ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు కీలక ప్రాంతాలపై క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది రష్యా సైన్యం. సైనిక స్థావరాలే కాదు..జనావాసాలనూ విడిచిపెట్టడం లేదు. కీవ్, మరియుపోల్‌లో ఎటు చూసినా భయానక దృశ్యాలే. మరియుపోల్‌లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోయింది. తాగేందుకు నీరు, తినేందుకు తిండి లేక జనం హాహాకారాలు పెడుతున్నారు. ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బంకర్లలో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయని ఆగ్రహంతో రగిలిపోతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్‌కు సాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన పుతిన్..ఇప్పుడు దాడులు ముమ్మరం చేశారు. పోలండ్‌కు సమీపంలోని లివివ్ నగరంపై భీకర దాడులు చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న నాటో కూటమి దేశాలకు హెచ్చరికలు పంపేందుకే రష్యా ఈ దాడి జరిపినట్లు భావిస్తున్నారు.
పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్ సమీపంలో ఉన్న సైనిక శిక్షణా కేంద్రంపై అటాక్ చేశారు. ఈ దాడుల్లో 35మంది మృతి చెందగా..134మందికి గాయాలయ్యాయి. యారోవివ్ ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్, సెక్యూరిటీ సెంటర్‌గా పిలిచే ఇక్కడ..అమెరికా సైనికాధికారులు ఉక్రెయిన్ సైన్యానికి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈ మిలిటరీ రేంజ్‌లో నాటో దేశాల సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి. ఐతే అక్కడ మాటు వేసిన 180మంది విదేశీ కిరాయి సైనికులను హతమార్చామని..భారీగా ఫారిన్ వెపన్స్‌ను ధ్వసం చేశామని ప్రకటించింది రష్యా.
మరోవైపు ఉక్రెయిన్‌పై రసాయన దాడులకు రష్యా ప్లాన్ చేస్తోందని హెచ్చరించింది నాటో. 19రోజులైనా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోలేకపోవడంతో దాడులు మరింత ముమ్మరం చేస్తోందని..కెమికల్ అటాక్స్‌కు ప్లాన్ చేస్తోందని వార్నింగ్ ఇచ్చింది. అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ సేనకు హెచ్చరికలు జారీ చేసింది. రష్యా చర్యలపై నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్లెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఉక్రెయిన్ గగనతలపై నో ఫ్లైజోన్ ప్రకటించకుంటే రష్యా రాకెట్లు నాటోలోకి దూసుకొస్తాయంటున్నారు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో రష్యా బాంబుల వర్షం కురిపించడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై నో ఫ్లైజోన్ ప్రకటించాలని నాటోకు మరోమారు విజ్ఞప్తి చేశారు జెలెన్‌స్కీ. లేదంటే రష్యా రాకెట్లు నాటో భూభాంగపైనా పడతాయన్నారు. రష్యాను నిలవరించకుంటే.. పశ్చిమ దేశాలతో యుద్ధానికి దిగుతుందని, నార్డ్ స్ట్రీమ్2ను ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి: Telangana: మంత్రి కావాలన్న ఆయన కల కలేనా..? సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో శాసన మండలి చైర్మన్‌గా మళ్లీ..