AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి.. అమాయక ప్రజల మరణాల లెక్క తేల్చిన ఐరాస

రష్యా సేనల భీకరదాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌‌లో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. 2022 ఫిబ్రవరి 22న ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు సైనిక చర్యను ప్రారంభించాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా.. రక్తపాతం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.

రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి.. అమాయక ప్రజల మరణాల లెక్క తేల్చిన ఐరాస
Russia - Ukraine conflict (File Photo)
Janardhan Veluru
|

Updated on: Oct 06, 2023 | 7:46 AM

Share

రష్యా సేనల భీకరదాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌‌లో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. 2022 ఫిబ్రవరి 22న ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు సైనిక చర్యను ప్రారంభించాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా.. రక్తపాతం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతం ఖార్కివ్‌లోని ఓ సూపర్ మార్కెట్‌పై మాస్కో సేనలు జరిపిన తాజా క్షిపణి దాడుల్లో 49 మంది అమాయక ప్రజలు దుర్మరణం చెందారు. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద క్షిపణిదాడి ఇదే. అమాయక ప్రజల జనావాసాలపై కూడా మాస్కో సేనలు క్షిపణిదాడులకు పాల్పడుతూ అమాయక ప్రజలను పొట్టనపెట్టుకుంటోంది. రష్యా సేనల క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలు బలిపశువులు అవుతుండటం పట్ల అటు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తంచేసింది.

రష్యా దాడుల్లో 49 మంది ఉక్రెయిన్ పౌరుల మృతి..

ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక మేరకు రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో దాదాపు 10,000 మంది అమాయక పౌరులు మృతి చెందారు. వీరిలో 500 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పుతిన్ సేనలు దాడులను మరింత ఉధృతం చేశాయి. దీంతో ఉక్రెయిన్‌లో అమాయక పౌరుల మరణాల సంఖ్య కూడా పెరగడం పట్ల ఐరాస ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసం మొదలు జులై నెల వరకు ప్రతి రోజూ ఆరుగురు పౌరులు దుర్మరణం చెందగా.. 20 మంది గాయపడినట్లు ఐరాస నివేదిక వెల్లడించింది.

ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే రష్యా సేనల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. అక్కడ అమాయక ప్రజలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నట్లు ఐరాస నివేదిక తెలిపింది. అలాగే ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని లక్షలాది మంది దారిద్ర్య రేఖకు దిగువునకు చేరారు. డ్యామ్‌లపై రష్యా దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని వారు నీటి వనరులను కోల్పోయి తమ జీవనోపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది.

భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నా ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. రష్యా దాడులకు భయపడి వెనక్కి తగ్గేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తేల్చిచెబుతున్నారు. నాటో నుంచి వైదొలిగేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అమాయక ప్రజలు లక్ష్యంగా రష్యా దాడులు చేయడం ఉగ్రవాద చర్యగా జెలెన్‌స్కీ ధ్వజమెత్తారు. అటు రష్యా సేనలతో ఉక్రెయిన్ పోరాడేందుకు అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఆ దేశానికి ఆర్థిక, సైనిక, ఆయుధ సహాయాన్ని సమకూరుస్తున్నాయి.

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమని చెబుతున్న రష్యా.. అయితే ప్రస్తుతం తమ ఆధీనంలోని ఉక్రెయిన్ ప్రాంతాలను తిరిగి ఆ దేశానికి అప్పగించే అంశాన్ని చర్చల అజెండాలో చేర్చకూడదంటూ మెలికపెడుతోంది. అటు ఉక్రెయిన్ కూడా పుతిన్ రష్యా దేశాధ్యక్షుడిగా ఉన్నంత వరకు చర్చలు వృధా ప్రయాసగా అభిప్రాయపడుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి