Singapore: భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్.. ఒక కేజీ గంజాయి తరలించినందుకు..

|

Apr 26, 2023 | 12:50 PM

గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి సింగపూర్‌ మరణ శిక్షను అమలు చేసింది. కేజీ గంజాయి అక్రమంగా రవాణా చేశాడన్న ఆరోపణలతో భారత సంతతి వ్యక్తికి సింగపూర్‌ బుధవారం ఉరిశిక్ష అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరణశిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా జరిగిన అన్ని ప్రయత్నాలు కూడా ఫలించక పోవడంతో అధికారులు అతన్ని బుధవారం ఉరితీశారు. ఈ శిక్షపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్‌ అతడికి శిక్ష విధించడంపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది.

Singapore: భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్.. ఒక కేజీ గంజాయి తరలించినందుకు..
Tangaraju Suppiah
Follow us on

గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి సింగపూర్‌ మరణ శిక్షను అమలు చేసింది. కేజీ గంజాయి అక్రమంగా రవాణా చేశాడన్న ఆరోపణలతో భారత సంతతి వ్యక్తికి సింగపూర్‌ బుధవారం ఉరిశిక్ష అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరణశిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా జరిగిన అన్ని ప్రయత్నాలు కూడా ఫలించక పోవడంతో అధికారులు అతన్ని బుధవారం ఉరితీశారు. ఈ శిక్షపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్‌ అతడికి శిక్ష విధించడంపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది.

భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య (46) గంజాయి అక్రమ రవాణా కేసులో 2014లో సింగపూర్ లో అరెస్టయిన విషయం తెలిసిందే. ఒక కిలో గంజాయి ని సింగపూర్‌కు అక్రమంగా తరలిస్తున్నాడన్న అభియోగాలను సింగపూర్ పోలీసులు అతనిపై మోపారు. ఈ కేసును విచారించిన సింగపూర్ కోర్టు.. 2018 అక్టోబర్‌ 9న మరణశిక్ష విధించింది. మరో ఇద్దరితో కలిసి తంగరాజు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లు నిర్ధారించిన ధర్మాసనం.. అతడికి ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా తంగరాజు కేసు విచారణ జరగలేదని, ఓ అమాయకుడిని సింగపూర్ చంపబోతోందంటూ అంతర్జాతీయ సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ శిక్షపై బ్రిటన్‌ బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. హక్కులను కాలరాసి అమాయక వ్యక్తిని చంపుతోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరోపియన్ యూనియన్‌, ఆస్ట్రేలియా సైతం తంగరాజుకు మద్దతుగా నిలిచాయి.

అయితే, రిచర్డ్ బ్రాన్సన్‌ ప్రకటనపై స్పందించిన సింగపూర్.. ఆయన వ్యాఖ్యలు సింగపూర్‌ న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరిచేలా ఉన్నాయంటూ మండిపడింది. మాదకద్రవ్యాలకు సంబంధించి స్థానిక చట్టాల ప్రకారమే ఉరిశిక్ష అమలు చేస్తున్నామని సింగపూర్‌ ప్రభుత్వం వెల్లడించింది. కాగా, డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి. తంగరాజు సుప్పయ్యను ఉరితీయడంపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం సహా.. పలు దేశాలు, మానవహక్కుల సంఘాలు సింగపూర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి.

ఇవి కూడా చదవండి

మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం స్పందిస్తూ.. సింగపూర్ తీరు గర్హనీయం అంటూ మండిపడింది. “నేరాలను అరికడుతుందనే అపోహ కారణంగా.. మరణశిక్షను ఇప్పటికీ తక్కువ సంఖ్యలో దేశాల్లో ఉపయోగిస్తున్నారు..” అని OHCHR మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తంగరాజు కుటుంబీకులు క్షమాపణ కోసం వేడుకున్నారు.. అదే సమయంలో పునర్విచారణకు కూడా ఒత్తిడి తెచ్చారని గుర్తుచేసింది. కాగా, తాజా ఉరిశిక్ష అమలుతో.. గత సంవత్సరం నుంచి 12మందిని ఉరితీశారు. రెండేళ్లకు పైగా విరామం తర్వాత సింగపూర్ మార్చి 2022లో మరణశిక్షలను తిరిగి ప్రారంభించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..