రాత్రికి రాత్రే 23 కి.మీ మాయమైన సముద్రం.. ప్రమాదానికి సంకేతం?
అర్జెంటీనా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం రాత్రికి రాత్రే 23 కిలోమీటర్లు వెనక్కు వెళ్లింది. రాబోయే ప్రకృతి విపత్తుకు ఇది ముందస్తు సంకేతమా? దీని వల్ల సునామీ సంభవిస్తుందా? సముద్రం తీరంలో ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కొత్త ద్వీపం పుట్టుకొచ్చిందా?
అర్జెంటీనాలో సముద్రం రాత్రికి రాత్రే “మాయమైంది” అంటూ సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ పర్యాటక నగరం మార్ డెల్ ప్లాటా తీరంలో రాత్రికి రాత్రే సముద్రం 23 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. నీటి మట్టం తగ్గి రాళ్లు తేలడంతో జనం షాకవుతున్నారు. సముద్రంలో నడుచుకుంటూ వెళ్లి వీడియోలు పోస్టు చేస్తున్నారు. నీరు తగ్గడం వల్ల శిలా నిర్మాణం ఒకటి బయటపడింది. నీటి కింద ఉండే ఆ రాతి నిర్మాణం హఠాత్తుగా కనిపించేసరికి పర్యాటకులు ఏదో కొత్త ద్వీపం పుట్టుకొచ్చిందని భావించారు. అయితే మహాసముద్రం కనుమరుగైపోలేదనీ పర్యావరణ మార్పు వల్ల ఇలా జరిగిందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
సముద్రం వెనక్కు వెళ్లడం రాబోయే ప్రకృతి విపత్తుకు హెచ్చరిక కేవలం ఊహాగానాలని, అసలు కారణాలు ఏమై ఉంటుందనే దానిపై అర్జెంటీనా సైంటిస్ట్ లు క్లారిటీ ఇచ్చారు. వీడియోలు వైరల్ కావడం పై స్పష్టత ఇచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా అలా జరిగిందనీ, సముద్రపు ఆటుపోట్ల చక్రంలో భాగమేనని వివరించారు. ఒక్కోసారి వీచే బలమైన గాలుల కారణంగా తీరం నుంచి నీరు వెనక్కి నెట్టివేయబడుతుందని, దీనిని ‘విండ్ సెట్ డౌన్’ లేదా ‘లో టైడ్ సైకిల్’ అంటారని విశ్లేషించారు. దీనివల్ల సునామీ వస్తుందనే అపోహ వద్దు అనీ, సముద్రగర్భంలో భూకంపాలు వచ్చినపుడే సునామీ సంభవిస్తుందని తెలిపారు. కాగా, సాధారణ పోటు తర్వాత అదే రోజు సముద్రపు నీరు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది.