పారిశ్రామికవేత్త,ఆర్ధిక నేరస్థుడు విజయ్ మాల్యా అప్పగింతకు మార్గం సుగమమైందని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. ఇండియాకు ఆయన అప్పగింత విషయంలో బ్రిటన్ అధికారులు తనకు గట్టి హామీనిచ్చినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన..భారత-బ్రిటన్ సంబంధాలు, మాల్యా అప్పగింత అంశంతో సహా సమీప భవిష్యత్తులో ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతపై ఆ దేశ అధికారులతో చర్చలు జరిపారు. రెండు రోజుల పాటు లండన్ లోనే ఉన్న ఆయన.. బ్రిటన్-ఇండియా భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు 2030 నాటికి రోడ్ మ్యాప్ రూపకల్పన..దౌత్యాధికారుల మధ్య చర్చల అంశంపై సుదీర్ఘంగా వారితో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా మాల్యా అప్పగింత ప్రక్రియ వేగంగా జరుగుతుందని వారు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. ఇండియాలో మాల్యా ఆర్థిక నేరాల గురించి తాను వారికీ వివరించానన్నారు. ఇప్పటికే ఆయన అప్పగింత విషయంలో జాప్యం చాలా జరిగిందని వెల్లడించినట్టు హర్షవర్ధన్ పేర్కొన్నారు.
బ్రిటన్ లో మాల్యాకు గల న్యాయమార్గాలన్నీ మూసుకుపోవడంతో ఆయనకు రహస్యంగా ఈ దేశం ఆశ్రయం కల్పిస్తోందా అని మీడియా అడిగిన ప్రశ్నకు హర్షవర్ధన్..అలాంటిదేమీ లేదన్నారు. ఆయన అప్పీళ్లు కోర్టు పరిశిలనలో ఉన్నాయని, కోర్టులు కూడా వీటిని త్వరితగతిన పరిష్కరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఈ సమస్యకు సంబంధించి తాము కూడా ఈ ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నట్టు భారత హైకమిషనర్ గైత్రి ఇస్సార్ కుమార్ తెలిపారు. ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని ఈ ప్రభుత్వ దృష్టికి తెస్తూనే ఉన్నామన్నారు.మాల్యాతో బాటు నీరవ్ మోడీని కూడా బ్రిటన్ ఇండియాకు అప్పగించాల్సి ఉందని, నీరవ్ మోడీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఆయన అన్నారు. బ్రిటన్-భారత దౌత్యాధికారుల చర్చలు సెప్టెంబరులో జరుగుతాయని హర్షవర్ధన్ వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : వెంకటేష్ గారు కాళ్లు పట్టుకున్నప్పుడు!అంటూ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన విలక్షణ నటుడు శ్రీతేజ్..:Narappa Shritej Video.