Golden Visas: దేశ ఆర్ధిక ప్రగతి కోసం, ఫారిన్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొన్ని దేశాలు ప్రత్యేకమైన వీసాలను మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరి స్వార్థం వల్ల ప్రభుత్వాల లక్ష్యం పక్కదారి పడుతోంది. ఈ వెసులుబాటును ఆసరాగా తీసుకుని కొందరు ఆర్ధిక నేరగాళ్లు విదేశాల్లో తల దాచుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ ప్రభుత్వం (Britain Government) అలర్ట్ అయ్యింది. విదేశీ పెట్టుబడి దారులు బ్రిటన్‌లో నివాసం ఉండేందుకు ఉద్దేశించిన ‘గోల్డెన్‌వీసా’లను యూకే సర్కార్ గురువారం రద్దు చేసింది. 2008లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ గోల్డెన్ వీసా (Golden Visas)ల ద్వారా విదేశీ సంపన్న పెట్టుబడి దారులు బ్రిటన్‌లో రెండు మిలియన్ పౌండ్స్ (రూ.20.26 కోట్లు), అంతకు మించి ఇన్వెస్ట్ చేస్తే వారు కుటుంబాలతో సహా యూకేలో నివాసం ఉండేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అయితే భద్రతా సమస్యలు, తమ దేశాలలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినవారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వంటి కారణాల వల్ల యూకే సర్కార్ ఈ వీసాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లోకి అవినీతి పరులు ప్రవేశించడానికి టైర్ 1 ఇన్వెస్టర్ల ( Investors) వీసాలు అవకాశం కల్పించినట్లు హోం శాఖ కార్యాలయం అభిప్రాయ పడింది. ఈ వీసాల ద్వారా అత్యధికంగా రష్యా జాతీయులు యూకేలోకి ప్రవేశించారు. వారి ద్వారా ఇక్కడ అక్రమ నగదు చలామణీ అవుతున్నట్లు చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా బ్రిటన్ హోంశాఖ సెక్రటరీ ప్రీతి పటేల్ మాట్లాడుతూ.. అక్రమ నగదు లావాదేవీలను అరికట్టడంలో భాగంగా గోల్డెన్ వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న అవినీతిపరులను అడ్డుకోవడంతో పాటు బ్రిటీష్ ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ప్రీతి పటేల్ వెల్లడించారు.
గోల్డెన్ వీసా వస్తే యూకే పౌరసత్వం పొందినట్లేనా..?
ఇటీవల కాలంలో గోల్డెన్ వీసా అనే పదం బాగా వినిపిస్తున్నది. విదేశీ పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను తీసుకొచ్చింది. గోల్డెన్ వీసా వచ్చింది అంటే వారు యూఏఈ పౌరసత్వం పొందినట్టే అనుకోవచ్చు. వ్యాపారవేత్తలు, పర్యాటకులు, శాస్త్రవేత్తలు, కళాకారులకు గోల్డెన్ వీసాను అందిస్తుంటారు. ఇలాంటి వారందరికీ గోల్డెన్ వీసా అందిస్తారా అంటే లేదని చెప్పాలి. విద్యార్థులకైతే ప్రతిభ ఆధారంగా గోల్డెన్ వీసాలను అందిస్తారు. అదే కళాకారులకైతే వారి రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండాలి. అదేవిధంగా వారు తరచుగా యూఏఈకి ప్రయాణం చేస్తుండాలి.
ఇలాంటివారు వారికి సంబంధించిన వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. ఇక ఉన్నత చదువులు చదువుకునే వారు, శాస్త్రవేత్తలు వారికి ఎమిరేట్స్ కౌన్సిల్ నుంచి అక్రిడేషన్ పొంది ఉండాలి. అదేవిధంగా, వ్యాపారవేత్తలైతే యూఏఈలో సుమారు 20 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఉండాలి. గోల్డెన్ వీసా పొందిన వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూఏఈ కి వెళ్లిరావొచ్చు. అక్కడ ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు, స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: