Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాల అనుమానం
Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆలోచిస్తున్నారా? పాకిస్థాన్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
Emergency in Pakistan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ పాలన విధించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan ) యోచిస్తున్నారా? పాకిస్థాన్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఆ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాలు, మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దీంతో భారత్‌లో ఇందిరా గాంధీ(Indira Gandhi) ఎమర్జెన్సీ పాలన విధించిన తరహాలోనే ఇమ్రాన్ ఖాన్ కూడా పాకిస్థాన్ అత్యవసర పాలన విధించే యోచనలో ఉన్నట్లు ఆ దేశంలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితికి తోడు, ప్రజల్లో అసమ్మతి పెరిగిపోవడంతో ఇమ్రాన్ ఖాన్ ఈ ఆలోచన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో సమాఖ్య పార్లమెంటరీ విధానాన్ని బలోపేతం చేయడానికి మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి, సీనియర్ ముస్లిం లీగ్ నాయకుడైన అహ్సాన్ ఇక్బాల్ నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ లో ఒక తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై దాదాపు ప్రతిపక్ష నాయకులందరూ సంతకాలు చేశారు. అంతేకాకుండా రిగ్గింగ్ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. ఇందిరా గాంధీ తరహాలో దేశంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని, భిన్న ఫార్ములాల ద్వారా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే అవకాశముందని గుసగుసలు వినిపిస్తున్నట్లు ఇక్బాల్ ట్వీట్ చేశారు.
మరోవైపు పాక్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకు, అధ్యక్ష తరహా ప్రభుత్వ స్థాపనకు ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ PML (N) ఆరోపణలు చేస్తూనే ఉంది. ఐతే పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ పాలన విధించడం ఒట్టి పుకారని, ఇలాంటి ఫేక్ వార్తలు వ్యాప్తి చెందడానికి అక్కడున్న fake news culture కారణమని పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి చెప్పుకొచ్చారు. దేశంలో ఎమర్జెన్సీ పాలన విధించే యోచన ప్రభుత్వానికి లేదని ఆయన తెలిపారు.
దేశ ఆర్థిక సంక్షోభంపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పాకిస్థాన్‌లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. విదేశీ అప్పులు 127 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ప్రపంచ బ్యాంకు నుంచి పాకిస్థాన్‌కు అప్పులు ముట్టని దుస్థితి నెలకొంటోంది. దీంతో చేసిన అప్పులను తీర్చడం పాక్‌కు కష్టంగా మారుతోంది. ఇమ్రాన్ ప్రజావ్యతిరేక నిర్ణయాల పట్ల దేశంలోని మిలియన్ల మంది మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేదల ప్రజలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అటు మీడియా సంస్థలు కూడా ఇమ్రాన్ ఖాన్ పాలనపై పెదవి విరుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్‌ను నిత్యం ఏకిపారేస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం పాక్ ఆర్థిక పరిస్థితి.. భారత్ ఆర్థిక పరిస్థితితో పోల్చితే ఎంతో మేలుగా ఉందంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
Also Read: