
అమెరికాలోని టెక్సాస్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. వరదల ఉధృతికి వందల ఇళ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య 82 దాటింది. గల్లంతైన 41 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కెర్ కౌంటీ, టెక్సాస్ హిల్ కంట్రీలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలు వరదల్లో కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతంలో 68 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో 28 మంది చిన్నారులే ఉండడం అందిరిని కలిచివేస్తోంది. ట్రావిస్, బుర్నెట్, కెండాల్, టోమ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలలోనూ 10 మంది చనిపోయారు. టెక్సాస్ హిల్ కంట్రీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి హాజరైన 10 మంది బాలికలు, ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. వారి క్యాబిన్లు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. వరదలు కారణంగా సెంట్రల్ టెక్సాస్ ప్రాంతానికి చేరుకోవడానికి సహాయక బృందాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.
టెక్సాల్‌లో వరదల్లో 41 మంది గల్లంతయ్యారని, ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు వెల్లడించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ వరదలు రావచ్చని అలర్ట్ జారీ చేశారు. నదులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉందని స్థానికులను హెచ్చరించారు. క్యాంప్ మిస్టిక్ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని సూచించారు.
ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 850 మందిని అధికారులు రక్షించారు. గత నాలుగు రోజుల నుంచి టెక్సాస్‌లో కుంభవృష్టి కురుస్తోంది. గ్వాడలూపే నదిలో నీటిమట్టం వేగంగా పెరగడంతో చాలా నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కుప్పకూలాయి. చాలా కౌంటీల్లో ఇప్పటికి కూడా కరెంట్ సరఫరా సరిగ్గా లేదు. మంచినీటి కోసం జనం నానాతంటాలు పడుతున్నారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తునట్టు అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.