TANA: ‘తానా’లో రూ.30 కోట్ల స్కామ్ ప్రకంపనలు..! కేసు FBI వరకు వెళ్తుందా..?
అడిగినా సాయం చేయడానికి ముందుకు రానివాళ్లుంటారు. అడగకపోయినా తమవంతు సాయం అందించాలని ఉవ్విళ్లూరుతుంటారు మరికొందరు. అలాంటి వారికి ఓ డెస్టినేషన్ పాయింట్ 'తానా'. ఎక్కడ డొనేట్ చేయాలి, ఎవరికి మన సాయం అందాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు.. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి కనిపించే పేరు 'తానా.
తెలుగు నేల ‘పుట్టినిల్లు’.. తెలుగు జాతికి ఉత్తర అమెరికా ‘మెట్టినిల్లు’.. అని అంటుంటారు ప్రవాస తెలుగువారు. ఈ అభిమానం ఎంతలా చొచ్చుకెళ్లిందంటే.. ఇదీ మనదేశమే అని ఓన్ చేసుకునేంతలా. ఎంతైనా దేశం కాని దేశమేగా అది. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా ఇబ్బందొస్తే చేదోడు వాదోడుగా ఉండేదెవరు? అనుకోని పరిస్థితుల్లో చనిపోతే.. ఆఖరి చూపుకు నోచుకోనంత కష్టం వస్తే.. సాయం చేసేదెవరు? అమెరికాలో తెలుగు సంస్కృతి-సంప్రదాయాలను కాపాడేదెవరు? తెలుగు భాషను పరిరక్షించేవాళ్లెవరు? వీటన్నిటికీ సమాధానం ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా-తానా’. లక్ష్యం-ఆశయం-ఉద్దేశం గొప్పవే అయినా.. ఘనమైన కీర్తి ఉన్నా.. ఇప్పుడు ‘తానా’ అంటే అర్థం మారుతోంది. ‘తానా ఫౌండేషన్’లో 30 కోట్ల రూపాయల స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. 47 ఏళ్ల ఏనాడు జరగని ఇంతపెద్ద కుంభకోణం ఇప్పుడు వెలుగుచూడడానికి కారణమేంటి? అసలు తానాకు నిధులు ఎలా వస్తాయి? ఎవరిస్తారు తానాకు నిధులు? తానా అకౌంట్ల నుంచి తమ సొంత అకౌంట్‌కి అంతపెద్ద మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అంత ఈజీనా? 30 కోట్ల కుంభకోణం ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పనేనా? డిటైల్డ్‌గా తెలుసుకుందాం పదండి.
అమెరికాలో తెలుగువారికంటూ కొన్ని సంఘాలున్నాయ్. కాని, బాగా డబ్బున్న సంఘం మాత్రం ‘తానా’నే అనే బ్రాండ్ ఉంది. మోస్ట్ ప్రెస్టీజియస్ సంఘం కూడా. తానాలో పదవి అంటే తెలుగు సొసైటీలో దక్కే ఓ అత్యున్నత ప్రతిష్ఠ అది. అమెరికాలోని తెలుగువారి మధ్య తమకంటూ ఓ వెయిటేజ్ ఇస్తుందా పదవి. సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, సినీ స్టార్లు, వీవీఐపీలు.. ఇలా ఎంతోమందితో కొత్త పరిచయాలను ఏర్పరుస్తుంది. అంతేనా.. ‘తానా’ పదవితో తెలుగు నేలపై అడుగుపెట్టినప్పుడు ఉండే క్రేజే వేరు. అందుకే, తానాకు అంత పేరు, ఆ పదవులకు అంత పోటీ. తానా అంటే రెండక్షరాల పేరు కాదది. అమెరికాలోని తెలుగు ఆర్గనైజేషన్స్‌లో అతిపెద్దది ఇదే. రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు సభలు పెడితే.. మినిమం పది వేల నుంచి 15వేల మంది వస్తారు. ఇంత సక్సెస్ స్టోరీ ఉన్న తెలుగు సంఘం అమెరికాలో మరొకటి లేదు. అంతెందుకు.. అమెరికాలో పదుల సంఖ్యలో తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. రాష్ట్రానికి ఒకటి, సిటీకొకటి చొప్పున సంఘాలు ఉన్నాయి. వాటన్నింటికీ మూలం, స్ఫూర్తి ఈ తానానే. ఒక్కమాటలో చెప్పాలంటే.. మదర్ ఆఫ్ ఆల్ అసోసియేషన్స్. తానా అంటే.. కేవలం ఒక్క సంస్థగానే కనిపిస్తుంది అందరికీ. కాని, ఇందులో మూడు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి తానా ఫౌండేషన్. ఈ వ్యవస్థ సేవా కార్యక్రమాలను చేస్తుంది. రెండోది.. తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ. తానా అసోసియేషన్‌కు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంది. మూడోది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్.. అకౌంటింగ్, డొనేషన్స్ వంటి కార్యక్రమాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ మూడింటికీ దేని బాధ్యతలు దానివే. అలాంటి ఘన చరిత్ర ఉన్న తానా గురించి, తానా చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాల్సిన సమయంలో.. 30 కోట్ల రూపాయల కుంభకోణం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఇంతకీ ఏంటీ 30 కోట్ల రూపాయల కుంభకోణం. 30 కోట్ల కుంభకోణం చేసిందెవరో తెలిసినా.. అదెలా జరిగింది, దాని వెనక ఎవరెవరున్నారన్నది తెలుసుకోవడమే ముఖ్యం ఇప్పుడు. ఆ ప్రయత్నమే చేద్దాం.
అడిగినా సాయం చేయడానికి ముందుకు రానివాళ్లుంటారు. అడగకపోయినా తమవంతు సాయం అందించాలని ఉవ్విళ్లూరుతుంటారు మరికొందరు. అలాంటి వారికి ఓ డెస్టినేషన్ పాయింట్ ‘తానా’. ఎక్కడ డొనేట్ చేయాలి, ఎవరికి మన సాయం అందాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు.. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి కనిపించే పేరు ‘తానా.’ ‘తానా’కు ఇస్తే.. ప్రతి రూపాయికి లెక్క ఉంటుందన్న నమ్మకం చాలామందికి. అందుకే, తానా ఫౌండేషన్‌పై అంత విశ్వాసం ఏర్పడింది. తానా ఫౌండేషన్ అకౌంట్లో 30 కోట్లు ఉన్నాయా అనే ఆశ్చర్యపోయే వారికి సమాధానం.. ఇలా డొనేషన్ల రూపంలో వచ్చే నిధులే. డొనేషన్లు, రిజిస్ట్రేషన్ల రూపంలో కోట్లకు కోట్లు వచ్చిపడతాయి. వాటినే సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు. అలాంటి నిధులు ఇప్పుడు పక్కదారి పట్టాయి. నిజానికి తానా నుంచి ఒక్క డాలర్ ఖర్చు పెట్టాలన్నా పాలకవర్గం అనుమతి తప్పనిసరి. సేవా కార్యక్రమాలు, ఖర్చుల లెక్కలను చూసేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. గత పాలకవర్గంలో తానా ఫౌండేషన్ ట్రెజరర్‌గా వ్యవహరించిన శ్రీకాంత్ పోలవరపు మాత్రం.. బోర్డ్‌కు తెలియకుండా తెరవెనక కథ నడిపారు. నిజాయితీగా ఖర్చు చేయాలంటే డైరెక్టర్ల దగ్గరికి వెళ్లాలి గానీ.. కొట్టేయడానికి కాదుగా. అలా.. ఎవరికీ తెలియకుండా 30 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్‌కు నిధులను మళ్లించారు. నిజానికి అంతపెద్ద అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యమేనా అంటే.. సాధ్యమే అని నిరూపించింది ఈ ఘటన. 2022 సెప్టెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 27వ తేదీ వరకు 29 దఫాలుగా మొత్తం 30 కోట్ల రూపాయలనూ తన సొంత అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.
డబ్బు పోయింది సరే.. ఇంతకీ ఎలా బయటపడింది ఈ విషయం? ఇందాక చెప్పుకున్నాం కదా.. తానా ఫౌండేషన్‌కు ఒక పాలకవర్గం అనేది ఉంటుంది అని. ఆ పాలక వర్గానికి ఎన్నికలు జరుగుతుంటాయి. అలా 2023-25 సంవత్సరానికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ఏమంత ప్రశాంతంగా జరగలేదు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా గెలిచిన వాళ్లు, ఓడిపోయిన వాళ్లు న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా.. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు లీగల్ ఫైట్ జరుగుతూనే వచ్చింది. చివరికి కోర్టు నిర్ణయంతో కొత్త ఎగ్జిక్యూటివ్ టీమ్ ఏర్పడింది. 2024 ఫిబ్రవరిలో తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, ట్రెజరర్‌గా వినయ్ కుమార్ మద్దినేని ఎన్నికయ్యారు. ఎప్పుడో ఫిబ్రవరిలో కొత్త కార్యవర్గం ఏర్పడితే.. 30 కోట్ల కుంభకోణం ఇప్పుడు బయటపడడమేంటి? ఇన్నాళ్లు ఏం జరిగింది? ఈ ప్రశ్నకు చాలా సుదీర్ఘమైన సమాధానం ఉంది. కొత్తగా ఎన్నికైన వాళ్లు మొదట చేసే పని ఏంటి..? అకౌంట్లలో ఉన్న డబ్బెంత, ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు చేశారు అనే లెక్కలు తీయడమేగా. అదే పనిచేశారు నూతన కార్యవర్గ సభ్యులు. కాని, శ్రీకాంత్ పోలవరపు అనే ఎక్స్-ట్రెజరర్ సహకరిస్తేగా. దాదాపు ఏడు నెలల పాటు అకౌంట్ల వివరాలు ఇవ్వలేదు. పైగా తానా ఫౌండేషన్‌కు రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఒకటి PNC బ్యాంక్, రెండో అకౌంట్ మెరిల్ లించ్ బ్యాంక్. నిజానికి బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లన్నీ తానా ఫౌండేషన్ అఫీషియల్ మెయిల్‌కి రావాలి. కాని, శ్రీకాంత్ పోలవరపు మాత్రం.. ఆ అకౌంట్ స్టేట్‌మెంట్లు తన మెయిల్‌కి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు ఇవ్వమని శ్రీకాంత్ పోలవరపును ఎన్నోసార్లు అడిగి, ఫోన్లు చేసి, ఈ-మెయిల్స్ పెట్టారు. అలా అడగ్గా అడగ్గా.. రెండు నెలల తరువాత రియాక్ట్ అయ్యారు. అది కూడా PNC బ్యాంక్ ఖాతా వివరాలే ఇచ్చారు. మెరిల్ లించ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడానికి మాత్రం పలు సందర్భాల్లో, పలు కారణాలు చెబుతూ వచ్చారు. కేవలం కొన్ని జమా ఖర్చుల వివరాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. సరే.. ఖర్చుల వివరాలు ఇచ్చారు కదా అని కొంతకాలం సైలెంట్ అయింది కొత్త పాలకవర్గం. బట్.. అకౌంట్స్ ఆడిట్ అయితే జరగాల్సిందేగా. ఆ టైమ్ రానే వచ్చింది. 2023 ఏడాదికి సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన టైమ్ అది. అప్పుడు కచ్చితంగా బ్యాంక్ ఆపరేషన్స్ వివరాలు ఇవ్వాల్సిందే. ఆ సమయంలో.. శ్రీకాంత్ పోలవరపును గట్టిగా ప్రశ్నిస్తే గానీ బ్యాంక్ ఆపరేషన్స్ డిటైల్స్‌ను కొత్త కమిటీ చేతికి ఇవ్వలేదు. బ్యాంక్‌కి లెటర్ రాశానని ఒకసారి, బ్యాంక్ రిప్లై రాలేదని మరోసారి, బ్యాంక్ వాళ్లు మరింత సమాచారం అడిగారని ఇంకోసారి, ఇదిగో ఇచ్చేస్తున్నానంటూ దాటవేయడం, వారంలో అన్నీ సబ్‌మిట్ చేస్తాననడం.. ఇలా తప్పించుకుంటూ వచ్చారు శ్రీకాంత్ పోలవరపు. ఇదంతా జరిగే సరికి అక్టోబర్ రానే వచ్చింది. అప్పుడు ఇచ్చారు బ్యాంక్ ఆపరేషన్స్ డిటైల్స్. ఆ వివరాలు పట్టుకుని అక్టోబర్-నవంబర్ మధ్య మెరిల్ లించ్ బ్యాంక్ అకౌంట్స్, ఫౌండేషన్ క్విక్ బుక్స్‌లో లెక్కలను ఆడిట్ చేస్తున్నప్పుడు నిధులు మళ్లించారన్న విషయం బయటపడింది.
విషయం బయటపడగానే.. నవంబర్ 25న ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది తానా బోర్డ్. ఆ సమావేశానికి వచ్చిన శ్రీకాంత్ పోలవరపు.. ‘ఎస్.. తానే ఈ పని చేశా’ అని ఒప్పుకున్నారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తానని కూడా చెప్పారు. విషయం మెడకు చుట్టుకుంటోందని అర్థమవగానే.. లక్ష డాలర్లు తానా అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు కూడా. మిగతా అమౌంట్ డిసెంబర్ చివరి నాటికి ఇచ్చేస్తానని ప్రాధేయపడ్డారు. కాకపోతే.. ఇంత పెద్ద వ్యవహారం అప్పటి ఫౌండేషన్ ఛైర్మన్‌కు తెలియకుండా ఉంటుందా అన్న అనుమానం అయితే ఉండేది. ఆ సమయంలో ఛైర్మన్‌గా ఉన్న వెంకటరమణ యార్లగడ్డను ‘ఈ విషయం మీకు తెలియదా’ అని ప్రశ్నిస్తే.. జరిగింది వినగానే తానే షాక్ అయ్యానని చెప్పుకోవడం ఆయన వంతు అయింది. శ్రీకాంత్ పోలవరపు కూడా.. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డానని అంగీకరించారు.
హమ్మయ్య కుంభకోణం బయటపడింది అని అనుకోడానికి లేదిప్పుడు. చేసిందెవరో, ఎలా చేశారో తెలిసినా.. తీసుకున్న డబ్బుని ఎలా వెనక్కి తీసుకురావాలన్నదే ఇప్పుడు సమస్య. ఒకవేళ ఆయన ఇవ్వలేకపొతే ఏం చేయాలన్నదీ పెద్ద ప్రశ్నే. అఫ్‌కోర్స్.. ఆ డబ్బును తిరిగి ఇస్తామని శ్రీకాంత్ పోలవరపు చెబుతున్నారు గానీ.. పాలకవర్గంలోని కొందరు మాత్రం.. కేవలం తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వడమే కాదు.. ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశారు కాబట్టి నోటీసులు ఇచ్చి కేసు ఫైల్ చేయాల్సిందేనని కొందరు తానా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తప్పు ఒప్పుకుంటే ఒప్పు అయిపోతుందా? ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన వారిని శిక్షించే అధికారం ‘తానా’కు ఉంటుందా? లేక అమెరికా చట్టాలను ఫాలో అవుతారా? ఒకవేళ అమెరికా చట్టాల ప్రకారం కేసు ఫైల్ అయితే పనిష్మెంట్ ఎలా ఉంటుంది? గతంలో అమెరికాలోని ఒక తెలుగు సంఘంలోనూ ఇలాంటి ఆర్థిక కుంభకోణం జరిగింది. అప్పుడు FBI యాక్షన్‌లోకి దిగింది. మరి.. ఆ తరువాత ఏం జరిగింది? కంప్లీట్ డిటైల్స్ ఒక షార్ట్ బ్రేక్ తరువాత.
తానా ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. ప్రాఫిట్స్ ఆశించకుండా సేవ చేయాల్సిన ఒక ఆర్గనైజేషన్. అలాంటి సంస్థ గనక నిధులు దుర్వినియోగం చేసిందని తేలితే.. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి NGOలు 20వేల డాలర్ల కంటే ఎక్కువ ఫండ్స్‌ను దారిమళ్లిస్తే.. దోచేసిన అమౌంట్‌కు మూడింతల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు.. పదేళ్ల శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ జరిమానా లేక శిక్ష అనే ఆప్షన్ ఉండదు. మూడింతల ఫైన్ కట్టడంతో పాటు పదేళ్లు జైల్లో కూర్చోవాలి. పైగా ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో, వెంటనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-FBI రంగంలోకి దిగుతుంది. FBI రంగంలోకి దిగితే మామూలుగా ఉండదు. దానికి తోడు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్-IRS కూడా యాక్షన్‌లోకి దిగుతుంది. ఈ రెండూ దర్యాప్తు చేయడం మొదలుపెడతాయి. సో, తప్పించుకోవడం గాని, క్షమాపణలు చెప్పి వెళ్లిపోవడం గానీ ఉండదు. ఒక్కోసారి NGO ఆపరేషన్స్‌పైనా ఎఫెక్ట్ పడొచ్చంటున్నారు నిపుణులు.
గతంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్-NATA కూడా అదే పరిస్థితి ఎదుర్కొందని చెబుతున్నారు. నిధులకు సంబంధించిన గోల్‌మాల్ జరగడంతో నాటా అకౌంట్లను FBI పూర్తిగా సీజ్ చేసిందని చెబుతున్నారు. అంతేకాదు.. FBI చేసిన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, పెట్టిన కేసుల కారణంగా కొంతమంది నాటా సభ్యులు తమ ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని టాక్. నాటాలోని చాలా మంది కీలక సభ్యులు న్యాయపరమైన సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చిందని అందరూ చెప్పుకుంటున్న మాట. అసోసియేషన్ వెబ్‌సైట్‌ను కూడా కొన్నాళ్లు మూసేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అంతేకాదు.. అమెరికాలో కొన్ని ప్రముఖ తెలుగు అసోసియేషన్లు కూడా ఇలాగే నిధులను దుర్వినియోగం చేశాయనే వార్తలొచ్చాయి అప్పట్లో. అంతర్జాతీయంగా పేరున్న ఓ మల్టీనేషనల్ కంపెనీ.. మ్యాచింగ్ గ్రాంట్స్ ఎకోసిస్టమ్‌ను దుర్వినియోగం చేసిందనేది ఆ కంప్లైంట్ సారాంశం. బే ఏరియాకు చెందిన ఆ MNC.. తెలుగు సంఘాలకు ప్రత్యేకంగా విరాళంగా ఇస్తోందని IRSకి కంప్లైంట్ వెళ్లింది. మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌ను అడ్డం పెట్టుకుని.. తెలుగు సంఘాలు కూడా నిధులను దారి మళ్లించాయనే ఫిర్యాదు అందింది. దీంతో FBI కూడా అప్పట్లో రంగంలోకి దిగిందని చెబుతున్నారు.
ఇక్కడ మరో నిజం కూడా మాట్లాడుకోవాలి. కొన్ని తెలుగు సంఘాలపై విమర్శలు రావొచ్చేమో గానీ.. వాటి సేవా కార్యక్రమాలు మాత్రం అత్యంత నిజాయితీతో జరిగాయి. ఒక సంఘం మరో సంఘంతో పోటీ పడి మరీ సేవా కార్యక్రమాలు చేశాయి. కేవలం అమెరికాలోని తెలుగు వారికి సేవ చేయడం కోసమే.. చాలా అసోసియేషన్స్ పుట్టుకొచ్చాయి. అందుకే, అమెరికాలో ఉన్నన్ని తెలుగు అసోసియేషన్లు.. అమెరికాలో ఉంటున్న మరే భారతీయ భాషల వారికీ లేవని చెబుతున్నారు. పైగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ అమెరికా.. తెలుగు. ఇంగ్లీష్‌లో ఎందుకు.. గర్వంగా తెలుగులోనే చెప్పుకుందాం ఈమాట. అమెరికాలో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానం. 11వ స్థానంలో కూడా గొప్పేనా అనుకోకండి. నిజంగా గొప్పే. అమెరికాలో 350 భాషలు మాట్లాడేవారు ఉన్నారని గుర్తిస్తే అందులో తెలుగు వారిది 11వ స్థానం. అమెరికాలో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషల్లో మూడోది.. తెలుగు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తెలుగు వారి సంఖ్య 12 లక్షలకు పైనే. అలాంటి తెలుగు వారిని ఒక్కటిగా కలిపిన ఘనత ఈ సంఘాలదే.
ముఖ్యంగా ఇక్కడ ‘తానా’ సేవల గురించి మాట్లాడుకోవాలి. అమెరికాకు వెళ్లిన ఎంతోమంది తెలుగువాళ్లు గృహహింసకు గురయ్యారు. అలాంటి వారిని ఆదుకుంది తానా. కేవలం చేదోడుగా ఉండడమే కాదు.. అలాంటి మహిళల తరపున న్యాయపోరాటం చేసింది. అమెరికాలో జీవించాలంటే ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. బట్.. ఇన్సూరెన్స్ అత్యంత ఖరీదైనది. అందుకే, బీమా సౌకర్యం లేని వారికి వైద్య సహాయం చేయడానికి కూడా వెనకాడదు తానా. ఇక.. అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా తెలుగువాళ్లు చనిపోతే.. వారి డెడ్‌బాడీని ఇండియాకి పంపించే బాధ్యతలు తీసుకుంటుంది. భౌతికకాయాన్ని ఇండియాకు పంపించేందుకు అయ్యే ఖర్చులు, దానికి కావాల్సిన లీగల్ క్లియరెన్స్ పనులను కూడా స్వయంగా తానానే దగ్గరుండి చూసుకుంటుంది. ఈ విషయంలో తానా చేసే సేవలు తెలుగు నేలపై ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. చనిపోయిన వారి మృతదేహాన్ని అయినవాళ్లకి అప్పగించడంలో ఆస్థాయిలో సేవలందిస్తోంది తానా. అమెరికాలో టీమ్ స్క్వేర్ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్‌కు అమెరికా నలుమూలలా వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఎక్కడైనా, ఎప్పుడైనా.. తెలుగు వారు చనిపోయారనే వార్త తెలియడం ఆలస్యం.. టీమ్ స్క్వేర్ ఆర్గనైజేషన్‌తో కలిసి.. ఆ మృతదేహాన్ని తెలుగు రాష్ట్రాలకు చేర్చే బాధ్యత తీసుకుంటుంది. ప్రాంతం, మతం, కులం ఇవేమీ చూడరు. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా తానానే భరిస్తుంది. అంతేకాదు, తానాలో సభ్యత్వం ఉందా లేదా అనేది కూడా అనవసరం. సాయం చేయాల్సిందే అనుకుంటారు, ఆవిధంగా ముందుకెళ్తారు. ఈ స్థాయిలో సేవలు అందించే తెలుగు అసోసియేషన్ అమెరికాలో ‘తానా’ మాత్రమేనని చాలా ఘనంగా చెప్పుకుంటారు అమెరికాలోని తెలుగువారు.
ఇదొక్కటే కాదు.. కోటి ఆశలతో అమెరికాకు వచ్చే వారికి ఒక్కోసారి సరైన స్కిల్స్ లేక ఉద్యోగాల్లో వెనకబడుతుంటారు. అలాంటి వారికి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుపుతోంది. అంతేకాదు.. అమెరికాలో తెలుగు భాషను బతికించడానికి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను పరిరక్షిస్తూ.. అందుకు అవసరమైన కార్యక్రమాలను కూడా రూపొందిస్తోంది. ప్రత్యేకంగా అమెరికాలో సెటిల్ అయిన వారి పిల్లలకు తెలుగు నేర్పించే కార్యక్రమం చేపడుతోంది. కేవలం అమెరికాలోనేనా తానా సేవలు అంటే.. కాదు. ఇండియాలోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అనాధాశ్రమాలకు, గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధులకు, చదువులో రాణిస్తున్న పేద విద్యార్ధులకు ఎన్నోసార్లు, ఎన్నోరకాలుగా సాయం అందించిన చరిత్ర తానాది. అందుకే, ఒకప్పుడు తానా నుంచి పిలుపు వచ్చిందంటే.. ఎంతో ఘనంగా చెప్పుకునే వారు. అమెరికాలో ‘తానా’ వేదికపైకి ఎక్కడం ఓ అత్యున్నత గౌరవంగా భావించే వారు. ఎంతోమంది సినీతారలు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రముఖులు.. ఇలా ఎంతోమంది తానా వేదికపైకి వెళ్లడం తమకు మాత్రమే దక్కిన అరుదైన అవకాశంగా భావించే వాళ్లు. సో, కీర్తి ఘనమే. ఎటొచ్చీ అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు చేసే పని వల్ల, వారి స్వార్థం కారణంగా తానాకు చెడ్డపేరు వస్తోంది. తానా చేసిన మంచి పనులు లెక్కలేనన్ని.. కాని కొందరి స్వార్థం వల్ల వచ్చిన విమర్శలు లెక్కపెట్టగలిగేన్ని. త్వరలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవాల్సిన ఈ తరుణంలో.. తానా ఇంత సర్వీస్ చేసిందని చెప్పుకోవాల్సిన సమయంలో.. తానాలో గ్రూపుల గురించి, ఫండ్ రైజింగ్‌పై వచ్చిన ఆరోపణల గురించి, తానా ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందనే విమర్శల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం.. నిధులు మళ్లించిన శ్రీకాంత్ పోలవరపు మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం, కోర్టు ద్వారా డబ్బు వెనక్కి వచ్చే మార్గాలు చూడటం అతిపెద్ద టాస్క్. అన్నింటికీ కంటే ముఖ్యంగా మున్ముందు ఇలాంటి అవినీతి, కుంభకోణాలు జరగకుండా సంస్థ విధి విధానాలలో మార్పులు చేయడం అత్యవసరం. ఒక్క తానా మాత్రమే కాదు.. అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది.
తానా ఎదుర్కొంటున్న ఈ సమస్య నుంచి ఎంత త్వరగా బయటపడుతుంది, ఆ మరకను ఎలా చెరుపుకుంటుందన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ముఖ్యంగా విరాళాలు ఇచ్చే వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తానా ముందున్న అతిపెద్ద టాస్క్. మరి ఈ విపత్కర పరిస్ధితులను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..