Radha Iyengar Plumb: అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు భారతీయులు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో మరో ఇండో-అమెరికన్ మహిళకు అరుదైన అవకాశం దక్కింది. తాజాగా.. అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వంలో అగ్ర నాయకత్వ పదవులకు ఐదుగురు నామినీలను జూన్ 15న (బుధవారం) వైట్ హౌస్ ప్రకటించింది. వారిలో ఇండో-అమెరికన్ రాధా అయ్యంగార్ ప్లంబ్ కూడా కీలక బాధ్యతల్లో నియామకం అయ్యారు. అయ్యంగార్ కీలకమైన పెంటగాన్ స్థానానికి నామినేట్ అయ్యారు. పెంటగాన్‌లో డిఫెన్స్ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాధా అయ్యంగార్ ప్లంబ్ ప్రస్తుతం US డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ అయిన కాథ్లీన్ హెచ్ హిక్స్‌కి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు.
రాధా అయ్యంగార్ ప్లంబ్‌కు పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వంలో పనిచేసిన విస్తృత అనుభవం ఉంది. దీంతోపాటు విధాన పరిశోధన, భద్రత వ్యవహారాల్లో నైపుణ్యం ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో చేరడానికి ముందు ప్లంబ్… Google సంస్థలో పరిశోధన, విశ్వసనీయత, భద్రతకు సంబంధించిన డైరెక్టర్‌గా పనిచేశారు.
దీంతోపాటు అయ్యంగార్ Facebook గ్లోబల్ హెడ్ ఆఫ్ పాలసీ అనాలిసిస్‌గా కూడా పనిచేశారు. ఈ సందర్భంలో ఆమె అధిక హైరిస్క్/అధిక హాని కలిగించే భద్రతా, క్లిష్టమైన అంతర్జాతీయ భద్రతా సమస్యలపై దృష్టిసారించారు.
Facebookలో ప్లంబ్ నేతృత్వంలోని బృందాలు కంటెంట్, సామాజిక, ఆర్థిక విధాన సమస్యలను పరిశోధించాయి. ఆమె Facebook ఉత్పత్తి విధానాలపై పని చేయడం, ఆర్థిక విలువ, సామాజిక ప్రభావాన్ని పరిశోధించడంపై దృష్టిసారించారు.
ప్లంబ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో అనేక జాతీయ భద్రత సంబంధిత పదవులను నిర్వహించారు.
ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో విద్యను అభ్యసించిన అయ్యంగార్ ఆర్థిక శాస్త్రంలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె ఆగస్టు 2008 నుంచి 2011 వరకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
అక్టోబర్ 2011లో ఆమె అమెరికన్ లాభాపేక్షలేని గ్లోబల్ పాలసీ థింక్ ట్యాంక్ RAND కార్పొరేషన్‌లో సీనియర్ ఆర్థికవేత్తగా చేరారు. అక్కడ, ఆమె డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో సంసిద్ధత, భద్రతా ప్రయత్నాల మూల్యాంకనాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించారు.
ఆగస్ట్ 2006 నుంచి ఆగస్టు 2008 వరకు ప్లంబ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హెల్త్ పాలసీ స్కాలర్‌గా కూడా ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..