
Pervez Musharraf Health Condition: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ జీవిత చరమాంకంలో అయినా స్వదేశానికి వెళ్లాలనే కోరిక నెరవేరేలా లేదు.. తీవ్ర ఆనారోగ్యంతో దుబాయిలో చికిత్స పొందుతున్న ముషరఫ్ స్వదేశానికి వచ్చేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడాయన దుబాయి విడచి పాకిస్తాన్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు విచిత్రమైన కారణం చెబుతున్నారు. అరుదైన (Amyloidosis) వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్ చికిత్సకు అవసరమైన మందు పాకిస్తాన్‌లో దొరకదని పేర్కొంటున్నారు
పర్వేజ్ ముషారఫ్ అత్యంత అరుదైన అమైలాయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన శరీరంలో పెద్ద సంఖ్యలో ప్రోటీన్లు జమ కావడంతో అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అమైలాయిడోసిస్ వ్యాధికి చికిత్స అందించేందుకు దారాతుముమాబ్ (Daratumumab) అనే మందును ఉపయోగిస్తారు. ఈ మందు పాకిస్తాన్‌లో దొరకదని చెబుతున్నారు. దీంతో ముషరఫ్ దుబాయిలోనే ఉండి చికిత్స పొందక తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం ముషరఫ్ చనిపోయినట్లు పుకార్లు కూడా రాగా కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన బతికే ఉన్నారని.. చనిపోలేదని ప్రకటించారు.
ముషారఫ్ 1999లో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై సైనిక తిరుగుబాటు చేసి పాక్ పాలనా పగ్గాలు చేపట్టారు. 2008 లో ఎన్నికల తర్వాత దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా నవంబర్-3, 2007లో పాక్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు గాను మార్చి-31,2014న ముషార్రఫ్ పై దేశద్రోహం కేసు నమోదైంది. దీంతో మెడికల్ ట్రీట్మెంట్ కోసమంటూ 2016 మార్చిలో పాక్ విడిచి దుబాయ్ వెళ్లిన ఆయన తిరిగి పాక్ వెళ్లలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..