Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు.. సీఈవో సహా పలువురు ఉద్యోగుల తొలగింపు.. భవిష్యత్తులో ట్విట్టర్ సేవలు భారం కానున్నాయా..

ట్విట్టర్ యజమానిగా మారిన టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థ సీఈవో సహా పలువురు ఉన్నత ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ఆయన ఓ ఉన్నత ఉద్యోగిని అవమానకరరీతిలో..

Twitter: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు.. సీఈవో సహా పలువురు ఉద్యోగుల తొలగింపు.. భవిష్యత్తులో ట్విట్టర్ సేవలు భారం కానున్నాయా..
Twitter
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 28, 2022 | 12:08 PM

ట్విట్టర్ యజమానిగా మారిన టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థ సీఈవో సహా పలువురు ఉన్నత ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ఆయన ఓ ఉన్నత ఉద్యోగిని అవమానకరరీతిలో సంస్థ నుంచి పంపించివేసినట్లు తెలుస్తోంది. అలాగే ట్విట్టర్ సేవలకు రానున్న కాలంలో రుసుములు వసూలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 44 బిలియన్‌ డాలర్లు విలువ చేసే కొనుగోలు ఒప్పందాన్ని పూర్తిచేయడంతో ట్విట్టర్ సంస్థ ఎలాన్ మస్క్‌ పరమైంది. ఒక్కో షేరుకు 54.20 బిలియన్‌ డాలర్లు చెల్లించి సంస్థను దక్కించుకున్నారు. ఈఏడాది ఏప్రిల్‌లోనే ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నప్పటికీ.. దాదాపు 6 నెలల తర్వాత అది కార్యరూపం దాల్చింది. జులైలో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఎట్టకేలకు అక్టోబరు 28 నాటికి ఏదో ఒకటి తేల్చుకోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో గడువు ముగిసేలోగా ఎలాన్ మస్క్‌ డీల్‌ను పూర్తిచేశారు. ట్విటర్‌ను సొంతం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఎలాన్ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు ఉద్వాసన పలికారు.

పలువురు ఉన్నత ఉద్యోగుల తొలగింపు..

సంస్థ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌; లీగల్‌ పాలసీ హెడ్‌ విజయ గద్దెతో పాటు 2017లో సంస్థలో చేరిన సీఎఫ్‌ఓ నెడ్‌ సెగల్‌, 2012 నుంచి కంపెనీలో కొనసాగుతున్న జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌ ను ఆయా పదవుల నుంచి తొలగించారు. వీరితో పాటు మరికొంత మంది ఉద్యోగులకు కూడా ఎలాన్ మస్క్‌ ఉద్వాసన పలికారు. కొంతమంది ఉద్యోగులను తొలగిస్తారని ముందునుంచి ఊహించినప్పటికి, ఉద్యోగుల పట్ల అవమానకరంగా వ్యవహరించడంతో ఎలాన్ మస్క్ తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత  యాజమాన్యంపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని గతంలోనే ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా జనరల్ కౌన్సిల్ ఎడ్జెట్‌ను స్వయంగా కొంతమంది వ్యక్తులు ట్విటర్‌ కార్యాలయం నుంచి బయటకు పంపినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

2021 నవంబరులో జాక్‌ డోర్సే స్థానంలో పరాగ్‌ అగర్వాల్‌ సీఈఓ బాధ్యతలు స్వీకరించారు. ట్విటర్‌ లీగల్‌ హెడ్‌గా ఉన్న విజయ గద్దె ప్రస్తుతం కంపెనీలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో ఒకరు. అభ్యంతరకరమైన పదాలు, పోస్టులు, వాక్‌ స్వాతంత్ర్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సమయంలో విజయ ట్విటర్‌ను గాడిలో పెట్టేందుకు విపరీతమైన కృషి చేశారు. ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని వినియోగదారుల హక్కుల రక్షణ కోసం అవసరమైన విధానాలను రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించారు.

ఇవి కూడా చదవండి

ఉద్యోగుల్లో ఆందోళన..

ఎలాన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్య హక్కులు పొందడంతో సంస్థలోని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల కోత తప్పదన్న సంకేతాలను ఎప్పటినుంచో ఎలాన్ మస్క్ ఇస్తూ వచ్చారు. రుణాల కోసం బ్యాంకర్లతో జరిపిన చర్చల్లో కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో తమ భవిష్యత్తు ఏంటని ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

 ట్విట్టర్ సేవలు భారం కానున్నాయా..

ట్విట్టర్ సేవలు ప్రస్తుతం ఎటువంటి రుసుము చెల్లించకుండానే వినియోగదారులు వాడుకుంటున్నారు. అయితే ట్విట్టర్ సేవల వినియోగానికి రుసుము వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ట్విట్టర్ వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు ట్విట్టర్ ఖాతా తెరవడం, దానిని వినియోగించడానికి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. దీంతో ట్విట్టర్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య ఎక్కువుగా ఉంది. చాలామంది విద్యార్థులు, యువత దీనిని ఉపయోగిస్తున్నారు. ఒకవేళ రుసుము చెల్లించాల్సి వస్తే ప్రత్యా్మ్నాయ వేదికలపై ఆధారపడే అవకాశం లేకపోలేదు. అయితే ఎలాన్ మస్క్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..