
PM Modi: ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా సంచలనం సృష్టిస్తారు. ఆస్ట్రేలియాలో కూడా అదే జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. తన ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో 18 ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో అత్యంత ముఖ్యమైన ఒప్పందం యురేనియంకు సంబంధించింది. ఆస్ట్రేలియాలో తన చారిత్రాత్మక పర్యటన తర్వాత, ప్రధాని మోదీ ఇప్పుడు న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాలో తన చారిత్రాత్మక పర్యటన జరిగిన మరుసటి రోజే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి వార్తాపత్రికల ముఖ్యాంశాలలో నిలిచారు. ఒక ఆస్ట్రేలియా వార్తాపత్రిక కాలమిస్ట్ ఆయనను ‘మిస్టర్ ఇండియా’ అని కూడా సంబోధించారు. అంతేకాదు, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో ప్రధాని మోదీ జరిపిన సంభాషణను అక్కడి ప్రధాన వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
ఆస్ట్రేలియా వార్తాపత్రిక ప్రధాని మోదీ పర్యటనను తన ముఖపత్రంలో ప్రచురించింది. “వాణిజ్యం, రక్షణ రంగాలలో మోదీ బహుమతులు తెచ్చారు” అని శీర్షిక పేర్కొంది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మరో ప్రముఖ వార్తాపత్రిక ‘ది ఏజ్’ కూడా ప్రధాని మోదీ పర్యటనను తన మొదటి పేజీలో ప్రచురించి, ‘అల్బనీస్ ‘మోదీ ఆపరేండీ’, అంటే మోదీ పనులు చేసే విధానం’ అనే మూడు పదాల శీర్షికను పెద్ద అక్షరాలతో ప్రచురించింది.
ప్రధానమంత్రి మోదీ ఈ పర్యటన సందర్భంగా యురేనియం ఎగుమతి, పునరుత్పాదక ఇంధనం, కీలక ఖనిజాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలలో సహకారాన్ని పెంచుకోవాలని భారత్, ఆస్ట్రేలియా దేశాలు ప్రకటించాయి. శాంతియుత అణుశక్తి వినియోగం కోసం ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి యురేనియం ఎగుమతి చేయడానికి ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. భారతదేశం తన అణు విద్యుత్ సామర్థ్యాన్ని విస్తరించాలనే ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, అలాగే ఆస్ట్రేలియా వనరుల రంగానికి మరో మార్కెట్‌ను అందించడం ఈ ఒప్పందం లక్ష్యం.
మెల్బోర్న్లో ఒప్పందాన్ని ఖరారు చేసిన అనంతరం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ, “ఆస్ట్రేలియా, భారతదేశం కేవలం సన్నిహిత భాగస్వాములే కాదు, గొప్ప మిత్రులు కూడా” అని అన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం చారిత్రాత్మక అవకాశాలను అందిస్తుందని అన్నారు. భారతదేశంలోని రోడ్లు, ఓడరేవులు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆస్ట్రేలియా కంపెనీలను ప్రోత్సహించారు.
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అల్బనీస్, ప్రధాని మోదీని ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య ఒక శక్తివంతమైన వారధిగా అభివర్ణించారు. ఆయన నాయకత్వం ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించడంలో సహాయపడిందని అన్నారు. ప్రధాని మోదీ మెల్‌బోర్న్‌లో భారతీయ సమాజానికి చెందిన ఒక భారీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ వేలాది మంది ప్రజలు “మోదీ, మోదీ” అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానిగా తాను ఆస్ట్రేలియాలో చేస్తున్న మూడవ పర్యటన, భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు బలపడుతున్నాయని తెలియజేస్తోందని ఆయన అన్నారు.
PM Modi coverage all over Australian newspapers. A columnist calls him “Mr India” #Melbourne pic.twitter.com/2tkb9qzGiy
— Aman Sharma (@AmanKayamHai_) July 9, 2026
ప్రపంచ క్రీడా రాజధానిగా పేరొందిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసేందుకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా ప్రీమియర్ జసింటా అలెన్‌లతో కలిసి మెల్బోర్న్ గ్రౌండ్‌ను సందర్శించారు.క్రీడలను దౌత్యానికి వారధిగా వాడుకుంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మెల్బోర్న్‌లో వచ్చి క్రీడల గురించి మాట్లాడకపోతే క్రికెట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ చేయకుండా వదిలేసినట్లే అవుతుంది అంటూ తనదైన శైలిలో చమత్కరించారు.ఇరు దేశాల బంధాన్ని క్రికెట్ ఫార్మాట్లతో పోలుస్తూ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆస్ట్రేలియా సమావేశాలు వన్డే మ్యాచ్ అంత ఫోకస్డ్‌గా సాగుతాయి.. మన నిర్ణయాలు T20 మ్యాచ్ అంత వేగంగా ఉంటాయి.. అలాగే మన భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ అంత పటిష్టంగా, లోతుగా ఉంటుందన్నారు
ప్రజలను ఏకం చేయడంలో క్రీడలకు మించిన శక్తి లేదని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
మెల్బోర్న్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఇరుదేశాల ప్రధానులు సంయుక్తంగా భారత్-ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్‌మ్యాప్ ను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఇది సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లనుంది. ఇరు దేశాల క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు త్వరలోనే భారత్-ఆస్ట్రేలియా యువజన క్రీడా ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. స్పోర్ట్స్ సైన్స్, అత్యాధునిక క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమలో పెట్టుబడుల పెంపుదల, శిక్షణ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి.రాబోయే కాలం అంతర్జాతీయ క్రీడల్లో ఇరు దేశాలకు ఎంతో ప్రాముఖ్యమైనదని ప్రధాని గుర్తు చేశారు. 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడలకు అలాగే 2032లో ఆస్ట్రేలియా బ్రిస్బేన్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, క్రీడా మౌలిక వసతుల కల్పనలో, క్రీడా అనుబంధ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఇరు దేశాలకు ఇదొక సువర్ణావకాశమని మోదీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా క్రీడా దిగ్గజాలు స్టీవ్ వా, లీసా స్థలేకర్ కూడా పాల్గొన్నారు. మైదానంలో కబడ్డీ, ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్, క్రికెట్ ప్రదర్శన మ్యాచ్‌ల్లో పాల్గొన్న యువ అథ్లెట్లతో ప్రధానులు ముచ్చటించి, వారిని ఉత్సాహపరిచారు.చిన్నారులకు మోదీ ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్చ చేయండి