భారత్ ఐటీ పవర్‌కు పుతిన్ సలాం.. భారతీయుల కోడింగ్ స్కిల్స్‌కు ప్రపంచమే ఫిదా..

అగ్రరాజ్యం అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల కూటమి జీ7 ఆధిపత్యానికి కాలం చెల్లిందా? గ్లోబల్ ఎకానమీని శాసించే కొత్త శక్తులు పుట్టుకొచ్చాయా? అంటే.. అవుననే సమాధానం ఇస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఐటీ రంగంలో భారతదేశానికి ఉన్న తిరుగులేని గ్లోబల్ పవర్‌ను ప్రశంసించిన పుతిన్.. ఆర్థిక శక్తిలో జీ7 కూటమిని బ్రిక్స్ ఎలా వెనక్కి నెట్టేసిందో గణాంకాలతో సహా వివరించారు.

భారత్ ఐటీ పవర్‌కు పుతిన్ సలాం.. భారతీయుల కోడింగ్ స్కిల్స్‌కు ప్రపంచమే ఫిదా..
Putin Praises India It Power

Updated on: Jun 06, 2026 | 10:25 AM

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఎకానమిక్ ఫోరం 2026 వేదికగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో రష్యాకు ఉన్న సంబంధాలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగవని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఐటీ రంగంలో భారతదేశం పోషిస్తున్న అగ్రగామి పాత్రను ప్రశంసించడంతో పాటు గ్లోబల్ ఎకానమీలో అమెరికా నేతృత్వంలోని జీ7 కూటమి కంటే బ్రిక్స్ కూటమి అత్యంత శక్తివంతంగా ఎదుగుతోందని గణాంకాలతో సహా నిరూపించారు.

ఐటీ రంగంలో భారత్ ఒక గ్లోబల్ లీడర్..

ప్రపంచ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో భారతదేశానికి ఉన్న తిరుగులేని ఆధిక్యాన్ని పుతిన్ ప్రత్యేకంగా అభినందించారు. “ఐటీ పరిశ్రమలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న మా అత్యంత కీలక భాగస్వామి భారతదేశానికి నేను స్వాగతం పలుకుతున్నాను. ప్రపంచ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో భారత్ వాటా గణనీయంగా ఉంది. భారత ప్రజలు ఎంతో ప్రతిభావంతులు, ఉన్నత విద్యావంతులు. ముఖ్యంగా కోడింగ్, ఇతర సాంకేతిక రంగాలలో భారతీయుల సామర్థ్యానికి ప్రపంచవ్యాప్త ఖ్యాతి ఉంది” అని పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు.

జీ7 కూటమిని దాటేసిన బ్రిక్స్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బిందువు మారుతోందని, పశ్చిమ దేశాల ఆధిపత్యం తగ్గుతోందని పుతిన్ అన్నారు. కొనుగోలు శక్తి సమానత ఆధారంగా గ్లోబల్ జీడీపీలో బ్రిక్స్ కూటమి వాటా, వృద్ధి రేటును ఆయన ఈ క్రింది విధంగా వివరించారు.

ప్రపంచ జీడీపీ వాటా: ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ దేశాల వాటా 40 శాతం కాగా, జీ7 కూటమి వాటా 29 శాతం కంటే తక్కువకు పడిపోయింది.

ఆర్థిక వృద్ధిలో సగం బ్రిక్స్‌దే: గత ఐదేళ్ల ప్రపంచ వార్షిక వృద్ధి రేటును పరిశీలిస్తే.. అందులో దాదాపు సగం అంటే 49శాతం వృద్ధి బ్రిక్స్ దేశాల వల్లే సాధ్యమైంది. కాగా G7 వాటా కేవలం 18శాతం మాత్రమే.

భవిష్యత్తు అంచనాలు: ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ నివేదికల ప్రకారం.. భవిష్యత్తులో జీ7 దేశాలు గరిష్టంగా కేవలం 1.1శాతం వృద్ధి రేటుకే పరిమితం కానుండగా బ్రిక్స్ దేశాలు 4శాతం కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోనున్నాయి.

భారత్‌తో సోదర బంధం

హోర్ముజ్ జలసంధిలో జరుగుతున్న భౌగోళిక-రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు ఇంధన పరంగా సహాయం అందించడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశీయంగా కొన్ని ఇంధన ఆంక్షలు విధించాల్సి వచ్చిన తరుణంలో రష్యా కంపెనీలు భారత్‌కు సహాయం అందించాయని గుర్తుచేశారు. భారత్-రష్యా మధ్య ఎప్పటికీ విశ్వాస ఆధారిత సోదర సంబంధాలు ఉంటాయని, ఆసియా మార్కెట్‌కు రష్యా నుండి సరఫరాలు నిరంతరం పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే రష్యాకు చెందిన రక్షణ, సాంకేతిక పరిష్కారాలను భారత్‌తో నిరంతరం పంచుకుంటూనే ఉంటామని పుతిన్ స్ఫష్టం చేశారు.

Follow Us