కరోనాకు స్వీడెన్ కంపెనీ ‘మౌత్ స్ప్రే’.. రిజల్ట్ సూపర్ అంటోన్న సంస్థ
మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్‌లను తయారుచేయడంలో నిమగ్నమైన విషయం తెలిసిందే.

మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్‌లను తయారుచేయడంలో నిమగ్నమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వీడన్ కంపెనీ ఎంజమైటికా, కోల్డ్‌జైమ్ అనే మందును తయారు చేసింది. ట్రయల్స్‌లో ఈ మందు, వైరస్‌ను నియంత్రిస్తున్నట్లు తేలిందని ఆ కంపెనీ చెబుతోంది. కరోనా సోకిన తరువాత నోరు, గొంతులో వైరస్ కొంత కాలం వృద్ధి చెందుతుంటుంది. ఆ సమయంలో కోల్డ్‌జైమ్ 98.3 శాతం వరకు నిర్వీర్యం చేస్తుందని ఎంజమైటికా గుర్తించింది. వైరస్‌తో కూడిన కణాలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తేలిందని ఆ సంస్థ ప్రకటించింది.
ఓ యంత్రం సాయంతో కోల్డ్‌జైమ్‌ను నోట్లోకి పిచికారి చేసుకోవాల్సి ఉంటుందని, ఇందులో దుష్ఫలితాలు కనిపించలేదని కంపెనీ తెలిపింది. అమెరికన్ కంపెనీ మైక్రోబాక్ లేబొరేటరీస్‌లో తాము ఈ పరిశోధనలు నిర్వహించామని సంస్థ తెలిపింది. అయితే ఈ ఫలితాల వలన మందును నేరుగా మానవులపై ప్రయోగించే వీలు కుదరనందున.. మరిన్ని పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమమవుతుందని కంపెనీ తెలిపింది. కాగా కోల్డ్‌జైమ్ కరోనా వైరస్‌తో పాటు సాధారణ జలుబుకు కారణమైన ‘హెచ్‌కోవడ్–229ఈ’ వైరస్‌పై కూడా ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనల్లో తేలినట్లు సంస్థ చెబుతోంది.