
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. నరేంద్ర మోడీ దేశభక్తుడని..ఆయన నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. భారత ప్రధాని మేకిన్ ఇండియా ఆలోచన ఆర్థికంగా, నైతికంగా ఎంతో గర్వించదగినదని, మోడీ గొప్ప విజన్ ఉన్న నాయకుడు అంటూనే భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటినుంచి భారత్ అన్ని రంగాల్లో శక్తివంతం అవుతుందన్నారు. మాస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ.. . అనేక అంశాలపై స్పందించారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఆధునిక రాజ్యంగా మారడంలో విపురీతమైన పురోగతిని సాధించిందని తెలిపారు. భారత్ తో రష్యాకు ఎలాంటి సమస్య లేదని.. అన్ని విషయాల్లో పరస్పరం సహకరించుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్ లోనూ ఇది కొనసాగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరినట్లుగా ఎరువుల సరాఫరాను పెంచామని..ఇది భారత్ లో వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం భారత్ కు 7.6 రెట్లు అదనంగా ఎరువులు అందిస్తున్నామన్నారు.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఎంతో గర్విస్తోందని… ఆ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. భారత్ తో రష్యాకు ప్రత్యేకమైన బంధాలు ఉన్నాయని పుతిన్ పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందని అన్నారు. రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఏ సమస్య కూడా రాలేదని… ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా రెండు దేశాలు ఇదే అనుబంధాన్ని కొనసాగిస్తాయని పుతిన్ ఆకాంక్షించారు.
ఉక్రెయిన్ పై అణ్వాస్త్రాలను ప్రయోగించాలన్న ఉద్ధేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తిందన్నారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ ఆడుతున్నాయంటూ అమెరికా సహా దాన్ని మిత్రపక్షాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..