AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో బందీలుగా భారతీయ విద్యార్థులు.. రష్యా సంచలన ప్రకటన

Russia Ukraine War: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యా ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో బందీలుగా భారతీయ విద్యార్థులు.. రష్యా సంచలన ప్రకటన
Russia Ukraine Crisis
Shaik Madar Saheb
|

Updated on: Mar 03, 2022 | 10:50 AM

Share

Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యా ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రం ఆపరేషన్‌ గంగాను నిర్వహిస్తోంది. ఈ తరుణంలో బుధవారం రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ కొందరు భారతీయ విద్యార్థులను (Indian Students) బందీలుగా ఉంచినట్లు రష్యా తెలిపింది. ఖార్కివ్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి, మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ మాట్టాడుతూ.. తమకందిన సమాచారం ప్రకారం.. ఉక్రేనియన్ నుంచి బెల్గోరోడ్‌కు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులను ఖార్కివ్‌లో ఉక్రెనియన్ అధికారులు బలవంతంగా నిర్బంధిస్తున్నారంటూ పేర్కొన్నారు. భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ స్పష్టంచేశారు. భారతదేశం ప్రతిపాదించినట్లుగా వారి సైనిక రవాణా విమానాలు లేదా భారతీయ విమానాలతో రష్యా భూభాగం నుంచి వారిని సురక్షితంగా ఇంటికి పంపుతామని పేర్కొన్నారు.

కాగా.. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. భారత్, పాకిస్థాన్, చైనా విద్యార్థులను రష్యా బందీలుగా మార్చిందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా ఆరోపణల అనంతరం ఉక్రెయిన్ విదేశాంగశాఖ ఈ ప్రకటన చేసింది. భారతదేశం, పాకిస్తాన్, చైనా ఇతర దేశాల విద్యార్థులు రష్యన్ సాయుధ దురాక్రమణకు బందీలుగా మారారంటూ ఆరోపించింది. ఈ ప్రకనటల మధ్య అసలు నిర్భందించింది ఎవరు..? ఎంతమందిని బంధించారు.. ఈ ఆరోపణల్లో నిజమెంత..? అనేది చర్చనీయాంశంగా మారింది.

మోదీ మాట్లాడిన కొన్ని గంటలకే..

కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత రష్యా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇరువురు దేశాధినేతలు భారతీయ విద్యార్థులను తరలించడంపై చర్చించినట్లు సమాచారం. ఇరువురు నాయకులు ఉక్రెయిన్‌లో పరిస్థితిని సమీక్షించారని.. పలు ప్రాంతాల నుంచి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంపై చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఇదిలావుండగా.. ఇప్పటివరకు 6000 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 20,000 మంది భారతీయులలో 6,000 మందిని ఇప్పటివరకు స్వదేశానికి తిరిగి తీసుకువచ్చామని.. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:

Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌లోని నగరాల స్వాధీనం దిశగా రష్యా సైన్యం.. తిరగబడుతున్న స్థానిక యువత..

UP Assembly Election 2022 Voting Phase 6 Live: అందరిచూపు సీఎం సీటు వైపే.. యూపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం..