Earthquake: పెను విషాదం మిగిల్చిన భూకంపం.. అండగా ఉంటామని ప్రధాని మోడీ భరోసా..

|

Feb 06, 2023 | 3:19 PM

ప్రకృతి ప్రకోపానికి సిరియా, టర్కీ చిగురుటాకుల్లా వణికిపోయాయి. సోమవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపం బీభత్సం సృష్టించింది. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. శిథిలాలు...

Earthquake: పెను విషాదం మిగిల్చిన భూకంపం.. అండగా ఉంటామని ప్రధాని మోడీ భరోసా..
Earthquake
Follow us on

ప్రకృతి ప్రకోపానికి సిరియా, టర్కీ చిగురుటాకుల్లా వణికిపోయాయి. సోమవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపం బీభత్సం సృష్టించింది. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. “టర్కీలో భూకంపం కారణంగా ప్రాణనష్టం & ఆస్తి నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. భారతదేశం టర్కీ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఈ విషాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది, ‘ అని ట్వీట్ చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా విచారం వ్యక్తం చేశారు.

భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 560 మందికిపైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. టర్కీలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని సిరియన్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయకచర్యలు చేపట్టారు. దక్షిణ టర్కీ ప్రావిన్స్‌లోని ఉస్మానియేలో 15మంది మృతి చెందినట్టు ప్రకటించారు అధికారులు. చాలా భవనాలు కుప్పకూలాయి. 7.8 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చని తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..