RUSSIA-UKRAINE: కొనసాగుతూనే వున్న యుద్ధభయం.. రష్యా మాటలు వేరు..చేతలు వేరు..ఏదీ దారి?

Russia Ukraine Conflict: మూడు, నాలుగు గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా సేనలు ఆక్రమిస్తాయని కూడా కొందరు అంచనా వేశారు. అమెరికా అయితే ఫిబ్రవరి 16వ తేదీనే రష్యా దురాక్రమణ మొదలవుతుందని పలు మార్లు ప్రకటించింది. సాక్షాత్తు యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ మేరకు కెమెరాల ముందుకొచ్చి మరీ ప్రకటన చేశారు.

RUSSIA-UKRAINE: కొనసాగుతూనే వున్న యుద్ధభయం.. రష్యా మాటలు వేరు..చేతలు వేరు..ఏదీ దారి?
Russia-Ukraine crisis
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 17, 2022 | 8:10 PM

RUSSIA-UKRAINE AT WAR ZONE SHELLING ON ESCALATION CONTINUES: యావత్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేసిన ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఉద్రిక్తత తాత్కాలికంగా సడలడం శాంతి కాముకులకు ఆనందాన్నిచ్చింది. అయితే.. నిజంగానే ఉద్రిక్తత సడలిందా ? లేక రష్యా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించిందా అన్న సందేహాలు కొనసాగుతున్నాయి. ఈ సందేహాలకు ఊతమిచ్చేలా కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా(America) చేసిన హెచ్చరిక నిజమే అయితే ఫిబ్రవరి 16వ తేదీన రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడికి శ్రీకారం చుట్టేవి. అదే జరిగితే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు యాభై వేల మంది దుర్మరణం పాలయ్యేవారని ఓ అంచనా వినిపించింది. మూడు, నాలుగు గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా సేనలు ఆక్రమిస్తాయని కూడా కొందరు అంచనా వేశారు. అమెరికా అయితే ఫిబ్రవరి 16వ తేదీనే రష్యా దురాక్రమణ మొదలవుతుందని పలు మార్లు ప్రకటించింది. సాక్షాత్తు యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్(Joe Biden) ఈ మేరకు కెమెరాల ముందుకొచ్చి మరీ ప్రకటన చేశారు. అమెరికా ప్రకటన నిజమే అన్నట్లుగా రష్యా సేనలు ఉక్రెయిన్‌ను మూడు వైపులా ముంచెత్తేలా మోహరించాయి. ఆ దేశానికి తూర్పు ప్రాంతంలోని పశ్చిమ రష్యాలో ఏకంగా లక్షకు పైగా రష్యన్ దళాలను మోహరించారు. మిలిటరీ డ్రిల్స్ నిర్వహించారు. మిస్సైళ్ళను నిర్దిష్ట లక్ష్యం మేరకు ప్రయోగించి పరీక్షించారు. 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా మిస్సైళ్ళను విజయంవంతంగా ప్రయోగించి చూసుకున్నారు. అటు ఉత్తరాన వున్న బెలారస్‌లో ఆ దేశ సైన్యంతో కలిసి రష్యన్ దళాలు మిలిటరీ డ్రిల్స్ జరిపాయి. నల్లసముద్రంలోను రష్యన్ నేవీ యుద్ద విన్యాసాలను నిర్వహించింది. అమెరికా చేసిన ప్రకటన ప్రకారం లక్షా 50 వేల మంది సైనికులు ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి సిద్దమయ్యారు. అత్యంత ఆధునిక యుద్ద విమానాలను కూడా ఉక్రెయిన్ బోర్డర్‌కు రష్యా తరలించింది. ఈ చర్యలన్నీ దురాక్రమణ కోసమేనని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ప్రకటించింది. ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు అధ్యక్షుడు జో బైడెన్ కూడా రష్యా దాడులకు దిగుతుందన్నారు. ఈ క్రమంలో యావత్ ప్రపంచం ఉక్రెయిన్ వైపు చూసింది. రష్యా దాడులకు దిగితే ఉక్రెయిన్‌కు అండగా వున్న నాటో దేశాలు మరీ ముఖ్యంగా అమెరికా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపించింది. దానికి తగినట్లుగానే అమెరికా సారథ్యంలోని నాటో దళాలు ఉక్రెయిన్‌ వైపు సాగాయి. రష్యా ఓ వైపు, నాటో సేనలు మరోవైపు నిలిచి.. పరస్పరం యుద్దానికి దిగితే అది మూడో ప్రపంచ యుద్దం(The Third World War)వైపు దారి తీస్తుందని పలువురు అంచనా వేశారు.

నిజానికి రష్యా ఏనాడు తాము ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగుతామని, ఆ దేశాన్ని ఆక్రమిస్తామని ప్రకటించలేదు. కానీ ఆ దేశ సైన్యం ఉక్రెయిన్‌కు మూడు వైపులా మోహరించడంతో అమెరికా ఆ మేరకు అనుమానించింది. ఉక్రెయిన్ దేశం గనక నాటో కూటమిలో చేరితే అది రష్యాకు ముప్పుగా మారే అవకాశం వుందన్నది ఆ దేశస్థుల వాదన. అందుకే గత 25 ఏళ్ళుగా ఉక్రెయిన్ దేశ ప్రయత్నాలను అడ్డుకుంటూ వస్తోంది. ఓ దశలో జర్మనీ, ఫ్రాన్స్ గనక అడ్డుకోకపోయి వుంటే ఈపాటికి ఉక్రెయిన్ నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ)లో భాగస్వామ్యం పొంది వుండేది. రష్యాతో తమకున్న వాణిజ్య సంబంధాల దృష్ట్యా జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు గతంలో నాటో కూటమిలో చేరాలన్న ఉక్రెయిన్ ప్రయత్నాలను అడ్డుకున్నాయి. ఇది జరిగి దశాబ్ధ కాలం గడిచి పోయింది. ఆ తర్వాత నాటో కూటమిలోని చాలా దేశాలు..ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఆ దేశానికి నాటో కూటమిలో భాగస్వామ్యం ఎందుకివ్వకూడదు అనడం మొదలుపెట్టాయి. రష్యా వద్దన్నా నాటో కూటమి ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకుండా వుండలేమని చెప్పేశాయి. ఈక్రమంలోనే రష్యా ఉక్రెయిన్‌ ఆక్రమణ వ్యూహాలను రచించిందని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్ పుతిన్ 2000లో తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పట్నించి గతంలో యుఎస్ఎస్ఆర్ (యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్)లో వుండి.. 1991 డిసెంబర్ ఆ యూనియన్ ముక్కలయ్యాక స్వతంత్ర దేశాలుగా మారిన దేశాలపై ఆధిపత్యం చెలాయించేలా వ్యూహాలను అమలు పరిచారు. పుతిన్ వ్యూహాలకు అనుగుణంగానే చాలా దేశాలు రష్యాకు దాసోహమన్నాయి. ముఖ్యంగా భారత్, అఫ్గానిస్తాన్ దేశాలకు ఉత్తరాన వున్న దేశాలన్నీ రష్యాకు అనుకూలంగా మారాయి.

కానీ ఉక్రెయిన్ ప్రస్థానం భిన్నమైనది. పోలండ్‌కు ఆనుకుని వున్న ఈ దేశం యూరోపియన్ యూనియన్‌లో చేరింది. క్రమంగా అమెరికాకు సన్నిహితమైంది. అమెరికా అడుగులకు మడుగులు ఒత్తే బ్రిటన్‌కు చేరువైంది. మధ్యలో వచ్చిన ఒకరిద్దరు ఉక్రెయిన్ పాలకులు మినహా అందరూ ఉక్రెయిన్ సర్వ సత్తాక స్వతంత్ర దేశంగా వుండాలని, అందుకు అమెరికా అండా.. నాటో వెన్నుదన్నుగా వుండాలని భావించారు. ఇది రష్యన్ పాలకులకు మరీ ముఖ్యంగా పుతిన్‌కు ఆగ్రహం తెప్పించింది. 2014లో రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లో అంతర్భాగమైన క్రిమియాను ఆక్రమించాయి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇపుడు ఉక్రెయిన్‌పై దాడికి క్రిమియా బేస్ నుంచే రష్యా పావులు కదిపింది. 2021 ఏప్రిల్‌లో రష్యన్ బలగాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి చేరుకోవడం మొదలైంది. వెంటనే స్పందించిన పలు దేశాలు రష్యా ఆక్రమణ వ్యూహాన్ని అంచనా వేసి.. ఉక్రెయిన్‌ను హెచ్చరించాయి. అటు రష్యాపై ఒత్తిడి పెంచాయి. దాంతో కాస్త వెనక్కి తగ్గిన పుతిన్.. త్వరలోనే ఆ బలగాలను వెనక్కి రప్పిస్తామని వెల్లడించారు. కానీ ఆ పని చేయలేదు. క్రమంగా ఉక్రెయిన్ బోర్డర్‌కు రష్యన్ బలగాల తరలింపు పెరిగింది. 2021 డిసెంబర్ నాటికి 50వేల మంది రష్యాన్ సైనికులు పశ్చిమ రష్యా ప్రాంతానికి చేరారు. ఆ తర్వాత వ్యూహానికి మరింత పదును పెట్టిన రష్యా.. ఉక్రెయిన్ ఉత్తర దిశగా వున్న బెలారస్‌తో కలిసి మిలిటరీ డ్రిల్స్ ప్లాన్ చేసింది. 30 వేల మంది రష్యన్ సైనికులను బెలారస్‌కు తరలించారు. అక్కడ ఇరు దేశాలు మిలిటరీ డ్రిల్స్ కొనసాగించాయి. ఇంకోవైపు ఉక్రెయిన్‌కు దక్షిణంలో వున్న క్రిమియా ఏరియాలోను రష్యన్ బలగాలు చేరాయి. నల్లసముద్రంలో నేవీ విన్యాసాలు జోరందుకున్నాయి.

రష్యన్ వ్యూహాన్ని పసిగట్టిన అమెరికా రంగంలోకి దిగింది. ఉక్రెయిన్‌ను అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. యుద్దానికి దిగవద్దని రష్యాను వార్న్ చేసింది. యుద్దానికి దిగితే తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించాల్సి వుంటుందని బైడెన్ పుతిన్‌కు తేల్చి చెప్పారు. నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు బలగాలు, ఆయుధాలు, యుద్ద నౌకలను ఉక్రెయిన్ పంపడం మొదలుపెట్టింది అమెరికా. ఈ చర్యలు రష్యాను మరింత ఉడికించాయి. ఫలితంగా ఏకంగా లక్షన్నర మంది సైనికులకు ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యా పంపింది. మిస్సైళ్ళను ప్రయోగించే ట్యాంకర్లను పెద్ద ఎత్తున ఉక్రెయిన్ సరిహద్దుకు తరలించింది. కేవలం మూడు గంటల్లో ఆ దేశ రాజధాని కీవ్ నగరాన్ని ఆక్రమించే యుద్ద వ్యూహాన్ని రచించింది. ఈ వ్యూహాన్ని గుర్తించిన అమెరికన్ ఇంటెలిజెన్స్ విభాగం.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముహూర్తం కూడా ఖరారైందని వెల్లడించింది. ఫిబ్రవరి 16వ తేదీన రష్యా దాడి మొదలువుతందని హెచ్చరించింది. దాన్ని తిప్పి కొట్టేందుకు ఉక్రెయిన్ సిద్దంగా వుండాలన్నది. ఆ దేశానికి అండగా నాటో దళాలను పంపారు. ఇవన్నీ గమనించి ప్రపంచ దేశాలు ఉత్కంఠకు గురయ్యాయి. రష్యా దాడి మొదలైతే.. అది మూడో ప్రపంచ యుద్దం వైపు మళ్ళడం ఖాయమన్నాయి. కానీ ఫిబ్రవరి 16 తేదీన రష్యా దాడికి దిగలేదు. సరికదా.. తమ బలగాలను ఉక్రెయిన్ బోర్డర్ నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది రష్యన్ రక్షణ శాఖ. ఈ ప్రకటనను ఉక్రెయిన్ సహా పలు దేశాలు నమ్మలేదు. దాంతో సాక్ష్యాలంటూ కొన్ని వీడియో క్లిప్పింగులను రిలీజ్ చేసింది. అయినా కూడ గత అనుభవాల దృష్ట్యా రష్యా ప్రకటనను ఎవరు నమ్మలేదు. మరీ ముఖ్యంగా అమెరికా అయితే.. రష్యా ఏ క్షణమైనా దాడికి దిగవచ్చని హెచ్చరిస్తూనే వుంది. అయితే.. రష్యా నిర్ణయం వ్యూహాత్మకమా..లేక నిజంగానే చర్చలపై విశ్వాసంతో పుతిన్ వెనక్కి తగ్గారా అన్నదిపుడు చర్చనీయాంశంగా మారింది.

బలగాలను వెనక్కి రప్పిస్తున్న పుతిన్ ప్రకటన చేసిన తర్వాత ఉక్రెయిన్ దేశానికి చెందిన పలు సైనిక విభాగాలు, రెండు బ్యాంకుల సహా మొత్తం పది సంస్థల వెబ్ సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. హ్యాకింగ్‌కు పెట్టింది పేరైన రష్యానే తమ దేశంలోని పలు సంస్థలపై హ్యాకింగ్ పాల్పడుతోందని, సైబర్ దాడులకు తెరలేపిందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లోదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా దాడుల భయం ఇంకా తొలగిపోలేదని, ఆ దేశ బలగాల తరలింపు వాస్తవంగా ప్రారంభం కానే లేదని ఆయన్నారు. దాంతో అసలేం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. తిరిగి ఉన్నట్లుండి రష్యా దురాక్రమణ మొదలుపెడుతుందా అన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. అమెరికా హెచ్చరికలు కూడా ఈరకంగానే వున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన రష్యా దాడులు ప్రారంభిస్తుందన్న సమాచారం మేరకు రంగంలోకి దిగిన జర్మనీ ఛాన్స్‌లర్ ఓలాఫ్ షోల్జ్… హుటాహుటిన రష్యాకు వెళ్ళారు. ఫిబ్రవరి 15వ తేదీన ఆయన పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ క్రమంలోనే శరవేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జర్మనీతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన రష్యా.. షోల్జ్ ఒత్తిడితోనే వెనక్కి తగ్గారన్న అంచనాలు వినిపించాయి. అదేక్రమంలో యుద్దానికి వ్యతిరేకమంటూ చర్చలకే ప్రాధాన్యత అంటూ పుతిన్ చేసిన ప్రకటన శాంతి కాముకుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

కానీ అమెరికా ఇప్పటికీ రష్యా ఏ క్షణమైనా దాడులు ప్రారంభించవచ్చని చెబుతుండడంతో ఇంకా ఏదో మూల అనుమానించాల్సిన పరిస్థితి తలెత్తింది. నిజానికి రష్యా ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. గత రెండేళ్ళుగా ప్రపంచంపై పగబట్టిన కరోనా రష్యాను కూడా ఆర్థికంగా కుదేలు చేసింది. ఈ క్రమంలో యుద్దానికి దిగితే ఉక్రెయిన్‌తోపాటు రష్యా కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే ప్రమాదమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో రష్యా అసలు యుద్దం చేయాలనుకుందా ? లేక కేవలం తాము యుద్దానికి సిద్దపడితే ఎవరెవరు ఎలా స్పందిస్తారో పరీక్షించుకుందామని అనుకుందా అన్నది కూడా ఓ చర్చనీయాంశంగా మారింది. అయితే.. బలగాల ఉపసంహరణకు సాక్ష్యంగా విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్స్ రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ విడుదల చేసింది. వాటిని పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదు. మరోవైపు బెలారస్‌లో మిలిటరీ డ్రిల్స్ ఇంకా కొనసాగుతూనే వున్నాయి. బాలిస్టిక్ మిస్సైళ్ళ ప్రయోగాలు కంటిన్యూ అవుతూనే వున్నాయి. దక్షిణాన నల్ల సముద్రంలో రష్యన్ నేవీ డ్రిల్స్ కూడా కొనసాగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రకటనను ఏ మేరకు విశ్వసించగలమనేది ప్రశ్నార్థకమే. ఇంకోవైపు ఫిబ్రవరి 17వ తేదీన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. రష్యాకు మద్దతుగా వున్న తీవ్రవాదులకు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య ఈ కాల్పులు జరిగాయి. అయితే కాల్పులకు ఎవరు పురిగొల్పారు అనే అంశంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. డైరెక్టుగా దాడికి దిగకుండా అంతర్గతంగా తమ అనుకూలవాదులను ఉక్రెయిన్‌పై రష్యా రెచ్చగొడుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ తిరుగుబాటు అంతర్యుద్ధంగా మారితే రష్యా నేరుగా రంగంలోకి దిగే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. సో.. నాటో కూటమిలో రష్యాకు అనుకూలంగా వుంటాయని పేరున్న జర్మనీ, ఫ్రాన్స్ దేశాల చొరవతోనే చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. చర్చల్లో ప్రధానాంశం ఉక్రెయిన్‌కు నాటో కూటమిలో సభ్యత్వం ఇవ్వక కూడదన్నదే కావడంతో చర్చలు ప్రారంభమైనా పరిస్థితిలో ఏ మార్పు వుండదన్న అభిప్రాయాలు కూడా విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చర్చల ప్రక్రియ అంటూ ప్రారంభమైతే.. అది ప్రస్తుతానికి యుద్దాన్ని వాయిదా వేసే అవకాశం వుంది. ఆ దిశగా మధ్యస్థ దేశాలు చొరవ చూపడమొక్కటే ప్రస్తుతానికి మార్గంగా కనిపిస్తోంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..