ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను ‘అమరుడని’ తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరు జారి వ్యాఖ్యానించారని పాకిస్థాన్ సమాచార శాఖ ,మంత్రి ఫాద్ చౌదరి అన్నారు. బిన్ లాడెన్ ని తమ దేశం టెర్రరిస్టుగా, అల్ ఖైదాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తుందని ఆయన చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది తమ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో…అమెరికా దళాలు అబోదాబాద్ లో ఆపరేషన్ చేబట్టిన సందర్భంగా బిన్ లాడెన్ ని చంపి అతడిని ‘అమరుడిని’ ఎలా చేశాయో చూడండని వ్యాఖ్యానించారు. ‘లాడెన్ కో షాహిద్ కర్ దియా’ అని పేర్కొన్నారు. కాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్య తాలూకు వీడియో క్లిప్.. వైరల్ అయింది.దీన్ని అనేకమంది ఖండించారు. కరడు గట్టిన ఓ ఉగ్రవాదిని అమరుడంటారా అని పెద్ద సంఖ్యలో నెటిజనులతో సహా చాలామంది ఆయనను దుయ్యబట్టారు. దీనిపైనే ఫాద్ చౌదరి తమ ప్రధానిని వెనకేసుకొస్తూ.. ఆయన నోరు జారి అలా వ్యాఖ్యానించారన్నారు. మరో వైపు విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ కూడా ఈ వ్యవహారంలో ఓ వర్గం మీడియాదే తప్పని ఆరోపించారు. మీడియా ఇమ్రాన్ వ్యాఖ్యలను వక్రీకరించిందన్నారు. ఒక వర్గం మీడియా దీన్ని గోరంతలు కొండంతలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
లాడెన్ అమరుడన్న వ్యాఖ్యలపై మీ ప్రతిస్పందన ఏమిటన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. 2001 లో నవంబరు 11 న అమెరికాలో జరిగిన దాడుల వెనుక లాడెన్ సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే 2011 లో అమెరికా నేవీ దళాలు అతడ్ని కాల్చి చంపాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రధాని మోదీ సూచనతో వ్యాక్సిన్ తీసుకున్న మధ్యప్రదేశ్ వాసి.. ‘మన్ కీ బాత్’ లో ‘ప్రస్తావన’!