హాంకాంగ్ పార్లమెంటులో బీభత్సం.. నిరసనకారులపై పోలీస్ పంజా

దాదాపు నాలుగు వారాలుగా ఆందోళనలు, అల్లర్లతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో సోమవారం పెద్దఎత్తున హింస చెలరేగింది. అనుమానిత నేరస్తులను చైనాకు అప్పగించేందుకు అనువుగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ముసుగులు వేసుకుని, హెల్మెట్లు ధరించి పార్లమెంటులోపలికి దూసుకువెళ్లారు. పార్లమెంటు భవనంలోని నేతల పటాలను చించివేశారు. చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ… గోడలపై రంగులు పూస్తూ… పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. బ్రిటిష్ పాలన ముగిసి..హాంకాంగ్ ను […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 11:42 am, Tue, 2 July 19
హాంకాంగ్  పార్లమెంటులో బీభత్సం.. నిరసనకారులపై పోలీస్ పంజా

దాదాపు నాలుగు వారాలుగా ఆందోళనలు, అల్లర్లతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో సోమవారం పెద్దఎత్తున హింస చెలరేగింది. అనుమానిత నేరస్తులను చైనాకు అప్పగించేందుకు అనువుగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ముసుగులు వేసుకుని, హెల్మెట్లు ధరించి పార్లమెంటులోపలికి దూసుకువెళ్లారు. పార్లమెంటు భవనంలోని నేతల పటాలను చించివేశారు. చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ… గోడలపై రంగులు పూస్తూ… పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. బ్రిటిష్ పాలన ముగిసి..హాంకాంగ్ ను తిరిగి చైనాకు అప్పగించి 22 ఏళ్లయిన రోజే జరిగిన విధ్వంసమిది ! సుమారు నాలుగైదు గంటల అనంతరం పోలీసులు పార్లమెంటును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ తాజా ఘర్షణల్లో సుమారు 53 మంది గాయపడ్డారు. రణరంగం గా మారిన పార్లమెంటు ఆవరణనుంచి ఆందోళనకారులను తరిమివేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. కాగా-ఈ హింసను నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఖండించారు. నేరస్తుల అప్పగింత బిల్లులో కొన్ని సవరణలు చేసి.. ఆందోళనకారులకు నేతృత్వం వహిస్తున్న ఫ్రంట్ నేతలతో సంప్రదింపులు జరపాలని తాము యత్నిస్తుండగా.. నిరసనకారులను ఫ్రంట్ నాయకులు రెచ్ఛగొట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. పోలీసులు సకాలంలో స్పందించి ఈ హింసను, అల్లర్లను అదుపు చేయడం హర్షణీయమన్నారు.
హాంకాంగ్ పాక్షికంగా స్వతంత్ర ప్రతిపత్తి అనుభవిస్తున్నా.. చైనా ఆధిపత్యం మాత్రం ఈ నగరంపై కొనసాగుతోంది. హాంకాంగ్ లోని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు గతంలో ఎన్నడూ లేనంతగా పుంజుకుని..వ్యాపారులు మెల్లగా బిలియనీర్ల స్థాయికి చేరుకోవడంతో చైనా ఈర్ష్య పడుతోందనే వార్తలు వినవస్తున్నాయి. పైగా ఈ సిటీలో టూరిజం కూడా చాలావరకు అభివృధ్ది చెందింది. భౌగోళికంగా సుందర ప్రాంతంగా ఫేమస్ అవుతున్న ఈ నగరానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇండియా వంటి దేశాల నుంచి సినిమా షూటింగులకు ఫిల్మ్ మేకర్స్ ఈ సిటీని ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న హాంకాంగ్ లో అల్లర్లను రెచ్చ్చగొట్టే ఉద్దేశంతోనే చైనా ఈ ‘ నేరస్తుల అప్పగింత ‘ బిల్లును తెచ్చిందన్న విమర్శలు వినవస్తున్నాయి.