AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. భారత్‌కు ఉజ్బెకిస్తాన్ ఎందుకు కీలకం?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ పర్యటనకు అపూర్వ స్వాగతం లభించింది. భారత్‌కు ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మకంగా ఎందుకు కీలకమో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. యురేనియం, బంగారం, సహజ వాయువు వంటి అపారమైన ఖనిజ, ఇంధన సంపదతో ఉజ్బెకిస్తాన్, భారతదేశ శక్తి భద్రత, కీలక ఖనిజాల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను, వాణిజ్యాన్ని బలోపేతం చేయనుంది.

ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. భారత్‌కు  ఉజ్బెకిస్తాన్ ఎందుకు కీలకం?
Pm Modi Uzbekistan Visit
Balaraju Goud
|

Updated on: Aug 30, 2026 | 9:33 AM

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్‌లలో పర్యటిస్తున్నారు. పర్యటనలో తొలి దశగా శనివారం (ఆగస్టు 29) తాష్కెంట్ చేరుకున్న మోదీకి ఉజ్బెక్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, విద్యతో పాటు కీలక ఖనిజ వనరులపై చర్చలు జరుపుతారు.

తాష్కెంట్‌లోని భారతీయ సమాజం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికింది. భారతీయుల ప్రదర్శించిన కథక్, అండిజాన్ పోల్కా నృత్యాలతో పాటు ఉజ్బెక్ చిన్నారులు భారతీయ గీతానికి చేసిన నృత్యాన్ని మోదీ వీక్షించారు. తబలాతో పాటు సాంప్రదాయ ఉజ్బెక్ వాయిద్యాలైన డోయిరా, చాంగ్‌ల ఆకర్షణీయమైన సమ్మేళనాన్ని కూడా వీక్షించారు. అనంతరం అధ్యక్షుడు మిర్జియోయెవ్‌తో కలిసి యాంగీ ఉజ్బెకిస్తాన్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

ఈ పర్యటన సందర్భంగా, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ, అధ్యక్షుడు షవ్‌కత్ మీర్జియోయెవ్‌తో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరపనున్నారు. తాష్కెంట్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అధ్యక్షుడు మీర్జియోయెవ్ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి.

యురేనియం.. ఉజ్బెకిస్తాన్‌కు కీలక బలం!

ప్రధానమంత్రి పర్యటనలో సహజ వనరులు ఎందుకు కీలక అంశంగా మారాయంటే.. ఉజ్బెకిస్తాన్‌లో అపారమైన ఇంధన, ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా యురేనియం ఈ దేశానికి వ్యూహాత్మక ఆస్తిగా మారింది. నవోయి, మధ్య కిజిల్‌కుమ్ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ యురేనియం ఉత్పత్తిదారుల్లో ఉజ్బెకిస్తాన్ ఒకటి.

యురేనియం అణు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన ముడి పదార్థం. ప్రపంచ దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన భద్రత కోసం అణుశక్తిపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో యురేనియం ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. భారత్ కూడా అణు విద్యుత్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నందున.. ఈ రంగంలో ఉజ్బెకిస్తాన్‌తో సహకారం వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశం ఉంది.

యురేనియం వెలికితీతలో ఉజ్బెకిస్తాన్ ఇన్-సిటు రికవరీ పద్ధతిని విస్తృతంగా ఉపయోగిస్తోంది. భారీ స్థాయిలో భూమిని తవ్వకుండానే భూగర్భంలోకి ద్రావణాన్ని పంపించి ఖనిజాన్ని వెలికితీసే ఈ విధానం సంప్రదాయ తవ్వకాలతో పోలిస్తే భూమిపై తక్కువ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

గ్యాస్‌ కూడా భారీగానే..

ఉజ్బెకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో సహజ వాయువు మరో కీలక వనరు. విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, గృహ అవసరాలకు గ్యాస్‌ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ముడి గ్యాస్‌ను కేవలం ఎగుమతి చేయడం కంటే.. దాన్ని దేశీయంగా వినియోగించి పెట్రోకెమికల్, అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయాలనే దిశగా ఉజ్బెకిస్తాన్ ముందుకు సాగుతోంది. చమురు నిల్వలు కూడా ఉన్నప్పటికీ.. గ్యాస్‌తో పోలిస్తే చమురు రంగం పరిమితంగానే ఉంది. పాత క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గడం, కొత్త అన్వేషణకు భారీ పెట్టుబడులు అవసరం కావడం ఈ రంగానికి సవాళ్లుగా ఉన్నాయి.

ప్రపంచ ప్రసిద్ధ మురుంటౌ గోల్డ్ మైన్

ఉజ్బెకిస్తాన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో సహజ సంపద బంగారం. నవోయి ప్రాంతంలోని మురుంటౌ గోల్డ్ మైన్ ప్రపంచంలోని అతిపెద్ద బంగారు గనుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బంగారం ఎగుమతుల ద్వారా ఉజ్బెకిస్తాన్‌కు గణనీయమైన విదేశీ మారకద్రవ్య ఆదాయం లభిస్తోంది. అంతేకాదు.. రాగి, వెండి, జింక్, సీసం వంటి అనేక ఖనిజ నిల్వలు కూడా దేశంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, నిర్మాణ రంగం, పారిశ్రామిక ఉత్పత్తులు, రక్షణ పరిశ్రమలకు ఈ ఖనిజాలు కీలకం కావడంతో భవిష్యత్తులో వీటి ప్రాధాన్యత మరింత పెరిగే అవకాశం ఉంది.

భారత్‌కు ఎందుకు కీలకం?

ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, రక్షణ రంగాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా Critical Mineralsకు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో మధ్య ఆసియాలోని ఖనిజ సంపద భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా మారుతోంది. ఉజ్బెకిస్తాన్‌తో భారత్‌ ఇప్పటికే ఔషధాలు, ఆరోగ్యం, విద్య, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో సంబంధాలను పెంచుకుంటోంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు కూడా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే భౌగోళికంగా మధ్యలో ఉన్న దేశాల కారణంగా నేరుగా వాణిజ్య రవాణా ఒక సవాలుగా ఉంది. చాబహార్ పోర్టు, మధ్య ఆసియాకు అనుసంధాన మార్గాలు ఈ సమస్యకు పరిష్కారంగా మారే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యత

మధ్య ఆసియాలో చైనా, రష్యా, యూరప్ తదితర శక్తుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ కూడా తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. భద్రత, ఇంధనం, ఖనిజాలు, వాణిజ్యం, కనెక్టివిటీ వంటి అంశాల్లో ఉజ్బెకిస్తాన్‌తో భాగస్వామ్యం భారత్‌కు ప్రయోజనకరంగా మారవచ్చు. అణుశక్తి రంగంలోనూ భవిష్యత్తులో సహకారానికి అవకాశాలు ఉన్నాయి. అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఉజ్బెకిస్తాన్ చూస్తుండగా.. ఈ రంగంలో భారతదేశానికి ఉన్న అనుభవం ఇరు దేశాలకు ఉపయోగపడే అవకాశం ఉంది.

మొత్తంగా ప్రదాని మోదీ పర్యటనను కేవలం దౌత్య పర్యటనగా కాకుండా ఇంధన భద్రత, Critical Minerals, వాణిజ్య మార్గాలు, రక్షణ సహకారం, మధ్య ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాల నేపథ్యంలో చూడాల్సి ఉంది. ఉజ్బెకిస్తాన్ భూగర్భ సంపద.. రాబోయే రోజుల్లో భారత్‌తో దాని సంబంధాలను మరింత కీలకంగా మార్చే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us