కొండప్రాంతాల్లో, మంచు కురిసే వేళలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వెళ్లారు. కానీ ఆ టూర్ వారిని కానరాని లోకాలకు తీసుకెళ్తుందని ఊహించలేదు పర్యాటకులు. చలికి తట్టుకోలేక, వాహనాల్లోనే ఇరుక్కుని 16 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. ఇస్లామాబాద్‌కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రీ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అందుకే శీతాకాలంలో మంచు అందాలను ఆస్వాదించేందుకు వేల సంఖ్యలో వస్తుంటారు పర్యాటకులు. అయితే, ఈ ప్రాంతంలో ఇటీవల ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోయాయి. మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలో కార్లలోనే ఇరుక్కుపోయారు పలువురు పర్యాటకులు. కార్లు మొత్తం మంచుతో నిండిపోయాయి కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో పర్యాటకుల శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి 16 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చనిపోయిన వారిలో ఇస్లామాబాద్‌కు చెందిన పోలీస్ అధికారి కూడా ఉన్నారు. మరో విషాదం ఏంటంటే, మృతిచెందిన 16 మందిలో 8 మంది ఆ పోలీస్ అధికారి బంధువులే. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికే వేల వాహనాలను మంచులోంచి బయటకు తీశామని. ఇంకా కొన్ని తీస్తున్నామని తెలిపారు స్థానిక మంత్రి షేక్ రషీద్ అహ్మద్. ఒక్కరాత్రిలోనే ముర్రీ ప్రాంతాన్ని 4 అడుగుల మేర మంచుదుప్పటి కప్పేసిందని చెప్పారు మంత్రి. ఈ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు అధికారులు. ఇంకా వాహనాల్లో ఇరుక్కున్న మరికొంతమందికి ఆహారం, దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.
Also Read: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్