బంగ్లాదేశ్‌ను(Bangladesh) భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 32 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గత వారం బంగ్లాదేశ్, భారత్‌లోని(India) ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో బంగ్లాదేశ్ లో భారీగా వరదలు వచ్చాయి. సిల్హెట్, సుమన్‌గంజ్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. సిల్హెట్ రైల్వేస్టేషన్‌లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదల కారణంగా ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా అక్కడకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ వరదల(Floods in Bangladesh) కారణంగా దాదాపు 16 లక్షల మంది చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈశాన్య భారత రాష్ట్రమైన బిహార్‌లో, శనివారం పిడుగుపాటుకు 17 మంది మరణించారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. బంగ్లాదేశ్‌కు సరిహద్దుగా ఉన్న మేఘాలయలో జూన్ 9 నుంచి ఇప్పటి వరకు 24 మంది మరణించగా.. ముగ్గురు గల్లంతయ్యారు.
బంగ్లాదేశ్‌లో వరదల కారణంగా రోడ్లు మునిగిపోవడంతో రవాణా స్తంభించింది. టెలీ కమ్యూనికేషన్ సేవలు లేకపోవడం వల్ల పూర్తి వివరాలు తెలుసుకోవడంలో ఆలస్యం అవుతోంది. సునమ్ గంజ్‌లో దాదాపు 90% ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. తాత్కాలిక సహాయక శిబిరాల్లో లక్షలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఆహారం, ఆశ్రయం కల్పిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. చిట్టగాంగ్‌లో కొండచరియలు కూలిపడి మరో నలుగురు చనిపోయారు. వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో బంగ్లాదేశ్ లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
కేవలం గంటల వ్యవధిలోనే గ్రామాల్లోకి వరద నీరు వచ్చేసింది. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సైనిక బలగాలు రంగలోకి దిగాయి. పాఠశాలలు నిరాశ్రయులకు ఆశ్రయ కేంద్రాలుగా మారాయి. తమ జీవితాల్లో ఇంతటి వరద బీభత్సాన్ని ఎన్నడూ చూడలేదని పలువురు చెబుతున్నారు. గత నెల చివరిలో కూడా సిల్హెట్‌లో దాదాపు 20 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో వరదలు సంభవించాయి. పది మంది మరణించగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి