Russia Ukraine Highlights: నేను దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు. రష్యాతో తేల్చుకుంటాం: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

| Edited By: Subhash Goud

Feb 26, 2022 | 9:56 PM

Russia Ukraine Highlights: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఆ దేశ రాజధాని కీవ్‌పై అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించింది. మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి రష్యన్‌ దళాలు...

Russia Ukraine Highlights: నేను దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు. రష్యాతో తేల్చుకుంటాం: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు
Russia Ukraine War

Russia Ukraine Highlights: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఆ దేశ రాజధాని కీవ్‌పై అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించింది. మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి రష్యన్‌ దళాలు. దీంతో సామాన్య పౌరులు బిక్కచచ్చిపోతున్నారు. వారికి రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా పోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దేశం విడిచి వెళ్లిపోతున్నారు. అటు.. ఉక్రెయిన్‌లో మరో రెండు నగరాలను రష్యన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సుమీ, కోనోటాప్‌ నగరాలను రష్యన్ ఆర్మీ ఆక్రమించేసింది. ఎటొచ్చీ కీవ్‌పైనే గురి పెట్టిన పుతిన్… వీలైనంత త్వరగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని తపిస్తున్నారు. వాళ్లకు అక్కడ గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది.

ఉక్రెయిన్‌లో తోలుబొమ్మ పాలన అణిచివేతకే తాము సైనిక చర్యకు దిగినట్టు రష్యా సమర్థించుకుంది. ఆ దేశాన్ని తాము ఆక్రమించుకోబోమని.. ఆ భూభాగం తమకు అక్కర్లేదని పుతిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తమ ఉద్దేశంగా చెప్పుకొచ్చారు. మీ ప్రభుత్వాన్ని కూల్చేయండని ఉక్రెయిన్ ఆర్మీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు.

రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో గత రెండు రోజులుగా యుద్ధం నిరంతరం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణులు 137 మందిని చంపగా, ఉక్రెయిన్ కూడా 800 మంది రష్యన్ సైనికులను చంపినట్లు పేర్కొంది. నిజానికి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చాలా పెరిగాయి. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రారంభించింది. గత రెండు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా నిరంతరం క్షిపణులతో దాడులు చేస్తోంది.

ఉక్రెయిన్ ప్రస్తుతం అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటోంది. తమ కుటుంబాన్ని, సన్నిహితుల ప్రాణాలను కాపాడిన తర్వాత పారిపోవాలనుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇంతలో, దేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి ప్రభుత్వం 18-60 సంవత్సరాల వయస్సు గల పురుషులందరినీ దేశం విడిచి వెళ్లకుండా నిషేధించింది.

అయితే, వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, రష్యా మరియు ఉక్రేనియన్ ప్రభుత్వాలు శుక్రవారం చర్చలకు బహిరంగతను సూచించాయి. మరోవైపు, కీవ్‌లోని అధికారులు రాజధానిని రక్షించడంలో సహాయం చేయాలని, దశాబ్దాలుగా లోతైన యూరోపియన్ భద్రతా సంక్షోభం సమయంలో రష్యా దళాలు ముందుకు సాగకుండా నిరోధించాలని పౌరులను కోరారు. చర్చల సమయం , ప్రదేశం గురించి చర్చించడానికి ఉక్రెయిన్, రష్యా పర్యటన కొనసాగుతోంది.

ఇదిలావుంటే, ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. “దాడి ప్రారంభమైనప్పటి నుండి దౌత్యానికి మొదటి మెరుపు ఆశాజనకంగా ఉంది.” “ఉక్రెయిన్ కాల్పుల విరమణ, శాంతి గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉంది” అని సెర్గీ నైకిఫోరోవ్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. ఉక్రెయిన్ – రష్యా చర్చల కోసం స్థలం, సమయాన్ని చర్చిస్తున్నాయని ప్రతినిధి తరువాత చెప్పారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Feb 2022 09:33 PM (IST)

    రేపు ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు మరి కొంత మంది విద్యార్థులు

    భారత్‌కు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి ముంబైకి ఎయిరిండియా విమానంలో ఈ రోజు రాత్రి చేరుకున్నారు. ఈ విమానంలో 219 మంది విద్యార్థులు ఉండగా, రేపు రెండో విమానం ఢిల్లీకి చేరుకోనుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. విద్యార్థులందరినీ స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.

  • 26 Feb 2022 08:57 PM (IST)

    భారతీయులకు స్వాగతం పలికిన మంత్రి పీయూష్‌ గోయల్‌

    ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు చేరుకున్ విద్యార్థులకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ముంబై విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వెల్‌కమ్‌ బ్యాక్‌ టు మదర్‌ల్యాండ్‌ అంటూ ట్విట్‌ చేశారు మంత్రి. భారతీయుల్లో చిరునవ్వు చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

     

  • 26 Feb 2022 08:54 PM (IST)

    ఉక్రెయిన్‌కు అమెరికా 350 మిలియన్‌ డాలర్ల సాయం

    ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీగా సాయం ప్రకటించింది. ఆ దేశానికి సైనిక సాయంగా 350 మిలియన్‌ డాలర్లు అందిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

     

  • 26 Feb 2022 08:19 PM (IST)

    తొలి ఎయిరిండియా విమానంలో 219 మంది విద్యార్థులు

    ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు వచ్చిన విమానంలో 2019 మంది విద్యార్థులు. ఇందులో 8 మందికి ఏపీకి చెందిన వారు ఉన్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం.

  • 26 Feb 2022 08:05 PM (IST)

    ఉక్రెయిన్ నుంచి ముంబైకి చేరుకున్న తొలి విమానం

    ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్థులతో బయలుదేరిని తొలి ఎయిరిండియా విమానం ముంబైకి చేరుకుంది.

  • 26 Feb 2022 07:36 PM (IST)

    కీవ్‌ మా ఆధీనంలోనే ఉంది- జెలెన్‌స్కీ

    ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన రష్యా బలగాలను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేస్తున్న దురక్రమణను ఆపేలా రష్యన్లు ఒత్తిడి తేవాలన్నారు.

  • 26 Feb 2022 06:42 PM (IST)

    ప్రధాని మోడీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఫోన్‌..

    ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్‌ చేశారు. సుమారు లక్ష మంది రష్యా బలగాలు తమ దేశంలోకి ప్రవేశించారని, తమ నివాస ప్రాంతాలపై కాల్పులు జరుపుతున్నారని మోడీతో తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ దేశానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు. అందరి మద్దతు ఉంటే రష్యా దురక్రమణను అపగలుగుతామని అన్నారు.

     

  • 26 Feb 2022 06:05 PM (IST)

    ఉక్రెయిన్‌ నుంచి హంగరీకి చేరుకున్న భారత విద్యార్థులు

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులు జహోనీ క్రాసింగ్‌ వద్ద సరిహద్దులు దాటుకుని హంగరీలోకి ప్రవేశించారని హంగరీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వీరంతా ఈ రోజు ఎయిరిండియా విమానంలో భారత్‌కు బయలుదేరారని తెలిపింది.

     

  • 26 Feb 2022 06:02 PM (IST)

    కీవ్‌ కేంద్ర ప్రాంతానికి 30 కి.మీ దూరంలో రష్యా బలగాలు: యూకే

    ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ కేంద్ర ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు వెళ్తున్నాయని యూకే రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రష్యా సైన్యాన్ని దేశ వ్యాప్తంగా ఉక్రెయిన్‌ సైన్యం గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయని తెలిపింది.

  • 26 Feb 2022 05:58 PM (IST)

    ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు ఫోన్‌

    ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కారణంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి పలు దేశాల అధ్యక్షుడు ఫోన్లు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్‌, గ్రీస్‌ ప్రధాని కిరియకొస్‌ మిట్సోటకిస్‌ తనతో మాట్లాడినట్లు జెలెన్‌స్కీ తెలిపారు.

     

  • 26 Feb 2022 05:42 PM (IST)

    ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల ఇక్కట్లు

    ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. జఫ్రోజియా సమీప ప్రాంతాల్లో రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. రొమేనియా వెళ్లేందుకు పరిస్థితులు అనువుగా లేవు.

  • 26 Feb 2022 04:57 PM (IST)

    ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పరారయ్యాడంటూ రష్యా మీడియా కథనాలు

    ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పరారయ్యాడంటూ రష్యా మీడియా కథనాలు వెలువడ్డాయి. తాను కీవ్‌లోనే ఉన్నానంటూ జెలెన్‌స్కీ సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. జెలెన్‌స్కీ కీవ్‌ వదిలి వెళ్లాడంటూ రష్యా మీడియా వెళ్లడిస్తుండగా, ఈ మేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు స్పందించారు.

  • 26 Feb 2022 04:48 PM (IST)

    మేం లొంగిపోం.. పోరాడతాం : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

    యుద్ధం కారణంగా మేం లొంగిపోమని, పోరాడతామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. . కీవ్‌పై పట్టు ఇంకా కోల్పోలేదని అన్నారు. ఉక్రెయిన్‌లో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెన్‌ నిలిచిపోయింది.

  • 26 Feb 2022 04:45 PM (IST)

    మెల్టోపోల్‌ నగరాన్ని కైవసం చేసుకున్న రష్యా

    ఉక్రెయిన్‌లోని మెల్టోపోల్‌ నగరాన్ని కైవసం చేసుకున్నట్లు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అత్యంత ఎత్తైన భవనంపై మిసైల్‌ దాడి చేసింది.

  • 26 Feb 2022 04:42 PM (IST)

    కార్కీన్‌ నగరంలో 100 రష్యా ట్యాంకర్లను దెబ్బతీశాం: ఉక్రెయిన్‌

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అయితే కార్కీన్‌ నగరంలో 100 రష్యా ట్యాంకర్లను దెబ్బతీశామని ఉక్రెయిన్‌ తెలిపింది.

  • 26 Feb 2022 04:17 PM (IST)

    యుద్ధం ఆగితేనే శాంతి నెలకొంటుంది- ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ఆగితేనే శాంతి నెలకొంటుందని అన్నారు. ఎలాగైనా యుద్ధం ఆపాల్సిందేనని అన్నారు.

  • 26 Feb 2022 04:14 PM (IST)

    కీవ్‌పై పట్టు ఇంకా కోల్పోలేదు- ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడో రోజు కొనసాగిస్తోంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సంక్షోభంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కీలక వ్యా్ఖ్యలు చేశారు. కీవ్‌పై పట్టు ఇంకా కోల్పోలేదని అన్నారు.

  • 26 Feb 2022 04:11 PM (IST)

    పోరాడేందుకు ఎవరొచ్చినా ఆయుధాలిస్తాం.. జెలెన్‌స్కీ

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రష్యాకు చెందిన బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. పోరాడేందుకు ఎవరొచ్చినా ఆయుధాలు ఇస్తామని అన్నారు.

  • 26 Feb 2022 03:46 PM (IST)

    ఉక్రెయిన్‌పై భారీ దాడికి రష్యా ప్రయత్నం

    ఉక్రెయిన్‌పై భారీ దాడికి రష్యా ప్రయత్నాలు చేస్తోంది. మరో 20 వేల మంది గెరిల్లా ఆర్మీని పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది రష్యా

  • 26 Feb 2022 03:04 PM (IST)

    భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు ప్రారంభం

    ఉక్రెయిన్‌ నుంచి భారతీయ పౌరులు, విద్యార్థులను భారత్‌కు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి ఎయిర్‌ ఇండియా విమానం బయలుదేరింది. విమానంలో మొత్తం 219 మంది భారతీయులు ఉన్నారు. ఈ రోజు రాత్రి 8.45 గంటలకు ముంబైకి చేరుకోనుంది ఈ విమానం.

  • 26 Feb 2022 03:03 PM (IST)

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు విదేశాంగ శాఖ సూచన

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు విదేశాంగ శాఖ సూచనలు చేసింది. విదేశాంగ సమన్వయం లేకుండా సరిహద్దులకు రావొద్దని సూచించింది.
    రష్యా సైన్యాన్ని ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌

  • 26 Feb 2022 02:58 PM (IST)

    రష్యా సైన్యాన్ని ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులు వరుసగా మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ దాడులలో రష్యా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఉక్రెయిన్‌ దళాలు అడ్డుకున్నాయి.

  • 26 Feb 2022 02:57 PM (IST)

    రష్యా దాడులను ఖండించిన పోలండ్‌

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులు వరుసగా మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడిని పోలండ్‌తో పాటు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని భారత్‌లో పోలండ్‌ రాయబారి ఆడమ్‌ బురాకౌస్కీ తెలిపారు.

  • 26 Feb 2022 01:11 PM (IST)

    భారతీయుల తరలింపు వేగవంతం

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపును విదేశాంగాశాఖ వేగవంతం చేసింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి రొమేనియా రాజధాని బుఖారెస్ట్‌కు చేరుకున్నారు భారతీయ విద్యార్ధులు. ప్రత్యేక బస్సుల్లో విద్యార్ధులను ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తున్నారు. అక్కడినుంచి ఎయిర్‌ఇండియా విమానంలో భారత్‌కు తీసుకొస్తున్నారు.

  • 26 Feb 2022 12:11 PM (IST)

    రెండు దేశాలు సంయమనం పాటించాలిః తాలిబన్

    ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై తాలిబన్ స్పందించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది, పౌర ప్రాణనష్టం నిజమైన సంభావ్యతపై ఆందోళన వ్యక్తం చేసిందని, హింస నుండి విరమించుకోవాలని రష్యా,ఉక్రెయిన్‌లను కోరింది. “ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. పౌర ప్రాణనష్టం నిజమైన సంభావ్యత గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇస్లామిక్ ఎమిరేట్ రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. హింసను తీవ్రతరం చేసే స్థానాలను తీసుకోకుండా అన్ని పక్షాలు విరమించుకోవాలి” అని ప్రకటన పేర్కొంది.

  • 26 Feb 2022 12:07 PM (IST)

    ప్రకాశంజిల్లాకు చెందిన 15 మంది విద్యార్థులు

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల్లో 15 మంది ప్రకాశంజిల్లాకు చెందిన వారు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే హెల్ప్‌ లైన్‌‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077కు ఫోన్‌ చేసి అవసరమైన సమాచారం పొందవచ్చన్నారు.

  • 26 Feb 2022 12:02 PM (IST)

    మాతృదేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన మహిళ

    బాంబు ఉందని తెలిస్తేనే ఆమడ దూరం పారిపోతాం. కానీ ఆ మహిళ యుద్ధట్యాంకులకే ఎదురెళ్లింది. మాతృదేశాన్ని శత్రుమూకల నుంచి కాపాడుకునేందుకు ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి వేగంగా దూసుకొస్తున్నాయి రష్యా సేనలు. ఒక్కసారిగా రష్యా యుద్ధట్యాంకులకు ఎదురెళ్లింది ఉక్రెయిన్‌ మహిళ. మా దేశానికి ఎందుకొస్తున్నారంటూ క్షిపణులకు అడ్డుపడింది. ప్రాణాలకు తెగించి యుద్ధట్యాంకులను ఆపేందుకు యత్నించింది. ఆమెను ఏమాత్రం పట్టించుకోని రష్యా ఆర్మీ.. మహిళను ఢీకొట్టి మరీ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి చొచ్చకెళ్లింది. మాతృదేశం కోసం మహిళపడిన తపన చూస్తే..రోమాలు నిక్కపొడవాల్సిందే.

  • 26 Feb 2022 11:54 AM (IST)

    రష్యాకు భారీ నష్టం: ఉక్రెయిన్

    యుద్ధంలో రష్యాకు భారీగా నష్టం వాటిల్లినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన 14 విమానాలు 8 హెలికాప్టర్లు 102 ట్యాంకులు 536 సాయుధ కార్లు, 15 ఫిరంగి ముక్కలు, 1 BUK-1 వ్యవస్థ, 3,500 మంది మరణించారు, సుమారు 200 మంది బందీలుగా ఉన్నారని ఉక్రెయిన్ పేర్కొంది.

    Ukraine War 2

  • 26 Feb 2022 11:49 AM (IST)

    అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన అధ్యక్షుడు జెలెన్స్కీ

    ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. దేశం విడిచి వెళ్లాలన్న అమెరికా ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. తనకు ఆయుధాలు, రైడ్‌లు అవసరం లేదని అమెరికాకు చెప్పారు. నిజానికి, ఈరోజు రొమేనియా గగనతలంలో మూడు US వైమానిక దళ విమానాలు ఎగురుతూ కనిపించాయి. ఈ విమానాలను జెలెన్స్కీని రక్షించేందుకు అమెరికా నుంచి పంపినట్లు చెబుతున్నారు.

  • 26 Feb 2022 11:47 AM (IST)

    యుద్ధం మరింత ఉధృతం

    యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది రష్యా. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యన్ గ్రామాల్లోని ప్రజలను తరలిస్తున్నారు ఆర్మీ అధికారులు. ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన నేపథ్యంలో రష్యన్ ప్రజలకు నష్టం కలుగకుండా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రొస్తోవ్ ప్రాంతంలోని చెర్త్‌కోవో గ్రామాన్ని ఖాళీ చేయించింది రష్యన్ అధికార యంత్రాంగం

  • 26 Feb 2022 11:45 AM (IST)

    మా ఆర్మీ దాడిలో 3,500 మంది రష్యన్లు బలిః ఉక్రెయిన్

    ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ దాడిలో 3,500 మంది రష్యన్లు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇప్పటివరకు రష్యాకు చెందిన 14 నౌకలు, 8 హెలికాప్టర్లను కాల్చివేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. అలాగే, దాదాపు 200 మంది పట్టుబడినట్లు పేర్కొన్నారు.

  • 26 Feb 2022 11:44 AM (IST)

    ఫ్రీడం స్క్వేర్‌వైపు రష్యా ఆర్మీ

    కీవ్‌లో క్షణమొక యుగంలా బతుకీడుస్తున్నారు ఉక్రెయిన్‌ పౌరులు. రష్యా ఆర్మీ బాంబుల దాడులతో విరుచుకుపడుతోంది. ఫ్రీడం స్క్వేర్‌లో ఓ హోటల్‌ బంకర్‌లో తలదాచుకున్న పౌరులు భయంతో వణికిపోతున్నారు. మూడు గంటలుగా పౌరులు బయటకు రాకుండా భయం గుప్పిట్లోనే గడుపుతున్నారు. క్షణక్షణం ఏం జరుగుతుందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఫ్రీడం స్క్వేర్‌వైపు రష్యా ఆర్మీ దూసుకొస్తోంది. కీవ్‌ ప్రధాన కేంద్రమైన ఫ్రీడం స్క్వేర్‌, దగ్గరలోనే ఉన్న మెట్రో స్టేషన్‌, ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

  • 26 Feb 2022 11:07 AM (IST)

    బుకారెస్ట్ చేరుకున్న ఎయిరిండియా

    ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం AI-1943 రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది.

  • 26 Feb 2022 11:05 AM (IST)

    ఇటలీ ఆందోళనలు

    రష్యా యుధ్ధంపై ఇటలీ వాసులు రగిలిపోతున్నారు.. ఈ దాడిని వ్యతిరేకిస్తూ.. ఇటలీలో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి యుద్ధం ఆపాలంటూ డిమాండ్ చేశారు.

    Italy

  • 26 Feb 2022 11:01 AM (IST)

    ఉక్రెయిన్ నేవీ బేస్ ధ్వంసం

    నల్ల సముద్రం సమీపంలో రష్యాకు చెందిన డ్రోన్‌ను కూల్చేసినట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ నౌకపై రష్యా డ్రోన్ దాడి చేసింది. నల్ల సముద్రంలో ఉక్రెయిన్ నేవీ బేస్ పూర్తిగా ధ్వంసమైంది.

  • 26 Feb 2022 10:59 AM (IST)

    పలు నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరికలు

    ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. Lviv, Lutsk, Uman, Vinnytsia మరియు Rivneలలో దాడి హెచ్చరికలు జారీ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. ప్రజలు షెల్టర్‌లోకి వెళ్లాలని సూచించింది.

  • 26 Feb 2022 10:58 AM (IST)

    బెరెస్టెస్కాయలో రష్యన్ల విధ్వంసం

    మూడోరోజు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం చేసింది. బెరెస్టెస్కాయలో ట్యాంక్‌తో సహా ట్రక్, కారు ధ్వంసమైంది. బెరెస్టెస్కాయ మెట్రో స్టేషన్ వద్ద, 101వ బ్రిగేడ్ ఒక కాన్వాయ్‌ను ధ్వంసం చేసింది. దీనిలో 2 కార్లు, 2 ట్రక్కులు, ఒక ట్యాంక్ ధ్వంసమైంది.

  • 26 Feb 2022 10:53 AM (IST)

    అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన బ్రిటన్ ప్రధాని

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. యుద్ధంలో తాను ఒంటరివాడివి కాదని బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్‌కు చెప్పారు.

  • 26 Feb 2022 10:53 AM (IST)

    అధ్యక్ష భవనమే టార్గెట్‌గా..

    ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నివాస భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా ఆర్మీ బాంబులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌కు చెందిన ఆర్మీ బేస్‌లను వశం చేసుకునేందుకు బాంబుల మోత కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లో సర్కారును మార్చడమే లక్ష్యంగా విరుచుకుపడుతోంది రష్యా ఆర్మీ.

  • 26 Feb 2022 10:47 AM (IST)

    బల్గేరియా గగనతలాన్ని మూసివేసిన రష్యా

    ఉక్రెయిన్ – రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్యలో, ఇప్పుడు బల్గేరియా కూడా రష్యన్ విమానాల కోసం తన గగనతలాన్ని మూసివేసింది.

  • 26 Feb 2022 10:45 AM (IST)

    ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కీలక సూచన

    ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కైవల్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. సరిహద్దు పోస్టుల వద్దనున్న భారత అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా ఉక్రెయిన్ సరిహద్దు పోస్టుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఉక్రెయిన్‌‌ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు భారతీయ పౌరులకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

  • 26 Feb 2022 10:40 AM (IST)

    ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్న వారిలో 22 మంది తెలుగు విద్యార్థులు

    ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్న 470 మంది భారతీయ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే కేరళ నుంచి 17, తమిళనాడు నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

     

  • 26 Feb 2022 10:39 AM (IST)

    భయాందోళనలో విద్యార్థులు

    ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు తెలుగు విద్యార్థులు. సౌత్ ఈస్ట్ ఉక్రెయిన్‌లోని జఫ్రోజియా స్టేట్ మెడికల్ వర్సిటీలోనే ఉండిపోయిన 10మందికి పైగా తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి కాసేపు బంకర్ లో ఆ తర్వాత తిరిగి హాస్టల్ లో గడిపారు. అయితే, సమాచారం లేకుండా హాస్టల్ నుంచి అడుగుబయటపెట్టొద్దని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి మరింత దిగాజారిందని.. బయట నడవటం వంటివి కూడా చేయొద్దని సూచిస్తున్నారు. మరోవైపు, ఇటు భారత్‌లో పిల్లలను తలుచుకుంటూ నిద్రాహారాలు లేకుండా తల్లిదండ్రుల పడిగాపులు కాస్తున్నారు.

  • 26 Feb 2022 10:36 AM (IST)

    ప.గో జిల్లాలో కంట్రోల్ రూమ్

    ఉక్రెయిన్‌లో ఉన్న జిల్లా విద్యార్థుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు చర్చల చేపట్టారు. విద్యార్థుల కోసం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్ల కలెక్టర్ తెలిపారు. ఇందుకు కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08812-224519 అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల సమాచారాన్ని వార్డు, గ్రామ సచివాలయల ద్వారా సేకరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు జారీ చేశారు.

  • 26 Feb 2022 10:33 AM (IST)

    అమెరికాకు చెందిన 2 బాంబర్లు

    నాటో ఇప్పుడు రష్యాకు సమాధానం ఇవ్వబోతోందన్న వార్తలు వెలువడుతున్నాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్ నుండి రెండు అమెరికన్ బాంబర్లు బయలుదేరాయి.

  • 26 Feb 2022 10:32 AM (IST)

    రాజధాని అంతటా సైరన్‌లు

    రాజధాని కీవ్‌లో ఈ ఉదయం నుంచి సైరన్‌లు నిరంతరం మోగుతున్నాయి. ఈ ప్రదేశాలపై ఎప్పుడైనా దాడి చేయవచ్చని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

  • 26 Feb 2022 10:31 AM (IST)

    మరణ హోమం సృష్టిస్తున్న రష్యా

    ఇదేదో పొరపాటుగా జరిగింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రెండోరోజు కూడా పౌరులపై కాల్పులు జరిపాయి రష్యన్‌ దళాలు. దేశం విడిచి వెళ్లిపోతున్న వారిపైనా కనికరం చూపించలేదు. తూటాలకు కారులోనే కుప్పకూలిపోతున్నారు ఉక్రెయిన్‌వాసులు. బలమైన దాడి జరిగే అవకాశం ఉండటంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భూగర్భ బంకర్లన్నీ జనంతో నిండిపోయాయి. మరోవైపు ఉక్రెయిన్‌లోని 23 స్థావరాలపై రష్యా దాడులు చేస్తోంది.

    Russia Ukraine War 2

  • 26 Feb 2022 10:30 AM (IST)

    ఉక్రెయిన్‌లోని విశాఖపట్నం జిల్లా విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    విశాఖపట్నం: ఉక్రెయిన్ లో చిక్కుకున్న విశాఖ జిల్లా వాసులకోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు పనిచేసేలా 0891-2590100 టెలిఫోన్ ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన జిల్లాకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాయం కోసం ఈ నెంబర్‌కు కాల్ చేయొచ్చు.

  • 26 Feb 2022 10:29 AM (IST)

    రష్యా యుద్ధ ట్యాంక్‌ బీభత్సం

    రష్యాకు చెందిన యుద్ధ ట్యాంక్‌.. సాధారణ పౌరులు వెళ్తున్న కారుపైకి దూసుకువెళ్లింది. ఆ కారులో వృద్ధులు ప్రయాణిస్తూ ఉన్నారు. యుద్ధట్యాంక్‌ను ఎక్కించేయడంతో ఆ కారు నుజ్జు నుజ్జు అయింది. అందులో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేస్తున్న వృద్ధులను స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేశారు.

  • 26 Feb 2022 10:26 AM (IST)

    ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమని గడుపుతున్న తెలుగు విద్యార్థులు

    ఉక్రేయిన్ లో చిక్కుకపోయిన తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. సౌత్ ఈస్ట్ ఉక్రెయిన్ లోని జఫ్రోజియా స్టేట్ మెడికల్ వర్సిటీలోనే 10మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉండిపోయారు. రాత్రి కాసేపు బంకర్ లో ఆ తర్వాత తిరిగి హాస్టల్ లో విద్యార్థులు గడిపారు. సమాచారం లేకుండా హాస్టల్ నుంచి అడుగుబయటపెట్టొద్దని వర్సిటీ ఆదేశించింది. పరిస్థితి మరింత దిగాజారిందని.. బయట నడవటం వంటివి కూడా చేయొద్దని ఆదేశించింది. దీంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.  పిల్లలను తలుచుకుంటు నిద్రాహారాలు లేకుండా తల్లిదండ్రుల పడిగాపులు కాస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తమ పిల్లలను దేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • 26 Feb 2022 10:22 AM (IST)

    ఉక్రెయిన్‌లోని ప.గోదావరి జిల్లా విద్యార్థుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు

    ప.గో: ఉక్రేయిన్‌లో ఉన్న జిల్లా విద్యార్థుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సహాయం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంట్రోల్ రూమ్ నెంబర్ 08812-224519కు కాల్ చేయొచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థుల సమాచారాన్ని వార్డు, గ్రామ సచివాలయల ద్వారా సేకరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు జారీ చేశారు.

  • 26 Feb 2022 10:21 AM (IST)

    మా బలగాలు అందుకోసం కాదు: బిడెన్

    తమ బలగాలు యూరప్‌కు వెళ్లడం ఉక్రెయిన్‌లో పోరాడటానికి కాదని, మన నాటో మిత్రదేశాలను రక్షించడానికి అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. అమెరికా బలంతో NATO భూభాగంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుతుందని ఆయన స్పష్టం చేశారు. NATO గతంలో కంటే మరింత ఐక్యంగా బలంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.

  • 26 Feb 2022 10:16 AM (IST)

    రొమేనియా మీదుగా ఇండియాకు విమానం

    రొమేనియా మీదుగా సుసీవా సరిహద్దు వద్ద భారతదేశానికి విమానం బయలుదేరుతోంది. ఇండియా తిరిగి వచ్చేందుకు భారతీయులు ఎక్కుతున్న దృశ్యాలు.

    Russia Ukraine War 1

  • 26 Feb 2022 09:52 AM (IST)

    మాక్సర్ ఉపగ్రహ ఫోటోలు

    ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యా బలగాలు మోహరించడం మాక్సర్ శాటిలైట్ చిత్రాలలో కనిపిస్తుంది.

    Ukraine War

  • 26 Feb 2022 09:43 AM (IST)

    భారతీయుల కోసం ఎయిర్ ఇండియా విమానాలు

    రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఢిల్లీ నుండి బుకారెస్ట్ (రొమేనియా)కి ఎయిర్ ఇండియా మొదటి విమానం, ఇది ఉదయం 10.45 గంటలకు బయలుదేరుతోంది. అదే సమయంలో, రెండవ విమానం సాయంత్రం 4.15 గంటలకు పయనం కానుంది. ఇది ఢిల్లీ నుండి బుడాపెస్ట్ (హంగేరి)కి వెళ్తున్నట్లు కేంద్ర విదేశాంగం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

  • 26 Feb 2022 09:41 AM (IST)

    ఏ సరిహద్దు పోస్ట్‌కి వెళ్లవద్దుః భారత రాయబార కార్యాలయం

    భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్ట్‌లోని ఏ పోస్ట్‌కు వెళ్లవద్దని భారతీయ అధికారులు సూచిస్తున్నారు. భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

  • 26 Feb 2022 09:37 AM (IST)

    ఒడెస్సా నగరంలో పలు పేలుళ్లు

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రతి క్షణం కొత్త ట్విస్ట్ వస్తోంది. నిన్న సాయంత్రం కొంత సేపు నిశబ్దంగా ఉన్న రష్యా మళ్లీ ఉక్రెయిన్‌పై దాడులను ఉధృతం చేసింది. రష్యా విపరీతమైన దాడిని ప్రారంభించిన ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరం నుండి తాజా చిత్రాలు వస్తున్నాయి. ఒడెస్సా నగరంలో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా షరతులు పెడుతోంది. మరోవైపు దాడి కూడా చేస్తోంది.

  • 26 Feb 2022 09:35 AM (IST)

    రష్యా దాడుల తర్వాత ఉక్రెయిన్‌లో తొక్కిసలాట

    రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయే పరిస్థితి కనిపించడంలేదు. యుద్ధం ప్రారంభమై మూడు రోజులైనా రష్యా దాడులు ఆగలేదు. రష్యా దాడుల తర్వాత ఉక్రెయిన్‌లో తొక్కిసలాట జరిగింది. దాడి తర్వాత, ఉక్రెయిన్ ప్రజలు పోలాండ్ వెళ్లేందుకు సరిహద్దులో పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కిలోమీటరు పొడవునా జనం, 15-20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయని చెబుతున్నారు.

  • 26 Feb 2022 09:33 AM (IST)

    స్వీడెన్‌, ఫిన్‌లాండ్‌కు పుతిన్ వార్నింగ్‌

    తాము చెప్పినట్టు వినాల్సిందే, లేదంటే ఉక్రెయిన్‌ గతే పడుతుందంటూ స్వీడెన్‌ అండ్ ఫిన్‌లాండ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు పుతిన్‌. నాటో కూటమిలో చేరే ప్రయత్నం చేయొద్దంటూ డైరెక్ట్‌గా హెచ్చరికలు జారీ చేశారు.

  • 26 Feb 2022 09:28 AM (IST)

    పదవి వ్యామోహాడు పుతిన్

    వ్లాదిమిర్‌ పుతిన్‌, రష్యాకు ఏకఛత్రాధిపతి, 2036 వరకు పుతిన్‌కు ఎదురే లేదు, అంటే ఇంకో పద్నాలుగేళ్లు పుతినే రష్యా ప్రెసిడెంట్‌. పదవీకాంక్షతో ఏకంగా దేశ రాజ్యాంగాన్నే మార్చేసిన అధికారలోలుడు పుతిన్‌.

  • 26 Feb 2022 09:27 AM (IST)

    ఓటింగ్‌కు భారత్ దూరం

    ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని..రష్యా వీటో చేసింది. మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా..ఉక్రెయిన్‌పై దండయాత్రను ఖండిస్తూ ఓటు వేశాయి. అయితే రష్యా తన వీటో అధికారంతో తీర్మానాన్ని తిరస్కరించింది. భార‌త్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

  • 26 Feb 2022 09:27 AM (IST)

    ఐక్య రాజ్య స‌మితిలో రష్యాక వ్యతిరేకంగా తీర్మానం

    ఐక్య రాజ్య స‌మితిలోని భద్రతా మండ‌లిలో అమెరికా, అల్బేనియా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టాయి. వెంట‌నే ఉక్రెయిన్ నుంచి ర‌ష్యా ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశాయి. భద్రతా మండ‌లిలో ఈ ఓటింగ్ భారీ మెజారిటీతో ఆమోదం పొందినా..రష్యా వీటో అధికారంతో ఎలాంటి లాభం లేకుండా పోయింది.

  • 26 Feb 2022 09:03 AM (IST)

    కీవ్‌లోని పలు ప్రాంతాలలో పేలుళ్లు, బుల్లెట్ల వర్షం

    కీవ్‌లోని షుల్యవ్కా, బెరెస్టిస్కా ప్రాంతాలలో పేలుళ్లు, భారీ ఎత్తున కాల్పులు జరిగినట్లు నివేదికలు చెబతున్నాయి. ఈ రోజు ఉక్రెయిన్‌లో మూడవ రోజు యుద్ధం, ఈ ఉదయం 50 కంటే ఎక్కువ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. భారీ మెషిన్ గన్ కాల్పులు షుల్యవ్కా నగర జూ సమీపంలో చోటుచేసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి

  • 26 Feb 2022 09:00 AM (IST)

    యుద్ధం మధ్యలో రెస్క్యూ మిషన్

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాల ద్వారా తరలించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఈరోజు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాలు హంగేరీ, రొమేనియాకు వెళ్లనున్నాయి.

  • 26 Feb 2022 08:59 AM (IST)

    వీడియో విడుదల చేసిన అధ్యక్షుడు జెలెన్స్కీ

    రష్యా దాడులు మరియు రాజధాని కీవ్ ముట్టడి తర్వాత కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ దేశంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో ద్వారా ధృవీకరించారు. వీడియోలో, అధ్యక్షుడు జెలెన్స్కీ, “మేము ఇక్కడ ఉన్నాము. మేము కీవ్‌లో ఉన్నాము. మేము ఉక్రెయిన్‌ను రక్షిస్తున్నాము” అని చెప్పారు. అంతకుముందు, మరొక వీడియోలో, “నేను ఉక్రెయిన్‌లో ఉన్నాను. నా కుటుంబం ఉక్రెయిన్‌లో ఉంది. నా పిల్లలు ఉక్రెయిన్‌లో ఉన్నారు. .. వారు దేశద్రోహులు కాదు.. వారు ఉక్రెయిన్ పౌరులు. నేను శత్రువు దేశం రష్యా మొదటి టార్గెట్‌లో ఉన్నాను. నా కుటుంబం రెండవ టార్గెట్‌లో ఉన్నట్లు మాకు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు.

  • 26 Feb 2022 08:58 AM (IST)

    కీవ్‌లో 5 పెద్ద బాంబు దాడులు

    రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న మూడో రోజు. మూడో రోజు ప్రారంభం కాగానే రాజధాని కీవ్‌లో 5 పెద్ద బాంబు పేలుళ్ల శబ్ధం వినిపించింది.

  • 26 Feb 2022 08:54 AM (IST)

    రష్యా విమానాన్ని కూల్చివేసిన ఉక్రెయిన్

    రాజధాని కీవ్‌కి దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసిల్కివ్ అనే పట్టణానికి సమీపంలో పారాట్రూపర్లను తీసుకువెళుతున్న రష్యా సైనిక రవాణా విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.

  • 26 Feb 2022 08:52 AM (IST)

    అమెరికా లెవల్-4 హెచ్చరిక

    ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉక్రెయిన్‌కు ప్రయాణించే పౌరులకు అమెరికా కీలక సూచన జారీ చేసింది. పౌరుల ప్రయాణానికి సంబంధించి లెవెల్-4 హెచ్చరికను జారీ చేసింది. లెవల్-4లో ప్రయాణించే వ్యక్తులు సున్నిత ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది.

  • 26 Feb 2022 08:50 AM (IST)

    రష్యా అధ్యక్షుడిపై అమెరికా ఆంక్షలు

    ఉక్రెయిన్ – రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని, US ట్రెజరీ డిపార్ట్‌మెంట్ రష్యా అధ్యక్షుడు పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌లపై ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది.

Follow us on