ఆ దేశ ప్రజలకూ మాస్కుల నుంచి విముక్తి… టీకా తీసుకున్న వారికి మాత్రమే..

| Edited By: Team Veegam

May 27, 2021 | 10:18 PM

Covid Mask Rules: కరోనాపై పోరాటంలో దక్షిణ కొరియా కీలక పురోగతి సాధించింది. క‌రోనా టీకా తీసుకున్న వారెవ్వ‌రూ బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాస్కు ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ దేశం ప్రకటించింది.

ఆ దేశ ప్రజలకూ మాస్కుల నుంచి విముక్తి... టీకా తీసుకున్న వారికి మాత్రమే..
Covid Mask
Follow us on

కరోనాపై పోరాటంలో దక్షిణ కొరియా కీలక పురోగతి సాధించింది. క‌రోనా టీకా తీసుకున్న వారెవ్వ‌రూ బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాస్కు ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ దేశం ప్రకటించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆ దేశంలో జోరుగా సాగుతోంది. సెప్టెంబ‌ర్ నాటికి దేశ ప్రజల్లో 70 శాతం మందికి క‌రోనా టీకా వేయాలని దక్షిణ కొరియా ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. కొందరు టీకాలు వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో టీకాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించేందుకు… మొద‌టి డోసు తీసుకున్న వారు జులై మాసం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కుటుంబ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు కూడా దక్షిణ కొరియా అనుమతించనుంది. జూన్ మాసం నుంచే తొలి టీకా వేసుకున్న వారు గుంపులుగా చేరేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  70 శాతం మందికి పైగా ప్ర‌జ‌లు క‌రోనా టీకా తీసుకున్న త‌ర్వాత సెప్టెంబర్ మాసం నుంచి కరోనా నియంత్రణ ఆంక్షలను పూర్తిగా సడలించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి కోన్ డియోక్ తెలిపారు.

5.2 కోట్ల మంది జనాభా కలిగిన దక్షిణ కొరియాలోని 4.4 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు నాలుగు కంపెనీలతో గత ఏడాది డిసెంబరులో ఆ దేశ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండు టీకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆ దేశం ఫిబ్రవరిమాసంలో ప్రారంభించింది. వచ్చే నవంబరు నాటికి హెర్డ్ ఇమ్యునిటీ సాధించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 19 లక్షల మంది (3.8శాతం దేశ జనాభా)కు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. దేశంలో శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేపడుతున్న గ్లోబల్ వ్యాక్సిన్ ప్రాజెక్టు ద్వారా మరో కోటి వ్యాక్సిన్లు సమకూర్చునేందుకు ఆ దేవం ప్రయత్నిస్తోంది.

అమెరికాలో…
మాస్కులకు సంబంధించి అమెరికన్లకు ఆ దేశ టాప్ హెల్త్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ఇక మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఐతే ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, అస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వ్యాక్సిన్ తీసుకోకపోయినా..2 డోసులు పూర్తి కాకపోయిన మాస్కు ధరించాల్సిందేనని స్పష్టంచేసింది. వ్యాక్సిన్ రెండో డోసు వేసుకున్న రెండు వారాల తర్వాత మాస్కు వాడడం మానేయోచ్చని ప్రకటించింది. ప్రయాణాలకు ముందు, తర్వాత కరోనా టెస్టులు అవసరం లేదని ప్రకటించింది. అలాగే ప్రయాణం తర్వాత క్వారంటైన్, ఐసోలేషన్ అవసరం లేదు. CDC ప్రకటనపై అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్ హర్షం వ్యక్తంచేశారు. అమెరికన్లకు వేగంగా వ్యాక్సిన్ వేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అమెరికా 114 రోజుల్లో 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసింది.

భారత్ లో…
భారత్‌లో వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ తప్పనిసరి. సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను తప్పక పాటించాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా స్పష్టంచేశారు. కరోనా కొత్త మ్యూటెంట్ల వ్యాప్తి, వ్యాక్సిన్ ప్రభావంపై అనుమానాలే దీనికి కారణంగా తెలుస్తోంది. కరోనా చాలా తెలివైనది..ఎప్పటికప్పుడు రూపాంతరం అవుతోంది..ఈ వైరస్ తో అప్రమత్తంగా ఉండాలని రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. కొత్త వేరియంట్ లు వస్తున్నందున రక్షణ విషయంలో శ్రద్ధ వహించడం ముఖ్యమన్నారు. మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తే ఎన్ని వేరియంట్ లు వచ్చినా ఏమీ చేయలేవన్నారు.

ఇవి కూడా చదవండి..