద్దరి చేతి రేఖలు ఒకేలా ఉండవని.. అందుకనే ఎంత చదువుకున్నా.. సరే ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద వ్యక్తి సంతకంతో పాటు చేతి వేలి ముద్ర ను కూడా తీసుకుంటారు. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి మోసాన్ని అయినా వెంటనే గుర్తించవచ్చు అని శాస్త్రజ్ఞులు పలు మార్లు పలు వేదికల్లో ప్రకటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చైనా అయితే తాము శాస్త్ర, సాంకేతిక రంగంలో అందరికంటే మిన్న అంటూ గొప్పలు పోతూ ఉంటుంది.. అలాంటి చైనా అధికారులను బురిడీ కొట్టింది.. ఇద్దరు కవల అక్కచెల్లెలు.. తమ గుర్తింపులు మార్చుకుని.. విదేశాలకు ప్రయాణం చేశారు.. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు.. ఏకంగా 30 సార్లు విదేశాలకు వెళ్లి.. చివరి మోసం వెలుగులోకి వచ్చి.. పోలీసులకు చిక్కారు ఈ చైనా కవల సోదరీమణులు.. ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఉత్తర చైనా నగరమైన హర్బిన్‌కు చెందిన జౌ సోదరీమణులను అరెస్టు చేసి ఇప్పుడు విచారిస్తున్నారు.
చైనా వార్తా సంస్థ హర్బిన్ డైలీ తెలిపిన ప్రకారం.. ఉత్తర చైనా నగరమైన హర్బిన్‌కు చెందిన ‘హాంగ్’, ‘వీ’ కవల సోదరీమణులు. ఈ అక్కాచెలెళ్లను ‘జౌ’ సోదరీమణులుగా పిలుస్తారు. సోదరీమణులలో ఒకరైన హాంగ్ (అధికారులు జారీ చేసిన మారుపేరు) తన జపనీస్ భర్తతో కలిసి జపాన్‌కు వెళ్లాలనుకున్నప్పుడు ఇదంతా ప్రారంభమైంది. అయితే, అవుట్‌లెట్ ప్రకారం ఆమె వీసా దరఖాస్తు పదేపదే తిరస్కరించబడింది. అప్పటికే వీ కి జపాన్ కు వెళ్ళడానికి వీసా ఉంది.
దీంతో హాంగ్ సరికొత్త ఆలోచన చేసింది. తమ ఇద్దరి ముఖ కవలికలు ఒకేలా ఉండడంతో వీ పాస్ పోర్ట్ మీద జపాన్ కు వెళ్లాలనుకుంది. వీ పాస్ పోర్ట్ ని అరువుగా తీసుకుంది. మొదటి సక్సెస్ ఫుల్గా జపాన్ కు వెళ్లడంతో.. హాంగ్ తన సోదరీమణి వీ పాస్ పోర్ట్ తో తరువాత చైనా, జపాన్, రష్యా మధ్య కనీసం 30 సార్లు ప్రయాణించింది. ఇలా చేస్తూ.. చివరకు పోలీసులకు చిక్కింది.
తనిఖీలో హాంగ్ ప్రయాణానికి గల అసలు సంగతి తెలిసి.. షాక్ తినడం అధికారుల వంతు అయింది. వీ కూడా తన సోదరీమణి హాంగ్ పాస్‌పోర్ట్‌ని ఉపయోగించి థాయ్‌లాండ్, “ఇతర దేశాలకు” నాలుగు సార్లు వెళ్లివచ్చింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్కామ్‌ను గుర్తించారు.
అయితే చివరకు ఈ మోసం ఎలా వెలుగులోకి వచ్చిందో అస్పష్టంగా ఉంది. మే నెలలో చైనాకు వచ్చిన వీరిని అరెస్ట్ చేశారు. అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. ఈ మోసం ఎలా జరిగిందంటూ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ అక్కా చెల్లెళ్ల పాస్‌పోర్ట్ వ్యవహారం.. తెలివి తేటలు.. చైనీస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. “గుర్తింపును మార్చుకున్న కవలలు 30 కంటే ఎక్కువ సార్లు విదేశాలకు వెళ్లారు” (#twins exchanged identities and went abroad more than 30 times ) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ అయింది. ఇప్పటి వరకూ 360 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. లక్షలాది మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఈ అక్కాచెలెళ్ల కథ.. సినిమా స్క్రిప్ట్ ను తలిపిస్తుందని.. అసలు ఇన్ని సార్లు ఎలా ఇమ్మిగ్రేషన్ అధికారులను మోసం చేయగలిగారు అంటూ కొంతమంది నెటిజన్లు షాక్ తింటున్నారు. ” నా స్థానంలో నా కవల సోదరుడు పరీక్షలకు హాజరు కావాలని నేను కలలు కన్నాను” అని ఓ వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు. తనిఖీల సమయంలో వేలిముద్రలు స్పష్టంగా లేకపోవడంపై పలువురు ప్రశ్నించారు. “అత్యంత అధునాతన సాంకేతికత కూడా ఈ మోసాన్ని వెలికితీయడంలో విఫలమైంది. ఇది నమ్మశక్యం కావడం లేదంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
పౌరుల కదలికలను నిశితంగా పరిశీలించే చైనాలో.. ఈ మోసం ఎలా జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్న
పౌరుల కదలికలను నిశితంగా పరిశీలించే చైనాలో ఈ మోసం ఎలా జరిగిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 2018లో 1.4 బిలియన్ల పౌరుల ముఖాలను కేవలం ఒక్క సెకనులో స్కాన్ చేయగల సంకేతికత డ్రాగన్ కంట్రీ సొంతం అంటూ చైనా ప్రభుత్వ అధికారిక మీడియా పీపుల్స్ డైలీ పేర్కొంది. దీంతో ఇప్పుడు ఆ సాంకేతిక ఇద్దరు అక్కచెల్లల మోసాన్ని కనిపెట్టలేక పోయిందా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..